అందుకే.. రాజమౌళి దూరంగా ఉన్నారు | YSRCP leader Tammineni Sitaram Fires on Chandrababu Govt | Sakshi
Sakshi News home page

అందుకే.. రాజమౌళి దూరంగా ఉన్నారు

Mar 29 2018 1:43 PM | Updated on Mar 23 2019 9:10 PM

YSRCP leader Tammineni Sitaram Fires on Chandrababu Govt - Sakshi

విలేకరులతో మాట్లాడుతున్న తమ్మినేని సీతారాం

సాక్షి, విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ చంద్రబాబు సర్కారు రాజ్యాంగ విలువలను కాలరాసిందన్నారు. ప్రజలకు, రాజ్యాంగానికి జవాబుదారీగా ఉండాల్సిన విషయాన్ని విస్మరించారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు తను మారిన మనిషిగా చెప్పుకుని 600 హామీలను ఇచ్చారని, నాలుగేళ్ల తరువాత అవన్నీ అబద్ధాలని ప్రజలకు అర్ధమయిందని తెలిపారు. నాలుగేళ్ల టీడీపీ, బీజేపీ పాలనలో వ్యవస్థలు సర్వనాశనమయ్యాయిని, సామాజిక న్యాయం అందని పండుగా మారిందన్నారు. 

స్పీకర్, గవర్నర్, కలెక్టర్, రెవెన్యూ, పంచాయతీరాజ్ వ్యవస్థలను నాశనం చేశారు.. ఇదేనా చంద్రబాబు సీనియారిటీ? అని ప్రశ్నించారు. 23 మంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం క్రింద స్పీకర్‌ ఎందుకు చర్య తీసుకోలేదన్నారు. స్పీకర్‌కు ఈ విషయం తెలియదా? లేక తెలియనట్లు నటిస్తున్నారా? అని నిలదీశారు. నల్ల బ్యాడ్జీతో స్పీకర్ తన స్థానంలో ఎలా కూర్చుంటారు? అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా స్పీకర్ వ్యవహరించాలనన్నారు. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా.. ఫిరాయింపు ఎమ్మెల్యేలను గవర్నర్‌తో మంత్రులుగా ఎలా ప్రమాణ స్వీకారం చేయించారన్నారు. సభలోని ఎమ్మెల్యేలను వారు ఎన్నికైన పార్టీకి చెందిన వారుగా చూపుతారా? ఫిరాయించిన పార్టీ ఎమ్మెల్యేలుగా చూపుతున్నారా? రాష్ట్ర గవర్నర్ దీనికి సమాధానం చెప్పాలన్నారు. ఈ అంశంపై గతంలోనే వైఎస్సార్‌సీపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు. ఫిరాంయింపు ఎమ్మెల్యేలతో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయిండం వ్యవస్థను దిగజార్చడం కాదా అని ప్రశ్నించారు.

దేశంలోని ముఖ్యమంత్రులకు కళంకం
మరోవైపు రాష్ట్ర హక్కులను సైతం చంద్రబాబు సర్కారు కాలరాసిందని విమర్శించారు. ప్రత్యేకహోదాపై అసెంబ్లీలో తీర్మానాలు చేస్తున్నారు, నీతిఅయోగ్ అభ్యంతరం చెప్పిందని కేంద్రం చెబితే ఎలా అంగీకరించారన్నారు. హక్కులను ఫణంగా పెట్టే అధికారాన్ని చంద్రబాబుకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆరోపించారు. దేశంలోని ముఖ్యమంత్రులకు కళంకం తెచ్చిన వ్యక్తి చంద్రబాబని విరుచుకుపడ్డారు. అందరినీ ఆర్ధిక నేరస్తులు అంటున్న చంద్రబాబు, తనపై వున్న అభియోగాలపై సీబీఐ విచారణ చేయించుకుంటారా అని నిలదీశారు. ‘ఓటుకు నోటు కేసులో గొంతు చంద్రబాబుది కాదా? నాకు కుమారుడు ఉన్నారు.. మీకు ఓ కుమారుడు వున్నారు.. గొంతు మీది కాదని మీ కుమారుడితో వచ్చి కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేస్తారా? ఆ గొంతు మీదేనని నేను ప్రమాణం చేస్తాన’నని సవాల్‌ విసిరారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ డిపాజిట్లు కూడా రాకుండా గల్లంతు అవుతుందని వ్యాఖ్యానించారు.

అన్నీ వ్యవస్థలు నిర్వీర్యం
పంచాయతీరాజ్ అధికారాలను నిర్వీర్యం చేసి, జన్మభూమి కమిటీలతో గ్రామీణ వ్యవస్థను నాశనం చేశారన్నారు. జిల్లాల్లో కలెక్టర్ల వ్యవస్థను అస్థిపంజరంలా మార్చేశారని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలను దోచి పెట్టి.. వైఎస్సార్‌ సీపీ సానుభూతి పరులను వేధించడం, ఉద్యోగాల్లో వున్న వారిని తొలగిస్తున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు వృద్దులకు ఇచ్చే పెన్షన్లను కూడా రద్దు చేశారని, ఇన్ని పాపాలు చేసిన జన్మభూమి కమిటీలే తెలుగుదేశం పార్టీని దెబ్బతీస్తాయని తెలిపారు. 21 వేల కోట్లు ఇచ్చామని కేంద్రం చెబుతుంటే.. ఇవ్వలేదని చంద్రబాబు అంటున్నారని, మరి  కేంద్ర నిధులు ఏమయ్యాయని అడిగారు. కేంద్రం లెక్కలు అడిగితే చంద్రబాబు బిక్కమొకం వేస్తున్నారని.. కనీసం ప్రజలకు లెక్కలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రాజధానిలో రోజుకో గ్రాఫిక్స్‌
ఏపీ రాజధాని పేరుతో అమరావతిలో రోజుకో గ్రాఫిక్స్ చూపుతున్నారని..  చంద్రబాబు అవినీతి విస్తృత స్థాయిలో ఉందని ఆరోపించారు. అందుకే దర్శకుడు రాజమౌళి రాజధాని డిజైన్ లకు దూరంగా ఉన్నారని తెలిపారు. ఇలాంటి చంద్రబాబు పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకే వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకుంటున్నారని స్పష్టం చేశారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement