‘ముందస్తు ఎన్నికలకు వెళ్లడం కేసీఆర్‌ కర్మ’

Uttam Kumar Reddy Speech At Gadwal Public Meeting - Sakshi

సాక్షి, గద్వాల: తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కర్మ అని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం గద్వాలలో జరిగిన కాంగ్రెస్‌ ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. గద్వాల ప్రజల ఉత్సాహం చూస్తుంటే కేసీఆర్‌ ఓటమి ఖాయంగా కనిపిస్తోందని జోస్యం చెప్పారు. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటే నాకేంటన్న కేసీఆర్‌కు 20 రోజుల్లోనే భయం పట్టుకుందని విమర్శించారు. కేసీఆర్‌ కుటుంబం గజదొంగల్లా తెలంగాణను దోచుకుంటుందని.. వారిని తరిమి కొట్టడానికి ప్రజాసంఘాలు, ప్రజలు, అన్ని పక్షాలు కలిసి రావాలని కోరారు. కేసీఆర్‌ నంబర్‌ వన్‌ తెలంగాణ ద్రోహి అని ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, లక్ష ఉద్యోగాలు ఇలా ప్రతి విషయంలో కేసీఆర్‌ మోసం చేశారని మండిపడ్డారు. 

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘కేసీఆర్‌ ప్రధాని నరేంద్ర మోదీకి ఎజెంట్‌.. మోదీ తీసుకున్న అన్ని నిర్ణయాలకు కేసీఆర్‌ మద్దతు తెలిపారు. నిజామాబాద్‌ సభలో ఇతరులపై నోరు పారేసుకున్నారు. తెలంగాణ ద్రోహులందరిని కేసీఆర్‌ పక్కకు పెట్టుకున్నారు. నేను పాకిస్తాన్‌, చైనా బార్డర్‌లో పనిచేసిన సమయంలో దుబాయ్‌ బ్రోకర్‌గా పనిచేసిన కేసీఆర్‌ నా గురించి మాట్లాడుతున్నావా?. రాబోయే కాంగ్రెస్‌ పాలనలో ఒకేసారి రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం. కేంద్రం ఇచ్చే మద్దతు ధరకు మరింత బోనస్‌ కలిపి పంటలను కొనుగోలు చేస్తాం. మొదటి సంవత్సరమే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. పది లక్షల మందికి నెలకు 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి అందజేస్తాం. ప్రైవేట్‌ కాలేజ్‌ల్లో చదివేవారికి పూర్తి రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామ’ని తెలిపారు. 

కేసీఆర్‌ది శృంగారం.. మాదీ వ్యభిచారామా?
డీకే అరుణ మాట్లాడుతూ.. చంద్రబాబుతో కేసీఆర్‌ పొత్తు పెట్టుకుంటే తప్పులేదు కానీ.. కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుంటే తప్పా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ది శృంగారం.. మాదీ వ్యభిచారామా అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చిందని విజయశాంతి పార్టీలో చేరారు కానీ.. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేస్తాని చెప్పిన కేసీఆర్‌ మాత్రం మాట మార్చరని మండిపడ్డారు. పాలమూరు నుంచి ఎంపీగా ఉన్న సమయంలో కేసీఆర్‌ పార్లమెంటులో ఒక్కసారైనా ఆర్డీఎస్‌ గురించి మాట్లాడలేదని తెలిపారు. పార్లమెంటులో తెలంగాణ గురించి చర్చ జరిగనప్పుడు కేసీఆర్‌ ఎక్కడున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను అన్నింటా మోసం చేసిన కేసీఆర్‌ కులాల మధ్య చిచ్చు పెట్టాడని విమర్శించారు. చేసిన అవినీతిని బయటపడకుండా ఉండేందుకు కేసీఆర్‌ బీజేపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకున్నారని ఆరోపించారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top