హరీష్‌ను కేసీఆర్‌ గెంటివేస్తారు : రేవంత్‌ రెడ్డి

TRS Party No Stand On Special Status Says Revanth Reddy - Sakshi

ప్రత్యేక హోదాపై టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన వైఖరి లేదు : రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌లో వర్గ పోరాటం జరుగుతోందని, హరీష్‌రావును సీఎం కేసీఆర్‌ త్వరలోనే పార్టీ నుంచి గెంటివేస్తారని కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి జోస్యం చెప్పారు. కేసీఆర్‌ కుటుంబం దిక్కుమాలినది అని, కాంట్రాక్టుల్లో మామ 10 శాతం, అల్లుడు రెండుశాతం వాటాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. బుధవారం ఓ కార్యక్రమంలో రేవంత్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చింది కాంగ్రెస్‌ పార్టీ అని అన్నారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలపకుండా కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకుందని, మోదీ ప్రధాని, కేసీఆర్‌ సీఎం అయిన తరువాతనే ఏడు మండలాలను ఏపీలో కలుపుతూ ఆర్డినెన్స్‌ తీసుకువచ్చారని గుర్తుచేశారు. 

ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, ముంపు గ్రామాల విలీనంపై చర్చ సందర్భంగా నాడు కేసీఆర్‌, కేశవరావుల పార్లమెంట్‌లోనే ఉన్నారని తెలిపారు. ముంపు మండలాలను ఏపీలో కలిపింది కాంగ్రెస్‌ పార్టీ అని ఎంపీ వినోద్‌ మాట్లాడం దారుణం అని విమర్శించారు. యజమానులకు, పనివాళ్లకు మధ్య టీఆర్‌ఎస్‌లో పోరాటం జరుగుతోందని, ఏపీ ప్రత్యేక హోదాపై ఎవ్వరి వాదన వారిదేనని పేర్కొన్నారు. ‘లోక్‌సభ వేదికగా ఎంపీ కవిత ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపారు. హరీష్‌, వినోద్‌లు దానిని వ్యతిరేకించారు. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్‌ పార్టీ వైఖరి అడగడం వెనుక ఆంతర్యం ఏంటి? రాష్ట్రంలో ప్రత్యక్షంగా, కేంద్రంలో పరోక్షంగా అధికారంలో ఉండి మీరు వైఖరి చెప్పకుండా మా వైఖరి అడగటం ఏంటి? సోనియా మాట, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నిర్ణయమే మా వైఖరి. ప్రత్యేక హోదా తీర్మానమే ఫైనల్‌. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మా నిర్ణయాల్లో మార్పు ఉండదు’ అని రేవంత్‌ అన్నారు.

‘తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆకాంక్షలను నెరవేర్చేందుకు పార్లమెంట్‌ తలుపులు మూసి, లైవ్‌ కట్‌ చేసి బిల్‌ పాస్‌ చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీది. ప్రత్యేక హోదాపై కేసీఆర్‌, కవిత, హరీష్‌లకు ఒక్క మాట ఉండదా? ప్రత్యేక హోదాపై సీడబ్ల్యూసీ నిర్ణయమే మాకు శిలా శాసనం. నాపై ఎంతమంది ‘రావు’లు కేసులు పెట్టినా భయపడను. చివరి వరకూ కేసీఆర్‌ దోపిడీని ప్రశిస్తూనే ఉంటా’ అని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top