వైరలవుతోన్న 87ఏళ్ల బామ్మ ప్రేమ కథ

87 Year Old Finds Match on Dating Site - Sakshi

ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. కానీ ఏ వయసు వారికి అయినా సరే తమను ప్రేమించే మనిషి కావాలి. ముఖ్యంగా జీవిత చరమాంకంలో తోడు లేకుండా బతకడం ఎంత దుర్భరంగా ఉంటుందో అనుభవించే వారికే తెలుస్తుంది. అందుకే ఈ మధ్య కాలంలో లేటు వయసులో వివాహం చేసుకుంటున్న వారి సంఖ్య బాగా పెరుగుతుంది. తాజాగా ఇలాంటి లేటు వయసు ప్రేమ కథ ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాలు.. అమెరికాకు చెందిన జెన్‌ రోసెన్‌(87) భర్త 2007లో మరణించాడు. భర్త మరణం రోసెన్‌ను బాగా కృంగదీసింది. జీవితం శూన్యంగా మారినట్లు భావించింది. ఇలాంటి సమయంలో రోసెన్‌ మనవరాలు కార్లీ లేక్‌ ఆమెకు తోడుగా నిలిచింది. మనవరాలు చూపించే ప్రేమంతో రోసెన్‌ నెమ్మదిగా ఆ బాధ నుంచి కోలుకుంది. 

అంతా బాగుంది అనుకున్న సమయంలో కార్లీ ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. దాంతో మరోసారి రోసెన్‌ ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుందని బాధపడసాగింది కార్లీ. ఈ సమస్యకు ఓ శాశ్వత పరిష్కారం ఆలోచించాలనుకుంది. ఈ క్రమంలో 87 ఏళ్ల వయసులో తన బామ్మ కోసం ఓ తోడును వెతకాలని భావించింది కార్లీ. మ్యాచ్‌.కామ్‌లో బామ్మ వివరాలు పొందుపర్చింది. కొద్ది రోజుల తర్వాత బామ్మకు సరిపోయే వ్యక్తి విక్‌ వైట్‌(84)ను కలిసింది. విక్‌ విశ్రాంత ఆపరేషన్‌ మానేజర్‌. రోసెన్‌ లాగానే కొన్నేళ్ల క్రితం అతడి భార్య మరణించింది. స్నేహితులు మ్యాచ్‌.కామ్‌లో అతడి వివరాలు పొందు పర్చారు. 

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి విక్‌-రోసెన్‌లు కాలిఫోర్నియాలో కలిసి ఉంటున్నారు. ఈ సందర్బంగా విక్‌ మాట్లాడుతూ.. ‘మొదటి సారి మేం కాఫీ షాప్‌లో కలుసుకున్నాం. మూడు గంటల పాటు మాట్లాడుతూనే ఉన్నాం. కాఫీకని వచ్చిన వాళ్లం చివరకు లంచ్‌ చేసి వెళ్లాం. అలా మొదటి రోజు నుంచే మేం ఒకరికి ఒకరం బాగా నచ్చాం’ అన్నాడు. రోసెన్‌ మాట్లాడుతూ.. ‘కరోనా కష్టకాలంలో మేం ఒకరికి ఒకరం తోడుగా ఉన్నాం. ప్రతి నిమిషం సంతోషంగా కలసి జీవిస్తున్నాం. నా కుమార్తె ‘అమ్మ నువ్వు చాలా ఫాస్ట్‌ అయ్యావ్‌ అన్నది’. అప్పుడు నేను.. ‘ఇప్పుడు నాకు 87 సంవత్సరాలు. విధవరాలిగా 13 ఏళ్లు బతికాను. ఇంకా ఎంత కాలం ఇలా ఉండాలి.. దేని కోసం నిరీక్షించాలి’ అని ప్రశ్నించాను. దానికి తన దగ్గర సమాధానం లేదు’ అన్నది.

అంతేకాక ‘జీవిత చరమాంకంలో నాకు ఇంత మంచి బహుమతి ఇచ్చిన నా మనవరాలికి కృతజ్ఞతలు. తను ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలి’ అన్నారు రోసెన్‌. బామ్మ సంతోషంతో స్ఫూర్తి పొందిన కార్లీ.. జీవిత చరమాంకంలో ఒంటరిగా ఉంటూ తోడు కోసం వెతుకుతున్న వారి కోసం ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించే యోచనలో ఉంది. బామ్మ సంతోషం కోసం మనవరాలు చేసిన ప్రయత్నం పట్ల నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top