కేంద్రానికి సహకరిస్తూనే ‘హోదా’ కోసం పోరాటం

Vijayasai Reddy Says YSRCP Fight For AP Special Status In Parliament - Sakshi

అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్‌సీపీ స్పష్టీకరణ

రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి

బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి 

మహిళా బిల్లు ఆమోదానికి చర్యలు తీసుకోవాలి

సాక్షి, న్యూఢిల్లీ : ప్రజా ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తూనే, ప్రత్యేక హోదా సాధన కోసం తమ పోరాటం కొనసాగిస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది. సోమవారం నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి నేతృత్వంలో ఆదివారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ తరఫున పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి హాజరయ్యారు. అఖిలపక్ష భేటీ అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రిని కోరామని చెప్పారు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశామన్నారు. 

సభా సమయం వృథా కాకుండా చూడాలి 
‘‘వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించాం. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని, అవసరమైతే దీన్ని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చి రాజ్యాంగబద్ధత కల్పించాలని కోరాం. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి చర్యలు తీసుకోవాలని విన్నవించాం. గతంలో పార్లమెంట్‌ సమావేశాల్లో సభా సమయం ఎక్కువగా వృథా అయ్యేది. ఎలాంటి చర్చలు, నిర్ణయాలు లేకుండా ఆటంకాలతో సభా సమయం ముగిసేది. ఇప్పుడు అలా జరగకుండా ఒక ప్రత్యేక చట్టం ద్వారా ఏడాదికి ఇన్ని రోజుల పాటు పార్లమెంట్‌ సమావేశం కావాలని, ఎవరైతే హాజరు కారో, ఎవరైతే సమావేశాలకు ఆటంకాలు సృష్టిస్తారో అలాంటి వారికి జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలు అందకుండా చూడాలని సూచించాం. పలు అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. అన్ని రాజకీయ పక్షాలు మహిళా రిజర్వేషన్లను కోరుకున్నాయి. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగేలా చూడాలని అఖిలపక్ష సమావేశంలో కోరాయి’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

ఇక లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పదవిపై ఎలాంటి ప్రతిపాదనలు లేవని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇదివరకే స్పష్టం చేశారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనే తమ ప్రధాన ఎజెండా అని తేల్చిచెప్పారు. బీసీలకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం పెరగాలని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ దిశగా ఆలోచించి, బీసీలకు అత్యధిక ఎమ్మెల్యే సీట్లు, మంత్రి పదవులు ఇచ్చారని గుర్తుచేశారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top