
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలో అవినీతి జరిగిందని కాగ్ నివేదిక స్పష్టం చేయడంపై సీఎం కేసీఆర్ ఏం సమాధానం చెప్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అవినీతి, అక్రమాల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నంబర్‌వన్‌గా ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టులలో అవినీతి విచ్చల విడిగా జరుగుతోందని ఆరోపించారు. టీఆర్‌ఎస్ నేతల జేబులు నింపడానికే రూ.3,500 కోట్లతో మిషన్ కాకతీయ పనులు చేపట్టారని.. ఈ పనుల్లో 41 శాతం ప్రాధాన్యత లేని పనులేనని కాగ్ వెల్లడించిందన్నారు.
కాగ్ నివేదికలో పేర్కొన్నట్టుగా అవినీతి భారీగా జరిగిందని, దీనికి హరీశ్‌రావు బాధ్యత వహించాలన్నారు. కుంభకోణాలకు టీఆర్‌ఎస్ నేతల అవినీతే కారణమని.. దీనిపై విచారణ జరిపించాలన్నారు. అవినీతికి పాల్పడితే చెప్పుతో కొట్టాలన్న సీఎం.. ఇప్పుడు ఎవరిని కొట్టాలో చెప్పాలని ప్రశ్నించారు.