
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి భారీగా వలసలు ఊపుందుకున్నాయి. మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు, నందిగామ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత వసంత కృష్ణప్రసాద్ వైఎస్సార్ సీపీలో చేరనున్నారు. తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు ఆయన తెలిపారు. కృష్ణాజిల్లాలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన అనుచరులతో కలిసి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరనున్నట్లు వసంత కృష్ణప్రసాద్ సోమవారం వెల్లడించారు. మరోవైపు టీడీపీ నేత, యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు కూడా మే 5వ తేదీన వైఎస్సార్ సీపీలో చేరబోతున్నారు.
కాగా కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విదితమే. పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలతో తరలివచ్చి కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం కనుమూరు సమీపంలో పాదయాత్ర సాగిస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.