నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ ఎలా ఇచ్చారు..?

YSR Congress Party Leaders Meet President Ramnath Kovind - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలుసుకున్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం, తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును రాష్ట్రపతికి వివరించారు. ఈ ఘటనపై నిష్పపాక్షిక విచారణ జరగాలంటే.. థర్డ్‌ పార్టీతో కేసు దర్యాప్తు చేయించాలని రాష్ట్రపతికి విన్నవించామని వైఎస్సార్‌సీపీ నేతలు మీడియాకు వెల్లడించారు. తమ అభ్యర్థనపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని చెప్పారు.

రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసిన బృందంలో వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వరప్రసాద్‌, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, పార్టీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

బాబుకెందుకు భయం?
విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయంత్నంలో ఘటనలో బాబు ప్రమేయం లేకపోతే.. ఈ కేసును స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించొచ్చు కదా అని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజసాయిరెడ్డి ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నానికి సూత్రధారి చంద్రబాబేనని ఆరోపించారు. ఆయనతో పాటు డీజీపీ ఆర్పీ ఠాకూర్‌, టీడీపీ నేతలు ఆదినారాయణరెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు, సినీ నటుడు శివాజీలకు ఈ ఘటనలలో ప్రమేయముందని మీడియాకు వెల్లడించారు. రాష్ట్రపతి లేదా కోర్టు ఉత్తర్వుల ద్వారా నిష్పాక్షిక దర్యాప్తు జరిగితే హత్యాయత్నం వెనకున్న కుట్రదారులు బయటపడతారని అన్నారు.

సీసీ కెమెరాలు పనిచేయకపోవడమేంటి..?
వైఎస్సార్‌సీపీ తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసును కేంద్ర సంస్థతో నిష్పాక్షిక దర్యాప్తు చేయించాలని రాష్ట్రపతిని కోరినట్లు చెప్పారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఎయిర్‌పోర్టులోకి కత్తి ఎలా వెళ్లిందని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నడూ లేంది.. ఆ  రోజే సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టు రెస్టారెంట్‌లో పనిచేసేందుకు నెలరోజులే పర్మిషన్‌ ఉన్న నిందితుడు శ్రీనివాస్‌.. మూడు నెలల పాటు అక్కడే ఎందుకున్నాడని ప్రశ్నించారు. అయినా, క్రిమినల్‌ కేసులున్న శ్రీనివాస్‌కు.. ఎయిర్‌పోర్టులో పనిచేసేందుకు నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ ఎలా ఇచ్చారని మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top