2019 తర్వాత ఆ 3 పార్టీలు కనపడవ్‌: ఇక్బాల్‌

YSRCP MLA Candidate Mohammed Iqbal Slams TDP Government In Hindupur - Sakshi

అనంతపురం జిల్లా: జనసేన, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల రహస్య పొత్తులు, బంధాలు ప్రజలు గమనిస్తున్నారని వైఎస్సార్‌సీపీ హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి మహ​మ్మద్‌ ఇక్బాల్‌ అన్నారు. మంగళవారం హిందూపురం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఇక్బాల్‌ మాట్లాడుతూ.. ప్రజాసంకల్పయాత్రలో ఉప్పెనలా వచ్చిన ప్రజాబలానికి భయపడి ఇలాంటి చీకటి ఒప్పందాలు చేసుకుని ఓట్లను చీల్చాలని చూస్తున్నారని ఆరోపించారు. చీకటి ఒప్పందాలు పెట్టుకున్న టీడీపీ, జనసేన, కాంగ్రెస్‌ పార్టీలు 2019 తర్వాత ఫ్యాన్‌ గాలిలో కనపడకుండా పోతాయని జోస్యం చెప్పారు. టీడీపీ ప్రభుత్వం నరకాసుర ప్రభుత్వమని, కంటక ప్రభుత్వమని విమర్శించారు. అంకెల గారడీ తప్ప అభివృద్ధి చేసే ప్రభుత్వం ఇది కాదన్నారు.

ఏపీకి 2019 ఎన్నికల తర్వాత దీపావళి త్వరగా రాబోతుందన్నారు. ఇసుక, మట్టి ఇలా ప్రతి దానిలో కూడా అవినీతి చేస్తోన్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమని, ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్‌ని దుర్భిక్షాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. మళ్లీ అన్నపూర్ణగా మార్చబోయేది వైఎస్‌ జగనేనని చెప్పారు. జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌, భగత్‌ సింగ్‌ లాంటి దేశభక్తుల గురించి తెలుసుకోవాలని సూచించారు. అలా కాకుండా భగత్‌ సింగ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు అనడం అతని తెలివికి నిదర్శనమని విమర్శించారు. పవన్‌ కల్యాణ్‌ భారత జాతికి క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top