‘తూర్పు’కే పెద్దపీఠం

YSRCP Ministers Profiles East Godavari - Sakshi

మంత్రివర్గ కూర్పులో జిల్లాకు అగ్రతాంబూలం

మంత్రి మండలిలోకి బోస్, విశ్వరూప్, కన్నబాబు

సామాజిక సమతుల్యత పాటించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

సీనియారిటీ, విధేయత, నమ్మకాలకు పట్టం

ప్రధాన సామాజిక వర్గాలకు చోటు

ముగ్గురికి మంత్రి పదవులతో జిల్లాకి ప్రత్యేక గౌరవం

గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని సాహసం

సాక్షి ప్రతినిధి, కాకినాడ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మరోసారి జిల్లాపై అభిమానం చాటుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నంతకాలం పార్టీ పదవుల్లో ప్రాధాన్యం కల్పించిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తాజాగా మంత్రివర్గ కూర్పులో కూడా జిల్లాకు పెద్దపీట వేశారు. ఎన్నికల్లో టిక్కెట్లు ఖరారు చేయడంలోనే కాదు మంత్రి పదవుల కేటాయింపుల్లోనూ ముఖ్యమంత్రి సమతూకం పాటించారని విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. సామాజిక సమీకరణాలతోపాటు సీనియారిటీకి, విధేయకతకు, విశ్వసనీయతకు పట్టంగట్టారు. తాజా కేబినెట్‌లో జిల్లా నుంచి ముగ్గురికి చోటుకల్పించారు. బీసీ సామాజిక వర్గం నుంచి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి పినిపే విశ్వరూప్, కాపు సామాజిక వర్గం నుంచి కురసాల కన్నబాబుకు బెర్త్‌ ఖరారు చేశారు. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

విధేయతకు పెద్దపీట
మంత్రి వర్గ కూర్పులో జిల్లా నుంచి సీనియారిటీ, విధేయతకు అవకాశం కల్పించారు. ఓదార్పు యాత్ర నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడాక సొంతంగా పార్టీ పెట్టిన సమయంలో పదవులను తృణప్రాయంగా వదిలి అండగా నిలిచిన నేతలకు మంత్రివర్గంలో ప్రముఖ స్థానం కల్పించారు. వైఎస్సార్, రోశయ్య,  కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రుల హయాంలో మంత్రిగా చేసిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ రాజన్న బిడ్డకు అండగా నిలవాలని అప్పటికే ఉన్న పదవిని విడిచి పెట్టి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా ఓటమి పాలయ్యారు. అయితే, తన కోసం పదవీ త్యాగం చేసిన బోస్‌కు అండగా నిలవాలని ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. అంతే కాకుండా అధికారంలోకి వస్తే మంత్రిని చేస్తానని ఎన్నికల ప్రచార సభలో హామీ కూడా ఇచ్చారు.   తాజాగా జరిగిన ఎన్నికల్లో మండపేట నుంచి ఓటమి పాలైనా ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా కొత్త కేబినెట్‌లో చోటు కల్పించడం విశ్వసనీయతకు నిదర్శనమని అంటున్నారు.

సీనియారిటీకి ప్రాధాన్యం
పదవులు వదులుకుని, పార్టీని నమ్ముకుని పనిచేసిన అమలాపురం ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్‌కు మంత్రి యోగం లభించింది. 2014 ఎన్నికలకు ముందు మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్సార్‌ సీపీలో చేరిన విశ్వరూప్‌కు అనుకున్నట్టుగానే కేబినెట్‌లో చోటు కల్పించారు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైనా నిరుత్సాహం చెందకుండా పార్టీ కోసం అహర్నిశలూ పనిచేసిన విశ్వరూప్‌ కష్టాన్ని జగన్‌మోహన్‌రెడ్డి గుర్తించారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మాత్రమే జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవులు ఇచ్చారు. తాజాగా జగన్‌ మరోసారి ప్రాధాన్యం కల్పించారు. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినా ఎప్పుడూ ఎస్సీ సామాజిక వర్గానికి పెద్దగా మంత్రి పదవులు ఇచ్చిన దాఖలాలు లేకపోవడం గమనార్హం.

నమ్మకానికి గుర్తింపు
సామాజికవర్గ సమీకరణలతోపాటు పార్టీని నమ్ముకుని, గత నాలుగేళ్లలో పార్టీని ముందుకు తీసుకెళ్లినందుకు కురసాల కన్నబాబును గుర్తించి మంత్రి పదవితో గౌరవించారు. ఒకానొక సందర్భంలో కన్నబాబును లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు నెరిపిన సందర్భాలున్నాయి. ఆయన్ని ఎలాగైనా ఓడించాలని కొన్ని శక్తులు పనిచేశాయి. జనసేన నేత పంతం నానాజీ తదితర నాయకులైతే వన భోజనాల సమయంలో కన్నబాబును దారుణంగా అవమానపరిచే విధంగా మాట్లాడారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అయితే కన్నబాబును లక్ష్యంగా చేసుకుని తన స్థాయిని మరిచిపోయి వ్యక్తిగత దుర్భాషలకు దిగారు. ‘తరిమేస్తాం...తాట తీస్తాం’ అంటూ పరుష పదజాలంతో దాడి చేసినా వెరవకుండా, ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఎన్నికల్లో పోటీచేసి కన్నబాబు విజయం సాధించారు. ఇటువంటి పరిణామాలన్నీ దీటుగా ఎదుర్కొని రెండోసారి ఎమ్మెల్యే అయిన ఆయనను గుర్తించి, కేబినెట్‌లో జగన్‌ చోటు కల్పించారు.

‘తూర్పు’నకు ప్రత్యేక గుర్తింపు
తూర్పుతోనే మార్పు అనే నినాదాన్ని జగన్‌మోహన్‌రెడ్డి గట్టిగా విశ్వసించి ఆ దిశగానే అడుగులు వేశారు. ఆయన ఇక్కడే పార్టీని ప్రకటించారు. జిల్లాలోనే 50 రోజులపాటు సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమయ్యారు. ఈ ఎన్నికల్లో కాకినాడ నుంచే ఎన్నికల సమరశంఖం పూరించి తొలి ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడే చేపట్టారు. ఆయన కష్టానికి తగ్గట్టుగా, ఆయనపై నమ్మకం ఉంచుతూ జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున ఎన్నికల్లో జగన్‌కు పట్టంగట్టారు. మూడు పార్లమెంట్‌ స్థానాలను, 14 అసెంబ్లీ స్థానాలను పార్టీకి ఇచ్చిన ఘనత జిల్లాకు దక్కింది. జిల్లాలోని ప్రధాన సామాజిక వర్గాలన్నీ అండగా నిలవడంతో కృతజ్ఞతగా ఆ సామాజిక వర్గాలన్నింటికీ మంత్రివర్గంలో ప్రాధాన్యం కల్పించారు.

సీఎంగా చరిత్ర సృష్టిస్తున్నారు : పిల్లి సుభాష్‌చంద్రబోస్‌
రామచంద్రపురం రూరల్‌: గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకోవడం పట్ల నేను, నా కుటుంబ సభ్యులు జగన్‌మోహన్‌ రెడ్డి, ఆయన తల్లి విజయమ్మలకు ఎంతో రుణపడి ఉన్నాం. ముఖ్యమంత్రి అవినీతి రహిత పాలన అందించే దిశగా తీసుకుంటున్న చర్యలు, వెనుకబడిన తరగతులు, షెడ్యూల్‌ కులాలకు, మైనార్టీలకు మంత్రివర్గంలోనే కాకుండా నామినేటెడ్‌ పోస్టులు, టెండర్లలో కూడా 50 శాతం అవకాశం కల్పిస్తామని చెప్పడం భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక అపురూపమైన నిర్ణయం. అటువంటి ప్రభుత్వ యంత్రాంగంలో భాగం కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల కోసమే పనిచేస్తామని మాట ఇస్తున్నాం.

అన్ని వర్గాలకూ సముచిత స్థానం : కురసాల కన్నబాబు
కాకినాడ: కొత్త కేబినెట్‌ కూర్పులో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అన్ని సామాజిక వర్గాలకూ సముచిత స్థానం కల్పించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మంచి ప్రాధాన్యం ఇచ్చారు. ఇలాంటి కేబినెట్‌ను గతంలో చూడలేదు. కొత్తగా ఎంపికైన మంత్రులకు రెండున్నర సంవత్సరాల తర్వాత పార్టీ బాధ్యతలు అప్పగించి కొత్త వారికి అవకాశం కల్పిస్తామని చేసిన ప్రకటన కూడా ఆహ్వానించదగ్గ శుభపరిణామం. చంద్రబాబు కేబినెట్‌లో ఎస్టీలకు చోటు దక్కలేదని, ఆ వర్గానికి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారంటేనే ఆయనలోని నిబద్ధత ఏమిటో అర్థమవుతోంది.

జగన్‌ నమ్మకాన్ని వమ్ము చేయను : పినిపే విశ్వరూప్‌
అమలాపురం టౌన్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాపై ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయను. ఆయన ఇచ్చిన మంత్రి పదవితో నాకు ఏ శాఖ ఇచ్చినా అదే జగన్‌ ఆదేశాలుగా భావించి సమర్థవంతంగా పనిచేసి రాష్ట్రాభివృద్ధికి  నా వంతు పాటుపడతా. నాకు రాజకీయం ప్రసాదించిన దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాటికీ నేటికీ నాకు గాడ్‌ ఫాదరే. రాజశేఖరరెడ్డి మరణించేదాక ఆయన అడుగుజాడల్లోనే నడిచాను. తర్వాత ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తండ్రిలాగే నాపై నమ్మకం ఉంచి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. రెండోసారి మంత్రి అయినందుకు చాలా ఆనందంగా ఉంది. జిల్లా ప్రగతికి ప్రణాళికాయుతంగా పనిచేస్తా.  నన్ను మంత్రిని చేసిన జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు.

మినిస్టార్లు వీరే..
రామచంద్రపురం: దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, ఆయన కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ మూడో సారి మంత్రి పదవి వరించింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించినప్పటి నుంచి జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉంటూ బీసీ సామాజికవర్గంలో పెద్ద నేతగా ఈయన వ్యవహరించారు. కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవిని వదులుకుని అధిష్టానం అంటే తనకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మాత్రమేనని తెగేసి చెప్పి తన విశ్వసనీయతను ఆనాడే వైఎస్‌ కుటుంబానికి చాటుకున్నారు. అనంతరం 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై రాజకీయాలు చేసిన నేపథ్యంలో ఓటమి పాలయ్యారు. తిరిగి 2014లో రామచంద్రపురం నుంచి, 2019లో మండపేట నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. 2015లో మొట్టమొదటి ఎమ్మెల్సీ స్థానాన్ని జగన్‌మోహన్‌రెడ్డి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.

 

గతంలో 2004లో ఇండిపెండెంట్‌గా గెలుపొందిన బోస్‌కు అప్పటి  ముఖ్యమంత్రి దివంగత మహానేత డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రి పదవి ఇచ్చి సాంఘిక సంక్షేమ శాఖను ఆయనకు అప్పగించారు. 2009లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందిన బోస్‌కు తిరిగి రాజశేఖర్‌రెడ్డి సాంఘిక సంక్షేమ శాఖలో రెండో సారి మంత్రి పదవి అందించారు. రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం రోశయ్య ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగినా అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ఆయన మంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చింది. 2006 నుంచి 2010వరకు నాలుగేళ్లపాటు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన ఆశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. రాజశేఖర్‌రెడ్డి ప్రశంసలు అందుకున్నారు. తిరిగి జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో బోస్‌ స్థానం కల్పించారు.

ప్రొఫైల్స్‌
పేరు: పిల్లి సుభాష్‌చంద్రబోస్‌
తండ్రి: సూర్యనారాయణ
తల్లి: ముత్యాలమ్మ
భార్య: సత్యనారాయణమ్మ
పిల్లలు: ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.
పుట్టిన ఊరు: హసన్‌బాద(రామచంద్రపురం మండలం)
ప్రాథమిక విద్యాభ్యాసం: సొంత ఊరు హసన్‌బాద
10వతరగతి: పీవీఆర్‌ హైస్కూల్‌ ద్రాక్షారామ
పీయూసీ: ఎస్‌కేబీఆర్‌ కాలేజీ అమలాపురం
బీఎస్సీ: విఎస్‌ఎం కళాశాల, రామచంద్రపురం
మొట్టమొదటి రాజకీయ పదవి: జెడ్పీ కోఆప్షన్‌ మెంబర్‌(1978)
హసన్‌బాద సర్పంచ్‌గా: 1983
ఎమ్మెల్యేగా మొట్టమొదటగా పోటీ చేసింది: రామచంద్రపురం నియోజకవర్గం 1985లో(కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఓటమి పాలయ్యారు)
ఎమ్మెల్యేగా గెలుపొందింది: 1989లో
కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా, 2004 ఇండిపెండెంట్‌గా, 2009 కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
మంత్రిగా: 2006లో మంత్రి పదవి చేపట్టి 2009 ఫిబ్రవరి వరకు తిరిగి 2009 మే నుంచి 2010 డిసెంబర్‌ వరకు మంత్రిగా ఉన్నారు.
2015 ఏప్రిల్‌ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్నారు.  
రాజకీయ గురువు: ఉండవిల్లి సత్యనారాయణమూర్తి(రాయవరం మునసుబుగారు) కాబోయే మంత్రి ఎమ్మెల్సీ బోస్‌

వినయ విధేయ విశ్వరూప్‌..
అమలాపురం టౌన్‌: నాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి.. నేడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగుజాడల్లో నడిచిన విధేయుడు అమలాపురం ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్‌. అదే ఆయనకు మరోసారి అమాత్య పదవి వరించేలా చేసింది. 2009లో రెండోసారి ఏర్పాటైన డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో తొలిసారి మంత్రి పదవి చేపట్టారు. ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో రెండోసారి మంత్రి పదవి చేపట్టబోతున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. ఓ సారి మంత్రి పదవి చేపట్టిన ఎస్సీ నాయకుడు ఈయనే. ఈ సీనియారిటీ కూడా ఆయనకు మంత్రి పదవి వరించడంలో మరో అర్హత అయింది. విద్యావంతుడైన విశ్వరూప్‌ 2009లో తొలిసారి మంత్రి పదవి చేపట్టాక తనకు అప్పగించిన గ్రామీణ తాగునీటి సరఫరా, పశుసంవర్థక, మత్య్స, డెయిరీ డెవలప్‌మెంట్‌ శాఖలను సమర్థంగా నిర్వహించారు.

రాజకీయ ప్రస్థానం ఇలా..
విశ్వరూప్‌ 1989లో రాజకీయ అరంగ్రేటం చేశారు. దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతో కాంగ్రెస్‌లో పార్టీలో చేరి ముమ్మిడివరం నియోజకర్గం వేదికగా రాజకీయంగా తొలి అడుగులు వేశారు. 1998లో ఆ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, లోక్‌ సభ మాజీ సభాపతి దివంగత జీఎంసీ బాలయోగిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కల్పించారు. అప్పుడు టీడీపీ అభ్యర్థి చెల్లి వివేకానందపై మరోసారి పరాజితులయ్యారు. 2004లో జరిగిన ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి విశ్వరూప్‌ అదే పార్టీ టికెట్‌తో పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ముమ్మిడివరం నియోజకవర్గం జనరల్‌ కేటగిరీ కావడం.. పక్కనే ఉన్న కోనసీమ కేంద్రం అమలాపురం నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కావడంతో విశ్వరూప్‌ను దివంగత నేత డాక్టర వైఎస్సార్‌ రంగంలోకి దింపారు. ఆ ఎన్నికల్లో కూడా ఆయన విజయం సాధించి మంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఆ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో దాదాపు నాలుగున్నరేళ్ల పాటు ముగ్గురు ముఖ్యమంత్రులు దివంగత వైఎస్సార్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గాల్లో వివిధ శాఖల మంత్రిగా పనిచేశారు. వైఎస్సార్‌ మరణం అప్పట్లో విశ్వరూప్‌ను బాగా కుంగదీసింది. తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆవిర్భవించిన వైఎస్సార్‌ సీపీ వైపు పయనించారు.

మంత్రి పదవిని వదులుకుని..
దివంగతనేత వైఎస్సార్‌ తనకు ప్రసాదించిన రాజకీయ జీవితం.. అందించిన అండదండలతో మంత్రి స్థాయికి వచ్చిన విశ్వరూప్‌ ఆయన కుటుంబంపై అదే అభిమానాన్ని చాటారు. జగన్‌ నాయకత్వంలో పనిచేసేందుకు.. ఆరు నెలల ముందే తన మంత్రి పదవికి రాజీనామా చేసి వైఎస్సార్‌ సీపీలో చేరారు.

ఫ్రొఫైల్‌..
పేరు: పినిపే విశ్వరూప్‌
భార్య: బేబీ మీనాక్షి
కుమారులు: ముగ్గురు, కృష్ణారెడ్డి, అమిత్, శ్రీకాంత్‌
తల్లిదండ్రులు: రెడ్డి పంతులు, సీతమ్మ
స్వగ్రామం: ముమ్మిడివరం మండలం నడవపల్లి శివారు గిడ్డివారిపేట
పుట్టిన తేదీ: 02–10–1962
విద్యార్హత: బీఎస్సీ బీఈడీ
విద్యాభ్యాసం: 1 నుంచి 5వ తరగతి వరకూ స్వగ్రామం నడవపల్లి ఎంపీ స్కూలు, 6 నుంచి 10వ తరగతి వరకూ ముంబై, ఇంటర్‌ నుంచి డిగ్రీ వరకు అమలాపురం ఎస్‌కేబీఆర్‌ కళాశాల

జర్నలిస్ట్‌ నుంచి.. మినిస్టర్‌గా..
కాకినాడ: సాధారణ జర్నలిస్ట్‌గా జీవన ప్రస్థానం ప్రారంభించిన ఆయన అనతి కాలంలోనే రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. పాత్రికేయుని హోదాలో ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చిన ఆయన రాజకీయాల్లో కూడా అదే ఒరవడితో ముందుకు సాగారు. ప్రజల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రి వర్గంలో చోడు సంపాదించారు. ఆయనే కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు స్థానం సంపాదించగలిగారు.

జర్నలిస్ట్‌గా జిల్లాలోనే..
తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో మారేడుమిల్లిలో జర్నలిస్ట్‌గా పనిచేశారు. అనతికాలంలోనే ఆయన బ్యూరో ఇన్‌చార్జ్‌ స్థాయికి ఎదిగారు. పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న సమయంలో ప్రజా సమస్యలపై ఆయన రాసిన కథనాలు వృత్తిపట్ల ఆయనకున్న నిబద్ధత, ఆయనను మరింత ఉన్నత స్థాయికి చేర్చింది. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేట ప్రాంతం స్వగ్రామమైనా విద్యాభ్యాసం అంతా ఏజెన్సీ ప్రాంతమైన మారేడుమిల్లిలో కొనసాగింది. ఆంధ్రాయూనివర్సిటీలో ఎంఏ జర్నలిజం చేశారు.

ప్రజారాజ్యంతో రాజకీయం ప్రవేశం
జర్నలిస్ట్‌గా పనిచేసిన సమయంలో కన్నబాబుకు మెగాస్టార్‌ చిరంజీవితో ఏర్పడిన సాన్నిహిత్యం ఆయన పెట్టిన పీఆర్పీ వైపు అడుగులు వేసేలా చేసింది. 2009 ఎన్నికల్లో కాకినాడ రూరల్‌ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనమయ్యాక ఆయన కాంగ్రెస్‌లో కొనసాగారు. చిరంజీవి కేంద్రమంత్రిగా ఉండడంతో ఆయన సాన్నిహిత్యం వల్ల కోట్లాది రూపాయలతో ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. అమెరికా ఎన్నికలను అధ్యయనం చేసేందుకు ఏపీ నుంచి ఎంపికై వెళ్లారు. ప్రజలతో మమేకమై చేసిన అభివృద్ధి ఫలితంగా 2014లో స్వతంత్య్రంగా పోటీచేసి కూడా 45 వేల ఓట్లు సాధించగలిగారు.

వైఎస్సార్‌ సీపీలో చేరిక
2015లో కన్నబాబు వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కొంతకాలానికే ఆయన పార్టీ జిల్లా అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. టీడీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ ఎన్నో ఉద్యమాలకు నేతృత్వం వహించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కన్నబాబును లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలకు దిగినా అవేవీ పనిచేయలేదు.   పార్లమెంట్‌ నియోజకవర్గాలుగా పార్టీని విభజించినప్పుడు కూడా కాకినాడ పార్లమెంటరీ అధ్యక్ష పగ్గాలు కన్నబాబుకే దక్కాయి. ఇటీవల ఎన్నికల్లో కన్నబాబు నేతృత్వంలో కాకినాడ ఎంపీతోపాటు పార్లమెంట్‌ పరిధిలో ఆరు అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్‌ సీపీ విజయం సాధించింది. పార్టీపట్ల అంకిత భావంతో పనిచేసిన కన్నబాబును మంత్రి వర్గంలో చేర్చుకోవడంపై పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహం వెల్లివిరిసింది.

బయోడేటా
పేరు: కురసాల కన్నబాబు
స్వస్థలం: శెట్టిపేట, నిడదవోలు మండలం.
పుట్టిన తేదీ: 16–12–1968
తండ్రి: సత్యనారాయణ
తల్లి: కృష్ణవేణి
భార్య: శ్రీ విద్య
కుమార్తె: సిరి
విద్య: బీకాం. ఎంఏ
వృత్తి: జర్నలిజం, రాజకీయం
రాజకీయ ప్రవేశం: 2009
రాజకీయ పదవులు: 2009లో కాకినాడరూరల్‌ ఎమ్మెల్యే, 2015 నుంచి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి, పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యుడు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top