మిజోరం ఎన్నికల్లో విజయం ఎవరిది?

Will Congress Party Retain Mizoram, Election analysis - Sakshi

సాక్షి, ఐజాల్‌ : మిజోరంలో ముచ్చటగా మూడోసారి కాంగ్రెస్‌ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లాల్‌ థన్‌హావ్లా ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మాటలు నిజమయ్యేనా? పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో పెరిగిపోయిన అవినీతి, బంధుప్రీతి పార్టీ విజయావకాశాలను దెబ్బతీయవా? వ్యవసాయ సంక్షోభం కారణంగా పాలకపక్షంపై మండిపడుతున్న రైతులు కాంగ్రెస్‌ విజయావకాశాలను ఏ మేరకు దెబ్బతీయగలరు?  క్రైస్తవ విలువలకు కట్టుబడి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మద్యనిషేధాన్ని కచ్చితంగా అమలు చేస్తామంటూ విస్తతంగా ప్రచారం చేస్తున్న మిజో నేషనల్‌ ఫ్రంట్‌ ఏ మేరకు రాణించనుంది?

మిజోరం ప్రజలు సంప్రదాయ పద్ధతుల్లో చేసుకుంటున్న పోడు వ్యవసాయం స్థానంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వ్యవసాయం కోసం కొత్త భూమిని వినియోగించే విధానం’ను 2008లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే ప్రవేశపెట్టింది. 2013 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడానికి ఆ విధానమే పార్టీకి తోడ్పడింది. ఫలితంగా రాష్ట్రంలోని 40 సీట్లకుగాను 2008లో 32 సీట్లను గెలుచుకోగా, 2013 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 34 సీట్లను గెలుచుకుంది. ఓట్ల శాతం కూడా 38.89 శాతం నుంచి 44.63 శాతానికి పెరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ పాలకులు ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ విధానం ఆశించిన మేరకు విజయం సాధించకపోవడంతో రైతుల్లో నిరాశ నిస్పహలు పెరిగి పోయాయి.

గతంలో మిజోరంలో కాంగ్రెస్, మిజో నేషనల్‌ ఫ్రంట్‌ ప్రధానంగా పోటీ పడగా, ఈసారి బీజేపీతోపాటు ‘జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌’ పేరిట ఏడు ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యాయి. ఈ మూవ్‌మెంట్‌ కింద పలు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగారు. కేంద్రంలో బీజేపీ నేతత్వంలోని ఎన్డీయేలో భాగస్వామిగా కొనసాగుతున్న మిజో నేషనల్‌ ఫ్రంట్, రాష్ట్ర స్థాయిలో ‘నార్త్‌ ఈస్ట్‌ డెమోక్రటిక్‌ అలయెన్స్‌లో కొనసాగుతోంది. ఎన్నికల అనంతరం బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలను ఆ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి జోరమ్‌థంగా పదే పదే ఖండిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఈసారి బీజేపిని అడ్డుకునేందుకు తాము ఎన్నికల అనంతరం ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

ఇటు కాంగ్రెస్‌కు అటు మిజో నేషనల్‌ ఫ్రంట్‌కు ప్రత్యామ్నాయంగా తాము ప్రజల ముందుకు వచ్చామని జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ వచ్చామని చెబుతున్నప్పటికీ జోరం అభ్యర్థులు మిజో నేషనల్‌ ఫ్రంట్‌ను చీల్చడం ద్వారా కాంగ్రెస్‌కు లాభం చేకూర్చే అవకాశాలే స్థానికంగా ఎక్కువ కనపిస్తున్నాయి. ఫలితంగా మళ్లీ కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే గతంలోకెల్లా సీట్లు గణనీయంగా తగ్గిపోవచ్చు. మిజోరంలో బుధవారం కొనసాగుతున్న పోలింగ్‌ సరళి కూడా ఇదే సూచిస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top