రైతుల కోసమే పుట్టాం.. వారి కోసమే చస్తాం

Thopudurthi Prakash Reddy Fires On TDP Government In Anantapur - Sakshi

అధికార పార్టీ నాయకుల భూ దాహానికి అన్నదాతలు బలవుతున్నారు

తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆగ్రహం

ఆత్మకూరు: ‘రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు. రైతుల బాగు కోసం ప్రాణాలైనా ఇస్తాం. రైతుగా పుట్టాను. రైతుల కోసమే జీవిస్తాను.. అవసరమైతే వారి కోసమే చస్తాను’ అని వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. వేరుశనగ పంటకు మద్దతు ధర విత్తుకు ముందే ప్రకటించాలని ఆత్మకూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట గురువారం చేపట్టిన రైతు ధర్నాలో ఆయన ప్రసంగించారు. ఖరీఫ్‌లో వేరుశనగ సాగు చేసే రైతులకు భరోసానందించేందుకు కిలో రూ.61 చొప్పున పంటకు ముందస్తుగా మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రేషన్‌ దుకాణాల ద్వారా వేరుశనగ నూనె సరఫరా చేయిస్తే రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఉపాధి పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్నారు.

రాప్తాడులో బ్రోకర్లదే రాజ్యం
ప్రస్తుతం రాప్తాడు నియోజకవర్గంలో బ్రోకర్లదే రాజ్యం నడుస్తోందని ప్రకాష్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు మంత్రి సునీత తన బంధువులను మండలానికో ఇన్‌చార్జ్‌గా నియమించుకుని దోపిడీ సాగిస్తున్నారన్నారు. నిధులు కొల్లగొట్టేందుకే వంద కోట్లు కూడా ఖర్చు కాని అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టు అంచనాలను రూ.1140 కోట్లకు పెంచారన్నారు. గాలి మరల ఏర్పాటుకు భూసేకరణ విషయంలోనూ రైతులను దగా చేసి సొమ్ము కూడబెట్టుకున్నారన్నారు. వీరి భూదాహానికి రైతు కేశవ్‌నాయక్‌ పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలాడని, వడ్డుపల్లికి చెందిన ఓ మహిళా రైతు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగారని గుర్తు చేశారు. మంత్రి సునీత తన పదవిని అడ్డుపెట్టుకుని బీఎల్‌వో, వెలుగు వీవోలను లోబర్చుకుని 25 వేల దొంగ ఓట్లను జాబితాలోకి చేర్చారని విమర్శించారు.

జగన్‌తోనే సంక్షేమ రాజ్యం
రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. ఆయన సీఎం అయితే రైతులకు గిట్టుబాటు ధర వేరుశనగకు రూ. 61 ప్రకటిస్తామని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రాజారాం, చంద్రఖర్‌రెడ్డి, మధు, కేశవరెడ్డి, మల్లన్న, మహానందరెడ్డి, మల్లన్న, వాసుదేవరెడ్డి, ముత్యాలన్న, వెంకటేష్, ఈశ్వరరెడ్డి, ఈశ్వరయ్య, వరప్రసాద్‌రెడ్డి, బాలపోతన్న, సుభద్రమ్మ, పార్వతమ్మ, నరసింహారెడ్డి, శ్రీధర్, హనుమంతునాయక్, నరసింహులు, సోము, లక్షినారాయణరెడ్డి, అనీల్, మురళి, దామోదర్‌రెడ్డి, అతికిరెడ్డి, పెదయ్య, సీపీఐ నాయకులు రామకృష్ణ, రమేష్, దిలీప తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top