
సాక్షి, భూపాలపల్లి/నిర్మల్/బోధన్, కరీంనగర్ సిటీ: ఈ ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీ సత్తా చాటుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో, నిర్మల్ జిల్లా భైంసాలో, నిజామాబాద్ జిల్లా బోధన్‌లో, కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అవినీతి రహిత, అభివృద్ధి పాలన బీజేపీతోనే సాధ్యమని, ఒకసారి అవకాశమిస్తే రామరాజ్యం స్థాపిస్తామని చెప్పారు.
ప్రజాకూటమి, టీఆర్‌ఎస్, ఎంఐఎం కూటమి దోచుకునేందుకే ఉన్నాయన్నారు. తెలంగాణలో నక్సల్స్, ఐఎస్‌ఐ ఏజెంట్లను నిర్మూలించడం బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. తెలంగాణలో అన్ని పార్టీలు ఎంఐఎం ముందు తలవంచుతున్నాయని చెప్పారు. ఎంఐఎంను భూస్థాపితం చేస్తామన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ను భాగ్యనగరంగా, కరీంనగర్‌ను కరిపురంగా పేర్లు మారుస్తామని పేర్కొన్నారు.