ఎందుకు ఓడాం.. ఎలా గెలుస్తాం?

Telangana Congress leaders meet Rahul Gandhi - Sakshi

రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు రాహుల్‌ సూటి ప్రశ్న 

ఈవీఎంలు, డబ్బు ప్రభావమని ఉత్తమ్, కుంతియా వివరణ 

ఈ వాదనతో విభేదించిన ఏఐసీసీ అధ్యక్షుడు 

ఆ మూడు రాష్ట్రాల్లో గెలిచాం కదా అని ప్రశ్న 

బాబు రాకతో సీన్‌ మారిందన్న నేతలు 

ఉత్తమ్, కుంతియాపై నేతల పరోక్ష యుద్ధం 

నాయకత్వాన్ని మార్చాలని మరో వర్గం వినతి 

సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశం తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అగ్రనేతలకు షాక్‌ మిగిల్చింది. ఓటమికి వారు తెలిపిన కారణాలతో రాహుల్‌ విభేదించగా.. ఓ వర్గం నేతలంతా ఉత్తమ్‌కు, కుంతియాకు వ్యతిరేకం గా వ్యాఖ్యలు చేశారు. ఇందులో భట్టి విక్రమార్కకు అనుకూలంగా ఉన్న నేతలు కూడా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను సమీక్షిస్తూనే రానున్న లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం కావడంపై సూచనలు ఇచ్చేందుకు మంగళవారం ఇక్కడ తన నివాసంలో టీకాంగ్రెస్‌ నేతలతో రాహుల్‌ సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ భేటీకి టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, రేవంత్‌రెడ్డి, కుసుమ్‌కుమార్, 15 మంది ఎమ్మెల్యేలు, ఇటీవల రాహుల్‌ నియమించిన ఐదు కమిటీల్లో సభ్యులుగా ఉన్నవారంతా హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌ విజయశాంతి, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌ రాజగోపాల్‌రెడ్డి, మీడియా కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ కూడా ఇందులో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, ఆత్రం సక్కు, ఉపేందర్‌రెడ్డి, జగ్గారెడ్డితో పాటు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌ గైర్హాజర య్యారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడారు? లోక్‌సభ ఎన్నికల్లో ఎలా గెలుస్తారు? అని టీపీసీసీ నేతలను ప్రశ్నిం చారు.

రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో విజయం సాధించి తెలంగాణలో ఓడిపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేసిన ఆయన.. టీఆర్‌ఎస్‌ తన ఓట్లను 34 శాతం నుంచి 46 శాతానికి ఎలా పెంచుకుందో చెప్పాలని అడిగారు. విశ్వసనీయ వర్గాల సమాచా రం మేరకు.. ఈ సమావేశంలో పాల్గొన్నవారంతా కారణాలు వివరించారు. తొలుత ఉత్తమ్‌ మాట్లాడుతూ.. ఈవీఎంలలో గోల్‌మాల్‌ జరిగిందని, ఈవీఎం ల లెక్కలకు వీవీప్యాట్ల లెక్కలకు సరిపోలలేదని వివరించారు. ధన ప్రవాహం, సెంటిమెంట్‌ కూడా తోడైందని పేర్కొన్నారు. ఫలితాలపై తాను చింతిస్తున్నానని, ఐయామ్‌ సారీ అంటూ క్షమాపణ కోరి నట్టు తెలిసింది. ఎన్నికల్లో విపరీతంగా డబ్బు పం పిణీ జరిగిందని, ఈవీఎంలలో గోల్‌మాల్‌ జరిగిందంటూ కుంతియా చెప్పబోగా.. రాహుల్‌ విభేదించారు. ‘ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో కూడా డబ్బులు పంచారు. ఛత్తీస్‌గఢ్‌లో అయితే బీజేపీ విపరీతంగా డబ్బు పం చింది.. అయినా గెలిచాం కదా’ అని ప్రశ్నిం చారు. దీంతో కుంతియా, ఉత్తమ్‌ మౌనంగా ఉండిపోయారు. టీఆర్‌ఎస్‌ నియోజకవర్గాల వారీగా వ్యూహాలు అమలు చేసిందని, ఓటు బదిలీ కాలేదని, డబ్బు ప్రభావం విపరీతంగా పనిచేసిందని భట్టి నివేదించారు. ఆయన మాట్లాడుతుండగా రాహుల్‌ కలగజేసుకోవడంతో భట్టి మధ్యలోనే తన వివరణ ఆపేయాల్సి వచ్చింది. 

ఉద్యమాలే లేకుండా పోయాయి: రేవంత్‌రెడ్డి 
రేవంత్‌రెడ్డి పరోక్షంగా ఉత్తమ్, కుంతియాలను లక్ష్యంగా చేసుకున్నారు. గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమాన్ని నిర్మించలేదని, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వంలో ఒక్క భారీ బహిరంగ సభ కూడా నిర్వహించలేదని చెప్పారు. గత ఏడాదిన్నరలో కూడా కేవలం కాంగ్రెస్‌ యాత్రలు, కాంగ్రెస్‌ కార్యకర్తలతో మాత్రమే కార్యక్రమాలు జరిగాయని.. ప్రజల్లోకి వెళ్లలేదని వివరించారు. పోల్‌ మేనేజ్‌మెంట్‌లో కూడా పూర్తిగా విఫలమైందన్నారు. మీరెలా ఓడిపోయారని రేవంత్‌ను రాహుల్‌ ప్రశ్నించగా.. అధికారపార్టీ నేతలు తనను వేధింపులకు గురిచేశారని, స్థానికంగా బెదిరింపులు, కొనుగోళ్లు ఇతర త్రా కారణాలు అనేకం ఉన్నాయని చెప్పినట్టు సమాచారం. టీకాంగ్రెస్‌ నాయకత్వంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శలు చేసినవారిలో ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులున్నా రు. నలుగురైదుగురిని వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా నియమించడం వల్ల ఉపయోగం లేదని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా ఓటు దక్కనివారిని ప్రధాన కార్యదర్శులుగా, ఉపాధ్యక్షులుగా నియమించడం వల్ల ఉపయోగం ఏమి టని వాపోయారు. డీసీసీ అధ్యక్షులు టికెట్ల కోసం తప్ప పార్టీ కోసం ఎలాంటి పని చేయలేదని గండ్ర ఆరోపించారు. రాష్ట్ర నాయకత్వం హోటళ్లలో మిత్రపక్షాలతో చర్చలకే పరిమితమైందని, టికెట్లు త్వరగా కేటాయించలేదని, ప్రచారం నిర్వహణలో విఫలమైందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేయాలని, రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలని శ్రీధర్‌బాబు పరోక్షంగా వివరించినట్టు సమాచారం. 

విడివిడిగా రాహుల్‌ ఆరా... 
తెలంగాణలో దారుణంగా ఎందుకు దెబ్బతిన్నాం? ఎన్నికల సమయంలో ఏం జరిగింది? లోక్‌సభ ఎన్నికల పరిస్థితి ఏంటి? ఎక్కువ స్థానాలు గెలవడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? టీడీపీతో పొత్తు, చంద్రబాబు అంతా తానై నడిపించడం వల్లే ఓడిపోయామంటున్నారు నిజమేనా? అంటూ రాహుల్‌ పలువురు నేతలను విడివిడిగా అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికలపై వ్యూహాలను రెండు మూడు రోజుల్లో ఖరారుచేస్తామని, మరోసారి రాష్ట్ర నాయకత్వంతో సమావేశమవుతామని చెప్పినట్టు తెలిసింది. కాగా ఈ సమావేశానికి ముందు పార్టీ ప్రోటోకాల్‌ ఇన్‌చార్జి హర్కర వేణుగోపాల్‌తో రాహుల్‌ చర్చించారని సమాచారం. కేసీఆర్‌ పథకాలు, మైనారిటీలు టీఆర్‌ఎస్‌కు ఓటేయడం వంటి అంశాలతోపాటు సాయంత్రం 4 గంటల తర్వాత అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగపరిచి ఓట్లేసుకున్నారని ఆయన వివరించినట్టు తెలిసింది.

కేసీఆర్‌ వర్సెస్‌ బాబుగా మారడం వల్లే: పొన్నం 
టికెట్ల పంపిణీ ఆలస్యం కావడం, ప్రచారం లో టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రంగా మారడం, అంతిమంగా పోటీని కేసీఆర్‌ వర్సెస్‌ చంద్ర బాబుగా, కేసీఆర్‌ వర్సెస్‌ అమరావతిగా మలచడం, దీంతో సెంటిమెంటు ప్రతికూలంగా మార డం వల్ల ఓటమి ఎదురైందని మరో వర్కింగ్‌ ప్రెసి డెంట్‌ పొన్నం ప్రభాకర్‌ వివరించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ దృక్పథంతో ముం దుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, పోటీ రాహుల్‌ వర్సెస్‌ మోదీ అనే విషయాన్ని ప్రజల్లోకి చేర్చాలని కోరినట్టు సమాచారం. కాగా, రాహుల్‌గాంధీని ఖమ్మం నుంచి పోటీ చేయాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కోరారు. ఎన్నికలకు ముందు టీడీపీతో పొత్తు పెట్టుకొని ఉండాల్సింది కాదని, సెంటిమెంట్‌తో పాటు కేసీఆర్‌ పథకాలు పనిచేయడం, బాబు తెలంగాణలో అన్నీ తానే చేశానని అంతకుముందు పదేపదే మాట్లాడటం వంటి అం శాల కారణంగా ఓటమి ఎదురైనట్టు ఆయన విశ్లే షించారు. సీఎల్పీ గత ఐదేళ్లలో ఎలాంటి కృషి చేయలేదని, సభలో పార్టీ ఘోరంగా విఫలమైం దని ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్‌ పరోక్షం గా జానారెడ్డిని విమర్శించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top