అనుకూల మీడియా ద్వారా మాపై దుష్ప్రచారం: ఆర్కే

YSRCP MLA Alla Ramakrishna Reddy Slams Chandrabau In Vijayawada - Sakshi

విజయవాడ: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన అనుకూల మీడియా ద్వారా మాపై దుష్ప్రచారం చేస్తున్నారని మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి(ఆర్కే) ఆరోపించారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..ఫిరాయింపు ఎమ్మెల్యేలని ఎందుకు అనర్హులుగా ప్రకటించరని ప్రశ్నించారు. చంద్రబాబు గతంలో పాదయాత్ర చేస్తూ అసెంబ్లీకి వెళ్లకుండా జీతం తీసుకున్న సంగతి గుర్తులేదా అని సూటిగా అడిగారు. జీతం అనేది ఎమ్మెల్యేలకు రాజ్యాంగం కల్పించిన హక్కు, అసెంబ్లీకి వెళ్తే ఇచ్చేది కేవలం భత్యమే అని వెల్లడించారు.

కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు నువ్వు ఇష్టానుసారంగా ఖర్చుపెట్టడం సబబేనా అని ప్రశ్నించారు. ముంబై వెళ్లి గంట కొట్టి రావడానికి లక్షల రూపాయల ఖర్చా?..నీ మంత్రి పుచ్చి పోయిన పంటికి వైద్యం చేయించుకోవడానికి లక్షల రూపాయల ఖర్చా?..పార్క్‌ హయత్‌ హోటల్లో నీ కుటుంబానికి మూడు సూట్‌లు బుక్‌ చేసి ప్రభుత్వ సొమ్ము దుబారా చేయడం వాస్తవం కాదా? అని ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు మైండ్‌ పనిచేయటం లేదు..తెల్లారి లేస్తే అబద్ధాలు ఆడటం, మోసాలు చేయడమే బాబు నైజమని విమర్శించారు. ఫిర్యాయింపు ఎమ్మెల్యేలని ఎందుకు డిస్‌క్వాలిఫై చేయరని ప్రశ్నించారు.

అసెంబ్లీ బులెటిన్‌లో ఇప్పటికీ ఫిరాయింపు ఎమ్మెల్యేలని మా పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్స్‌గా చూపుతున్నారని వెల్లడించారు. చంద్రబాబు చెప్పటానికే నీతులు..ఆచరణలో మాత్రం శూన్యమన్నారు. మా జీతాల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని, నువ్వు తప్పు చేసినట్లు లెంపలేసుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు జగన్‌ ఇచ్చిన బీఫార్మ్‌ మీద గెలిచిన సంగతి గుర్తు లేదా అని ప్రశ్నించారు. ఫిరాయింపుల అంశం స్పీకర్‌ పరిధి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ సభకు వస్తే హడావిడిగా ముగిస్తారు..ఇప్పుడు వారం రోజులు శాసనసభ నిర్వహిస్తారా అని సూటిగా ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top