
సాక్షి, న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు తానుగా సీబీఐ విచారణకు సిద్ధం కావాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. పోలవరం, పట్టిసీమ, రాజధాని నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ భారీ అవినీతికి పాల్పడినట్లు బీజేపీ, జనసేన చేసిన ఆరోపణలపై చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని పేర్కొంది.
గురువారం లోక్‌సభ వాయిదా పడిన అనంతరం వైఎస్సార్ సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వరప్రసాదరావు, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేన ఓట్లతో గెలిచిన చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ జరిపించుకొని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని విజయసాయిరెడ్డి సూచించారు. వారం రోజుల్లోగా సీబీఐ విచారణకు ఆదేశించకుంటే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఒప్పుకున్నట్టే అవుతుందన్నారు.