చంద్రబాబు కోసం.. హోదా ఒత్తిడిలో‘ఎల్లో’ ఎత్తుగడ

Yellow Media Fake News on YS Jagan - Sakshi

వింత వాదనలు.. వికృత విన్యాసాలు

రెండు కంపెనీల మధ్య వివాదంలో కేంద్రానికి నోటీసు

అందులోకి ఏపీ ప్రతిపక్షనేత పేరు లాగే ప్రయత్నం

జగన్‌ వల్లనే ప్రధానికి నోటీసు అంటూ విష ప్రచారం

జగన్‌పై ‘రాజకీయ కక్షసాధింపు కేసు’లో కొనసాగుతున్న విచారణ

ఈడీ అటాచ్‌ నేపథ్యంలో ఇందూటెక్‌ భూ కేటాయింపు రద్దు

ప్రాజెక్టు పనులు నిలిచిపోవడంతో కోర్టుకెక్కిన మారిషస్‌ కంపెనీ

ఆ వివాదాన్ని జగన్‌కు ముడిపెడుతూ కథనాలు..

బాబు భూ కేటాయింపులు రద్దయితే ఇలా నోటీసులు రావా?

నాలుగేళ్లుగా రాష్ట్రంలో విశృంఖలంగా అవినీతి

సాక్ష్యాలతో దొరుకుతున్నా పట్టించుకోని పచ్చ మీడియా

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న రాజీలేని పోరాటానికి పెరుగుతున్న ప్రజా మద్దతును చూసి ఓర్వలేని ఎల్లో మీడియా మరో దిగజారుడు ప్రచారానికి పూనుకుంది. హోదా సాధన కోసం పోరాటం దిశగా జనం అడుగులు వేస్తుండడంతో.. ముఖ్యమంత్రి కూడా హోదాకు అనుకూలంగా మాట్లాడక తప్పని స్థితి. ఈ దశలో ప్రజల దృష్టిని మళ్లించడానికి ఎల్లో మీడియా తెగ తాపత్రయపడుతోంది.. ఓ పాత కేసును బైటకు తీసి.. ఏ మాత్రం సంబంధం లేని విషయాలను జగన్‌కు అంటగట్టే ప్రయత్నం చేసింది.

బట్టకాల్చిముఖాన వేసేందుకు విఫలయత్నం చేసింది. జగన్‌ కేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నోటీసులు వచ్చాయంటూ దీనికి జగన్‌ అవినీతే కారణమంటూ ఎల్లో మీడియా విషంచిమ్మే ప్రయత్నం చేస్తోంది. ఇదే కాదు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం కాగానే ప్యారడైజ్‌ పేపర్ల పేరుతోనూ అనుకూల మీడియాలో జగన్‌పై దుష్ప్రచారం చేసేందుకు ఇలాగే ప్రయత్నించారు. విదేశాలలో తన పేరుపై ఒక్క రూపాయి ఆస్తి ఉన్నట్లు 15 రోజుల్లో నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, నిరూపించలేకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని జగన్‌ సవాల్‌ చేస్తే తోకముడిచి కూర్చున్నారు.

నంద్యాల ఎన్నికల సమయంలోనూ పోలింగ్‌కు ఒకరోజు ముందు ఓటర్లను ప్రభావితం చేసేలా కట్టుకథలు ప్రచారం చేశారు. జగన్‌ బీజేపీతో జతకట్టబోతున్నారంటూ ఆంగ్ల చానల్‌లో ఒక వార్త ప్రసారం చేయించి దానినందుకుని ఎల్లోమీడియా చెలరేగిపోయింది. ఒక పక్క బీజేపీతో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారాన్ని పంచుకుంటూ... ముస్లిం ఓట్లు పడవన్న భయంతో బీజేపీ నాయకులను గానీ, బీజేపీ జెండాలు గానీ నంద్యాలలో కనబడనీయకుండా చేసిన చంద్రబాబు అదేసమయంలో జగన్‌పై కట్టుకథలను ప్రచారం చేయించారు.

తాము ఇబ్బందుల్లో ఉన్నపుడు ప్రతిపక్షనేతపై ఉన్నవీ లేనివి కల్పించి దుష్ప్రచారం చేయడం, ఎల్లో మీడియాలో అభూత కల్పనలు, అసత్య కథనాలు ప్రచారం చేయడం అధికారపక్షానికి షరామామూలుగా మారింది. హోదాతో పాటు అనేక అంశాలలో ప్రజావ్యతిరేకత పెరుగుతున్ననేపథ్యంలోనే ఇపుడు మారిషస్‌ కంపెనీ కథనాన్ని ప్రచారంలోకి తెచ్చారు.

జగన్‌కు ఏం సంబంధం?
ఇందూటెక్‌ కంపెనీకి – మారిషస్‌ కంపెనీకి మధ్య తలెత్తిన వివాదంలో భారత ప్రభుత్వానికి నోటీసులు రావడాన్ని జగన్‌కు ఆపాదిస్తూ విషపూరిత ప్రచారానికి దిగారు. మారిషస్‌కి చెందిన ‘కరిస్సా ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌సి’ అనే కంపెనీ ఇందూటెక్‌లో పెట్టుబడులు పెట్టింది. ఇందూకు కేటాయించిన భూమిని సీబీఐ కేసు సందర్భంగా ఈడీ అటాచ్‌ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆ కేటాయింపును రద్దు చేసింది. ఆ ప్రాజెక్టు ముందుకు సాగకపోవడంతో తనకు నష్టం వచ్చిందంటూ మారిషస్‌ కంపెనీ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఆ వ్యవహారంలో భారత ప్రభుత్వానికి నోటీసులు అందాయి. ఈ రెండు కంపెనీల వ్యవహారానికి జగన్‌మోహన్‌రెడ్డికి ఏం సంబంధం? మారిషస్‌ కంపెనీకి, ఇందూటెక్‌ కంపెనీకి మధ్య కుదిరిన ఒప్పందంలో జగన్‌ ఎక్కడున్నారు? ఇందూటెక్‌లో మారిషస్‌ కంపెనీ పెట్టుబడులకు జగన్‌ బాధ్యత వహించాలా..? ఆ రెండు కంపెనీలలో దేనిలోనూ జగన్‌ భాగస్వామి కానపుడు ఆ రెండు కంపెనీల మధ్య  సమస్య తలెత్తితే జగన్‌ ఏం చేయాలి? సంబంధమే లేని రెండు కంపెనీల వివాదాన్ని జగన్‌ కు ఆపాదించడమంటే మోకాలికి, బోడిగుండుకు ముడిపెట్టడం కాదూ.. జగన్‌పై మోపిన అక్రమ కేసుల్లో ఇందూ టెక్‌ ఉంది కాబట్టి.. ఆ ఇందూటెక్‌పై ఏదో కేసు వచ్చింది కాబట్టి దానికి కాస్త మసాలా జోడించి జగన్‌ అకౌంట్‌లో వేసేందుకు ఎల్లో మీడియా పన్నాగం పన్నింది.

కాంగ్రెస్‌ నుంచి బైటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్, టీడీపీ కలసి రాజకీయ దురుద్దేశంతో, కక్షసాధింపుతో జగన్‌పై పెట్టిన కేసులు న్యాయస్థానంలో విచారణలో ఉన్నాయి. అవి కక్షసాధింపుతో పెట్టిన కేసులన్న విషయం ఇప్పటికే రుజువవుతూ ఉంది. ఒక్కొక్క ఆరోపణ నిరాధారమైనదని తేలిపోతూ ఉంది. వైఎస్‌ హయాంలో ఇందూటెక్‌కు నగరానికి దూరంగా రంగారెడ్డి జిల్లాలో మారుమూల.. అదీ బహిరంగ వేలంలో భూమి కేటాయించారు. అక్కడ ఇంకా అనేక కంపెనీలకూ భూములు కేటాయించారు. అందులో ఇందూటెక్‌ భూముల కేటాయింపు మాత్రమే రద్దు చేశారు.

చంద్రబాబు తన హయాంలో రహేజా కంపెనీకి నగరం నడిబొడ్డున 250 ఎకరాలు కేటాయించారు. దానిమీద ఎవరైనా కేసు పెట్టి సీబీఐ విచారణ జరిగి ఆ భూములు కూడా ప్రభుత్వం వెనక్కు తీసుకుంటే వాళ్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించరా? ఇలా నోటీసులు రావా? పదేళ్లనాటి పాత చింతకాయపచ్చడి కేసు సరే.. నాలుగేళ్లుగా చంద్రబాబు అన్ని రంగాలనూ అవినీతిమయం చేసినా, అనేక వ్యవహారాలలో సాక్ష్యాలతో సహా దొరికిపోతున్నా ఎల్లో మీడియా ఎందుకు పట్టించుకోవడం లేదు?

సాక్ష్యాలు కనిపిస్తున్నా పట్టదు...
ప్రతిపక్షనేతపై ఉన్నవీలేనివీ కల్పించి కథనాలు ప్రచురించే, ప్రసారం చేసే ఎల్లో చానళ్లు, పత్రికలు చంద్రబాబు సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికిపోయినా ఆయనపై ఈగవాలనివ్వవు. జగన్‌పై అభూత కల్పనలు ప్రచారం చేయడం కోసం ఆంగ్ల పత్రికలలో తమకు అనుకూల రిపోర్టర్లతో కథనాలు రాయించి వాటి ఆధారంగా రెచ్చిపోయే చానళ్లు, పత్రికలు బాబు సాక్ష్యాలతో దొరికిపోయినా చూసీచూడనట్లుంటాయి. బాబు జమానాలో అనేక రంగాలు అవినీతి మయంగా మారాయని కాగ్‌ కడిగేసినా, అవినీతిలో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌వన్‌గా ఉందని ఎన్‌సీఏఈఆర్‌ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు నివేదికలిచ్చినా వీరికి కనిపించవు.

ఇసుక నుంచి ఇరిగేషన్‌ దాకా, మట్టి నుంచి మద్యం దాకా అన్ని రంగాలలో ఆకాశమెత్తున అవినీతి సాగుతోంది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో రాజధాని భూములను కొల్లగొట్టారు. చివరకు గుడిభూములనూ, గుడిలో లింగాన్నీ కైంకర్యం చేస్తున్నారు. అలా సంపాదించిన అవినీతి సొమ్ముతోనే చంద్రబాబు పొరుగు రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయినా ఎల్లో మీడియా పట్టించుకోదు. ఆడియో వీడియో టేపుల్లో దొరికిపోయి వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నా చూసీ చూడనట్లుంటాయి.

నంద్యాలలో ఓటుకు ఆరువేల నుంచి ఎనిమిదివేల రూపాయలు పంచినా వీటికి పెద్దగా పట్టింపులేదు. అధికారంలోకి రాకముందు చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్‌రిటెయిల్‌ షేరు ధర రూ. 200 ఉండేది. బాబు అధికారంలోకి రాగానే అది మూడురెట్లు పెరిగి రూ. 900కు చేరుకుంది. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ముందుగానే పసిగట్టిన చంద్రబాబు నాయుడు సరిగ్గా రెండు రోజులకు ముందు హెరిటేజ్‌ వాటాలను కార్పొరేట్‌ దిగ్గజ సంస్థ ‘ఫ్యూచర్‌ రిటెయిల్‌’కు విక్రయించేశారు. ఈ డీల్‌లో భాగంగా ఫ్యూచర్‌ రిటెయిల్‌లో హెరిటేజ్‌ సంస్థకు  3.65 శాతం షేర్లు దక్కాయి.

వాటి విలువ రూ.295 కోట్లకు పైమాటే. ఆ నాటి మేలుకు ప్రతిఫలంగానా అన్నట్లు ఆ తర్వాత ‘చంద్రన్న విలేజ్‌మాల్స్‌’ వ్యాపారంలో ఫ్యూచర్‌ రిటెయిల్‌ సంస్థకూ చంద్రబాబు భాగం కల్పించడం తెల్సిందే. ఫ్యూచర్‌ సంస్థకు మేలు కల్పించడమంటే అందులో వాటాలున్న హెరిటేజ్‌కూ మేలు చేసుకోవడమేనని వేరే చెప్పాలా?

సుజనా వ్యవహారాన్ని పట్టించుకున్నారా..?
జగన్‌పై ఉన్నవీ లేనివీ కల్పించి ప్రచారం చేసే ఎల్లో మీడియా.. ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోతున్నా చంద్రబాబు, ఆయన బినామీల విషయంలో కనీవిని ఎరుగని రీతిలో స్వయం ప్రకటిత ‘సంయమనం’ పాటిస్తుంటుంది. కేంద్ర మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తెలుగుదేశం నాయకుడు సుజనాచౌదరి మారిషస్‌ బ్యాంకు నుంచి రూ. 100 కోట్లు రుణం తీసుకుని ఎగ్గొట్టేశారు. ‘సుజనా యూనివర్సల్‌’ పేరుతో సుజనా చౌదరి తీసుకున్న రుణం తిరిగి చెల్లించడం లేదంటూ మారిషస్‌ కమర్షియల్‌ బ్యాంకు (ఎంసీబీ) కేసులు పెట్టింది.

న్యాయస్థానం నుంచి నోటీసులూ అందాయి. దాని గురించి ఎల్లో మీడియా ఒక్క వార్త రాయలేదు. ఒక్క కథనాన్ని ప్రసారం చేయలేదు. కేంద్ర మంత్రి హోదాలో ఉంటూ ఒక బ్యాంకును మోసం చేసిన వ్యక్తి కోర్టు నుంచి నోటీసులు అందుకున్నా చూసీ చూడనట్లు వదిలేశాయి. తెలుగుదేశం ప్రభుత్వం గానీ, పార్టీ గానీ దీనిపై ఎలాంటి చర్యా తీసుకోలేదు. కనీసం మాటమాత్రంగానైనా ఖండించనూ లేదు.

‘సుజనా యూనివర్సల్‌’ అనే కంపెనీని స్వయంగా స్థాపించి అది స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయిన తర్వాత ఆ కంపెనీ పేరుతో అనేక అప్పులు చేసి చివరకు డైరెక్టర్‌గా కంపెనీ నుంచి వైదొలగి తనకేమీ సంబంధం లేదని సుజనాచౌదరి బుకాయించారు. బ్యాంకులకు బురిడీ కొట్టినా.. కోర్టు చివాట్లు పెట్టినా చివరకు సుజనా కంపెనీని సీజ్‌ చేసినా ఎల్లో మీడియాలో ఒక్క వార్త రాలేదు.

ఆర్బిట్రేషన్‌ నోటీసులు సర్వసాధారణమే..
ఇందూటెక్‌ – మారిషస్‌ కంపెనీల వ్యవహారంలో మారిషన్‌ ప్రభుత్వం ఫిర్యాదుతో ఆర్బిట్రేషన్‌ కోసం భారత ప్రభుత్వానికి నెదర్లాండ్స్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం నోటీసు ఇచ్చింది. ఆ నోటీసులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు ఏమీ ఉండదు. ప్రధానమంత్రి కార్యాలయానికి నోటీసు వస్తుంది. ఆర్బిట్రేషన్‌ కోసం అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడి కంపెనీలపై భారత ప్రభుత్వానికి పంపించే నోటీసులన్నీ అలాగే వస్తాయి. వొడాఫోన్‌ వంటి పెద్ద పెద్ద కంపెనీలతో ఆర్బిట్రేషన్‌ సమస్య వచ్చినపుడు ఇలానే నోటీసులు అందాయి.

రిలయన్స్‌ సంస్థ కేజీ బేసిన్‌ గ్యాస్‌ రేట్లకు సంబంధించిన కేసులో కూడా ఆర్బిట్రేషన్‌ నోటీసులు ప్రధానమంత్రికి అందాయి. ఇవన్నీ రొటీన్‌గా  జరుగుతూనే ఉంటాయి. కానీ సంబంధమే లేని రెండు కంపెనీలకు చెందిన ఒక వ్యవహారంలో జగన్‌ కు ఆపాదిస్తూ జగన్‌ వల్లనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నోటీసులు వచ్చాయన్నట్లు విషప్రచారానికి దిగజారారు. ఆర్బిట్రేషన్‌ నోటీసులు ఎప్పుడూ రానట్లు.. ఇప్పుడే భూమ్యాకాశాలు బద్దలైపోయినట్లు దుష్ప్రచారం చేయడం ఎల్లో సిండికేట్‌ కుట్రపూరిత వైఖరిని బట్టబయలు చేస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top