అన్యులకు సీట్లు.. బీజేపీలో ఆగ్రహం

In West Bengal BJP Gives Tickets For Defectors - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘పార్టీ నుంచి బయటకు వెళ్దామంటే పార్టీ కార్యకర్తలే పట్టుకొని తంతారు. పార్టీ అధిష్టానమేమో పార్టీ నాయకులను కాదని, ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి బొట్టు పెట్టి టిక్కెట్లు ఇస్తోంది’ ఇది పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో నెలకొన్న పరిస్థితి. ఈ జిల్లాలో ఉన్న రెండు లోక్‌సభ  సీట్లను బీజేపీ అధిష్టానం అన్యులకు కేటాయించింది. దీనిపై జిల్లా నాయకత్వం, కార్యకర్తలు మండిపోతున్నారు. ఉత్తర బెంగాల్‌లోని మాల్డా ప్రాంతం చాలా వెనకబడిన ప్రాంతం.

మాల్డాలో బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలు కొన్నేళ్లుగా బలపడుతుండడంతో అక్కడ కూడా రాజకీయ అలజడ మొదలయింది. 2016లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచి బీజేపీ ఓ సీటును కూడా గెలుచుకొంది. ఈ జిల్లాలో ముస్లింలు ఎక్కువగా ఉన్నప్పటి బీజేపీకి ఒక్క సీటు రావడం విశేషం. 2016లో జరిగిన ఎన్నికల సందర్భంగా మత ఘర్షణలు చెలరేగడం బీజేపీకి లాభించింది. కాలియాచౌక్‌ పట్టణంలోని పోలీసు స్టేషన్‌పై ముస్లింలు దాడి చేయడంతోపాటు రెండు డజన్ల వాహనాలను దగ్ధం చేశారు.

కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఖాజెన్‌ ముర్మూ మార్చి 12వ తేదీన బీజేపీలో చేరారు. ఆయనకు మాల్డా ఉత్తర లోక్‌సభ స్థానం టిక్కెట్‌ను బీజేపీ అధిష్టానం ఇచ్చింది. ఇక మాల్డా దక్షిణ లోక్‌సభ సీటును 2015లో బీజేపీలో చేరిన మాజీ తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుడు శ్రీరూపా మిత్ర చౌధురికి కేటాయించింది. పర్యవసానంగా జిల్లా పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి అలుముకున్న విషయం తనకు తెలుసునని జిల్లా పార్టీ అధ్యక్షుడు సంజిత్‌ మిశ్రా అంగీకరించారు. అయితే అన్ని పార్టీల్లో కూడా ఇలా జరుగుతుందని, అభ్యర్థులను ప్రకటించిన వెంటనే అసంతృప్తులను మరచిపోయి వారి విజయానికి కృషి చేయడం క్రమ శిక్షణ గల పార్టీ కార్యకర్తల బాధ్యతని తాను నచ్చచెబుతూ వస్తున్నానని ఆయన అన్నారు.

ఒక్క మాల్డా జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని పలు చోట్ల బీజేపీ అధిష్టానం అన్యులకే పార్టీ టిక్కెట్లను కేటాయించింది. రాష్ట్రంలోని 42 సీట్లకుగాను బీజేపీ 40 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో పది మంది అభ్యర్థులు తృణమూల్, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా పేరుబడ్డ ఐపీఎస్‌ అధికారి భారతి ఘోష్‌ కూడా ఉన్నారు. ఈ కారణంగా చాలా చోట్ల స్థానిక బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top