పలుగు, పార చేతపట్టి సామాన్యుడిలా..!

Uttar Pradesh Minister Picked Up A Spade Photos went Viral - Sakshi

లక్నో : ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఉత్తరప్రదేశ్‌ కేబినెట్‌ మంత్రి ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ పలుగు, పార చేతపట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆ వివరాలిలా.. వారణాసిలోని సింధోరలో రాజ్‌భర్‌ పాత (వంశపారంపర్య)ఇళ్లు ఉంది. అయితే ఆ ఏరియాలో వాహనాలు వెళ్లేందుకు సౌకర్యం లేదని, రోడ్డు నిర్మాంచాలని యూపీ ప్రభుత్వాన్ని, అధికారులను బీసీశాఖ మంత్రి రాజ్‌భర్‌ పలుమార్లు కోరారు

అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోక పోవడంతో తానే స్వయంగా రంగంలోకి దిగారు. తలకు పసుపు తలపాగా ధరించి, గ్రామస్తుల సాయంతో మరమ్మతులు చేపట్టారు. పలుగు, పార చేతపట్టి సామాన్య కూలీగా రోడ్డు పనులు చేశారు. దీనిపై ఏఎన్‌ఐ మీడియా రాజ్‌భర్‌ను సంప్రదించగా.. నేడు(ఆదివారం) నా కుమారుడి వివాహ రిసెప్షన్ ఉంది. అయితే మా ఇంటికి వచ్చే అతిథులకు అసౌకర్యం కలుగుతుంది. ఆ ఇబ్బందుల నివారణలో భాగంగా జిల్లా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాన్ని రోడ్డు నిర్మాణం చేపట్టాలని గతంలో పలుమార్లు కోరినా ప్రయోజనం లేకపోయింది. రాష్ట్ర కేబినెట్‌ మంత్రిపట్ల ఇంత వివక్ష చూపిస్తున్నారు. అందుకే సొంతంగా మా పని మేం చేసుకున్నామని’ మంత్రి ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ వివరించారు.

యోగి అదిత్యనాథ్‌ సర్కార్‌ చర్యలను గతంలో పలుమార్లు ఆయన వ్యతిరేకించారు. పలు అంశాల్లో ప్రభుత్వాన్ని విమర్శించారు. గతంలో రాజ్‌భర్‌ బహ్రైచ్‌ పట్టణంలోని సర్క్యూట్‌ హౌస్‌ను సందర్శించినప్పుడు ఇతర మంత్రులకు ఇచ్చే గౌరవాన్ని అధికారులు తనకు ఇవ్వలేదన్నారు. తాను వెనకబడిన కులానికి చెందినవాడిని కావడమే వివక్షకు కారణమని స్వయంగా రాష్ట్ర మంత్రే చెప్పడం చర్చనీయాశంగా మారడం తెలిసిందే.

కాగా, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్‌ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ), బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వంలో కొనసాగుతోంది. ఎస్‌బీఎస్‌పీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాజ్‌భర్‌కు మొదటినుంచీ యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌ నిర్ణయాలు మింగుడు పడటం లేదు. యూపీ బీజేపీ అధ్యక్షుడు మహేంద్రనాథ్‌ పాండే ఓ కార్యక్రమంలో రాజ్‌భర్‌ ఓ దొంగ అని తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు వివరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top