ఆ గొంతు నాదే : యడ్యూరప్ప

Yeddyurappa Admits Voice On Tape Is Mine Only - Sakshi

బెంగళూరు : కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న ఆడియో టేపు వ్యవహారంలో ఆసక్తికర ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఆ టేపులో మాటలు తనవేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప పరోక్షంగా అంగీకరించిన అంశం  సంచలనం సృష్టించింది. తమ ప్రభుత్వాన్ని కూల్చే లక్ష్యంతో యడ్యూరప్ప తమ శాసనసభ్యులను కొనేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ముఖ్యమంత్రి కుమారస్వామి ఓ ఆడియో టేపును విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆరోపణలను ఖండించిన యడ్యూరప్ప ‘ఆ ఆడియో సంభాషణ నాదేనని నిరూపిస్తే రాజీనామా చేస్తా’నంటూ సవాలు కూడా చేశారు.

అయితే ఆదివారం హుబ్బళ్లిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా యడ్యూరప్ప మాట్లాడుతూ.. ‘నేను దేవదుర్గకు వెళ్లినప్పుడు అర్ధరాత్రి ముఖ్యమంత్రి కుమారస్వామి తన పార్టీ ఎమ్మెల్యే కుమారుడిని పంపి నాతో మాట్లాడేలా ప్రేరేపించారు. ఆ సంభాషణలో తనకు అవసరమైన మాటల్ని కత్తిరించి ఎడిట్‌ చేసి వాటిని విడుదల చేశారు’ అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ  ఆగ్రహించిన యడ్యూరప్ప ఆడియోలో సంభాషణ తనదేనని అంగీకరించారు.

ఆడియో టేపుల విషయంలో యడ్యూరప్ప నిజం ఒప్పుకోవడంతో కాంగ్రెస్‌, జేడీఎస్‌ పక్షాలు ఆయనపై విమర్శల దాడికి దిగాయి. యడ్యూరప్ప రాజీనామా చేయాల్సిందేనంటూ ఉప ముఖ్యమంత్రి జీ పరమేశ్వర డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top