60 మంది బీసీలకు టికెట్లు: తమ్మినేని

Tickets for 60 BC candidates says Tammineni - Sakshi

సాక్షి, కామారెడ్డి: ముందస్తు ఎన్నికలకు సీపీఎం సిద్ధంగా ఉందని, ఇప్పటికే 25 మంది అభ్యర్థుల పేర్లను పరిశీలించి అందులో 10 మంది పేర్లు ఖరారు చేశామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. కామారెడ్డిలో ఆదివారం ప్రారం భమైన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర కమిటీ ఆమోదం తరువాత అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. సీపీఎం ఆధ్వర్యంలో బీఎల్‌ఎఫ్‌ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. సీపీఎం 20 నుంచి 25 స్థానాల్లో పోటీ చేస్తుందని, మిగతా స్థానాల్లో బీఎల్‌ఎఫ్‌ భాగస్వామ్య పక్షాల అభ్యర్థులు పోటీ చేస్తారన్నారు. 60 మంది బీసీలను బరిలో నిలుపుతామని తెలిపారు. రాష్ట్రంలో కలసి పనిచేయడానికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో చర్చించామన్నారు. బీసీల తరఫున పోరాడుతున్న ఆర్‌.కృష్ణయ్యతోనూ చర్చిస్తామన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీతోనూ చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.
 
కాంగ్రెస్‌తో కలవబోం..
కాంగ్రెస్‌ కూటమిలో సీపీఎం చేరబోదని తమ్మినేని స్పష్టం చేశారు. దేశాన్ని భ్రష్టుపట్టించిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్రజాస్వామిక పాలన సాగించిందని, అందుకే తాము ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో, అణచివేత విధానాలతో పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాకుండా చూస్తామని పేర్కొన్నారు. 

ఎర్రజెండాకు ఒక్క అవకాశం ఇవ్వండి
కామారెడ్డి టౌన్‌: కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌ల పాలనతో ఏ మార్పూ రాలేదని, ఒక్కసారి ఎర్రజెండా పార్టీ (బీఎల్‌ఎఫ్‌)కి రాజ్యాధికారం ఇవ్వాలని తమ్మి నేని కోరారు. తమకు అధికారం అప్పగిస్తే సమగ్రాభి వృద్ధి సాధిస్తామన్నారు. కామారెడ్డిలో పార్టీ రాష్ట్ర వర్గ సమావేశాలు ముగింపు సందర్భంగా సోమవారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top