తెలంగాణలో పాగా వేస్తాం | We Will Develop The Party In Telangana Also Said By BJP Telangana Chief K Laxman | Sakshi
Sakshi News home page

లోక్‌సభ ఎన్నికల స్ఫూర్తితో తెలంగాణలో పాగా వేస్తాం

Jun 1 2019 3:14 AM | Updated on Jun 1 2019 3:14 AM

We Will Develop The Party In Telangana Also Said By BJP Telangana Chief K Laxman - Sakshi

కేంద్ర మంత్రిగా నియమితులైన కిషన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్న కె. లక్ష్మణ్‌. చిత్రంలో మురళీధర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు 

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా చేసుకొని అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగించి తెలంగాణలో పాగా వేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయమని, కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరుతుండటంతో ఆ పార్టీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందన్నారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం ఒక్క బీజేపీకే ఉందని భావించే ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో తమకు పట్టం కట్టారని అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో లోక్‌ సభ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని ఒక అవకాశంగా, ఒక సవాల్‌గా భావించి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామన్నారు. ఆదివాసీలు ఉన్న ప్రాంతాల్లో బలంగా ఉన్న పార్టీని బూత్‌స్థాయిలో పటిష్టపరుస్తూ ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగిస్తాం.టీఆర్‌ఎస్‌ కుటుంబ పాలనను ఎదుర్కొనే సామర్థ్యం కాంగ్రెస్‌కు లేదని ప్రజలు భావించి బీజేపీకి పట్టం కట్టారు. టీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పటికైనా ఆకాశం నుంచి దిగివచ్చి భూమ్మీద కాలుపెట్టి ఆలోచించాలి.

లోక్‌సభ ఎన్నికల్లో విజయంతో బీజేపీ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకొని ఇంటింటికీ బీజేపీని తీసుకెళ్తాం. కేంద్ర పథకాలను తీసుకెళ్తాం. బెంగాల్‌ తరహా పోరాటాలతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతాం. కేంద్ర మంత్రి వర్గంలో కిషన్‌ రెడ్డికి స్థానం దక్కడంతో కేంద్రం నుంచి సాధ్యమైనంత సాయం తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేలా కృషి చేస్తాం. దక్షిణాదిలో కర్ణాటక తరువాత తెలంగాణలో బీజేపీ పాగా వేస్తుంది.

టీఆర్‌ఎస్‌పై పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఇంటర్‌ బోర్డు వైఫల్యాలపై విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేవరకు, ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్తాం. ఇక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని టీఆర్‌ఎస్‌ అధికారికంగా జరపకపోతే బీజేపీ అధికారంలోకి వచ్చాక జరుపుతుంద’న్నారు. 

కిషన్‌ రెడ్డి, ఎంపీలకు జిల్లా కేంద్రాల్లో సన్మానం 
కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిష న్‌రెడ్డిని, లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలను ఘనంగా సన్మానించాలని బీజేపీ నిర్ణయించింది. పాత జిల్లాల ఆధారంగా జిల్లా కేంద్రాల్లో భారీ సభలు ఏర్పాటు చేసి వారిని సన్మానించనుంది. ప్రస్తుత తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా ఒక పర్యటన చేయడం ద్వారా తమ శ్రేణులను సమాయత్తపరిచి పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని బీజేపీ యోచిస్తోంది. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలోని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ నివాసంలో జరిగిన రాష్ట్ర బీజేపీ నేతల సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ,ఎంపీ ధర్మపురి అరవింద్, అధికార ప్రతినిధి రఘునందన్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఇక నుంచి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పోరాటాలు ఉధృతం చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.

కిషన్‌ రెడ్డిని కలసిన టీడీపీ నేతలు 

కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కిషన్‌ రెడ్డిని పలువురు తెలంగాణ టీడీపీ నేతలు ఢిల్లీలో కలిశారు. టీడీపీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి, రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు చాడా సురేష్‌ రెడ్డి కలిశారు. కేంద్ర మంత్రిగా కిషన్‌ రెడ్డి ప్రమాణస్వీకారం చేయడంతో టీడీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిసినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. అయితే వీరిద్దరు నేతలు బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక తెలంగాణ భవన్‌కు విచ్చేసిన కిషన్‌ రెడ్డిని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి కలసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement