
సాక్షి, సిద్దిపేట: కరవు ప్రాంతంగా ఉన్న తెలంగాణకు గోదావరి నీళ్లతో కాళ్లు కడిగి కష్టాలు తీర్చాలన్న తపనతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మహా యజ్ఞం మాదిరి చేపట్టామని రాష్ట్ర భారీనీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లాలోని చంద్లాపూర్ ప్రాంతంలో నిర్మిస్తున్న రంగనాయకసాగర్ రిజర్వాయర్ పనులను రెండో రోజు పరిశీలించారు.
ఈసందర్భంగా మంత్రి బైక్‌పై ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. కాళేశ్వరం నుంచి నీటిని తరలించే విధానం, పంపులు పనిచేయడం, అక్కడి నుంచి రంగనాయక సాగర్, మల్లన్నసాగర్ రిజర్వాయర్లకు నీళ్లు నింపడం మొదలైన అంశాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకొన్నారు. ఇంజనీర్లు, కార్మికులు, అధికారులు అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. అందరి కష్టం, శ్రమ అంతా కరువును తరమి కొట్టాలన్నదే అని మంత్రి వివరించారు. అదేవిధంగా రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లో కట్టను మంత్రి పరిశీలించి నీటి సామర్థ్యం తట్టుకునేందుకు చేపట్టిన అధునాతన పద్దతులు, నల్లమట్టి, ఇసుకతో నిర్మాణలతో ఉపయాగాలను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని, వచ్చే ఖరీఫ్ నాటికి రైతులకు నీళ్లు ఇచ్చేలా పనులు జరగాలని మంత్రి ఆదేశించారు.