'వాటిలో చంద్రబాబు దిట్ట.. అందుకే రాజీనామాలు చేశాం'

YSRCP MP Mekapati Rajamohan Reddy Slams CM Chandrababu Naidu And Modi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాలు చేయడంలో దిట్ట అని వైఎస్సార్‌ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధనకు రాజీనామా అస్త్రాలను సంధించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీపై నిప్పులు చెరిగారు. విభజన సమయంలో తమను సభ నుంచి బయటకు పంపించి రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని ఆవేదన వ్యక్తం చేశారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీ అన్ని రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా కావాలని అప్పట్లో బీజేపీ నేతలు డిమాండ్‌ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

అవకాశవాద రాజకీయాల్లో బాబు దిట్ట
ఎన్నికల ప్రచార సమయంలో మోదీ, చంద్రబాబు, పవన్‌ కలిసి బీజేపీ అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం మొండి చేయి చూపిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాల్లో దిట్ట అని ఎద్దేవా చేశారు. బీజేపీతో ఎప్పుడు కలవబోమని చెప్పిన బాబు టీఆర్‌ఎస్‌, లెఫ్ట్‌ పార్టీలతో కలిసి పోటీచేశారని గుర్తు చేశారు. 2009 ఎన్నికల్లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఒక్కరే 33 ఎంపీ సీట్లు గెలిపించారని అన్నారు. వైఎస్‌ఆర్‌ వల్లే యూపీఏ-1, 2 ప్రభుత్వాలు నిలబడ్డాయిని తెలిపారు. ఆయన మరణానంతరం ఏపీకి చాలా కష్టాలు వచ్చాయని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఓదార్పుయాత్ర చేపట్టొద్దంటూ సోనియా గాంధీ ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన విషయాన్ని ఆయన మీడియా సమక్షంలో గుర్తు చేశారు. కానీ జననేత మాత్రం నల్లకాలువలో ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర చేశారని మేకపాటి పేర్కొన్నారు.

వైఎస్‌ జగన్‌ వల్లే హోదా సజీవంగా ఉంది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ అన్నిరకాలుగా అభివృద్ధి చెందిందని, 60 శాతం ఆదాయం అక్కడ నుంచే వచ్చే సమయంలో రాష్ట్రాన్ని విడగొట్టారని మేకపాటి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ఐదేళ్లు హోదా ఇస్తామని చెప్పారని, కేబినెట్‌ కూడా ఆమోదం తెలిపి, ప్లానింగ్‌ కమిషన్‌కు పంపారని అన్నారు. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన బాబు హోదాను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ప్రత్యేక హోదా వచ్చుంటే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెంది ఉండేదన్నారు. హోదాను చంద్రబాబు పట్టించుకోకపోయినా, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పోరాటం ద్వారా ఆ డిమాండ్‌ను సజీవంగా ఉంచారని తెలియచేశారు. ఇందుకోసం కేంద్రంపై అవిశ్వాసం పెట్టడంతో పాటు, హోదా సాధనకు ఎంపీలతో రాజీనామా చేయిస్తామని చెప్పారని తెలిపారు.

ఆయన ఒక యూటర్న్‌ మాస్టర్‌
తాము అవిశ్వాసం పెడతామని అనగానే మద్దతు ఇచ్చిన చంద్రబాబు రాత్రికి రాత్రే యూటర్న్‌ తీసుకున్నారని మేకపాటి మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానానికి అన్నిపార్టీల మద్దతు కూడగడితే.. ఆ క్రెడిట్‌ తమదేనని అనుకూల మీడియాతో చెప్పించుకున్న ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. పోలవరం పూర్తి అయ్యింటే రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేదని, పోలవరాన్ని కేంద్రమే భరించాల్పి ఉన్నా చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకొని రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ప్రధాని, సీఎం చం‍ద్రబాబు చేసిన ద్రోహానికి నిరసనగా ప్రజల రుణం తీర్చుకునేందుకే ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా కోసం తాము చేపట్టిన ఆమరణ దీక్షను పెద్దమనసుతో దీవించాలని మేకపాటి ప్రజలను కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top