కాలువ పేరుతో కోట్లు దోపిడీ

Pending Kavali Canal Project In PSR Nelluru - Sakshi

సాక్షి, కావలి: నిన్నటి వరకు కావలి అధికార పార్టీ నాయకులుగా బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్రలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వ నిధుల దోపిడీని యథేచ్ఛగా కొనసాగించారు. నిధుల లూటీలో ఒక వనరుగా ‘కావలి కాలువ’ను ఎంచుకొన్నారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో కావలి కాలువ మరమ్మతుల కోసం రూ.55 కోట్లు నిధులు మంజూరయ్యాయి. బీద సోదరులు బినామీలుగా అవతరించి తెరమీద ఉతుత్తి కాంట్రాక్టర్లను పెట్టి, తెర వెనుక ఈ నిధులను కొల్లగొట్టే పనిని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.

నియోజకవర్గానికి ఉన్న ప్రధాన సాగునీటి వనరు కావలి కాలువ. సాగునీటిని సంగం బ్యారేజ్‌  నుంచి ప్రారంభమయ్యే కావలి కాలువకు సోమశిల ప్రాజెక్ట్‌ నుంచి వదులుతారు. 1974లో నిర్మించిన కావలి కాలువ 67 కిలోమీటర్ల పొడవు ఉంది. కాగా కావలి కాలువ కింద ఉండే పొలాలకు మాత్రం సోమశిల జలాలు ఏనాడు పుష్కలంగా అందిన దాఖలాలు లేవు. ఏటా ఒక్క రబీ సీజన్‌లో మాత్రమే ఒక్క కారు మంటనే రైతులు ఈ కాలువ కింద 1.50 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. అయితే వర్షాలు బాగా కురిసి చెరువుల్లో గుంటల్లో, వాగుల్లో నీరు ఉంటే మాత్రం రైతులు ఈ జలాలపై ఆశలు పెట్టుకోరు. టీడీపీ అధికారంలో ఉన్న ఈ ఐదేళ్ల కాలంలో వర్షాలు కురవకపోవడంతో సోమశిల జలాలపై ఆశలు పెటుకున్న రైతులకు ఆ నీరు రాక పంటలు సాగు చేసుకోలేక పోయారు. దీనివల్ల నియోజకవర్గంలోని 40 వేల ఎకరాల భూమి బీడుగా మారిపోయింది.

కరెంట్‌ మోటార్ల కింద సాగు చేసిన రైతులు అరకొరగా పండించుకొన్నారు. కనీసం ఆరుతడి పంటలైన పత్తి, పెసర, శనగ సాగు చేసుకోవడానిరి కూడా కావలి కాలువ ద్వారా సోమశిల జలాలు రైతులకు అందలేదు. దీంతో కొద్దిపాటి సాగునీరు కూడా లేక ఆరుతడి పంటలు ఎండిపోవడంతో కావలి కాలువ కింద రైతులు తీవ్రంగా నష్టపోయారు. సరిగ్గా రైతులు సాగునీటి సమస్యతో కుమిలిపోతున్న వైనాన్ని గుర్తించి, కాలువ మర్మమ్మతుల పేరుతో ఈ ఐదేళ్ల కాలంలో రూ.55 కోట్లు మంజూరు అయినప్పటికీ, నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. సోమశిల జలాలు మాత్ర కావలి రైతులకు చుక్క కూడా అందలేదు. ఇది ఇలా ఉండగా ఇటీవల రూ.17 కోట్లు నిధులు కాలువ మరమ్మతులకు మంజూరు అయ్యాయి. ఈ నిధులను కూడా బినామీల ద్వారా కాజేయడానికి త్వరితగతిన టెండర్లు పూర్తి చేయాలని హడావుడి చేశారు. కాని ఆదివారం ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటంతో ఈ లూటీ వ్యవహారాన్ని పక్కన పెట్టేశారు.

ఐదేళ్లలో నీళ్లు చూడనేలేదు

మా గ్రామాలకు సోమశిల నీళ్లు అనేది ఈ ఐదేళ్లలో చూడలేదు. వర్షాలు కూడా లేకపోవడంతో వరి సేద్యం చేయడమే మానుకున్నాం. భూములు బీడులుగా మారిపోయాయి.-  జంపాని రాఘవులు గౌడ్, రైతు, చెంచుగానిపాళెం, కావలి రూరల్‌ మండలం

సాగునీరు ఇవ్వకుండా జలపూజలు 

పొద్దస్తమానం జలపూజ అంటూ టీడీపీ నాయకులు కాలక్షేపం చేశారే కానీ, కావలి కాలువ నుంచి మా పొలాలకు సాగునీటిని అందించలేదు. ప్రతి రబీ సీజన్‌కు ముందు ప్రతి ఒక్క ఎకరా కు నీరు ఇస్తామని సినిమా డైలాగులు చెప్పడం, పేపర్లులో రాయించుకోవడం తప్ప అసలు నీరు ఎక్కడ ఇచ్చారు. ఇలాగే గడిచిపోయింది ఈ ఐదేళ్ల కాలం అంతా.- చీకుర్తి కోటయ్య యాదవ్, రైతు, అన్నగారిపాలెం, కావలి రూరల్‌ మండలం 

Read latest SPSR Nellore News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top