నువ్వా..నేనా?

TDP Party Leaders Conflicts in Chittoor - Sakshi

శైవక్షేత్రంలో బొజ్జల వర్సెస్‌ ఎస్సీవీ

టికెట్‌ రేసులో ఇరువురు హోరా హోరీ

చంద్రబాబు ఒకరికి...   నారా లోకేష్‌ మరొకరికి హామీ ?

శ్రీకాళహస్తి టీడీపీలో వేడెక్కిన రాజకీయం

శ్రీకాళహస్తి టీడీపీ టికెట్‌ కోసం మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు హోరాహోరీగా పోటీపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో శ్రీకాళహస్తి టికెట్‌ తమదేనంటూ ఎవరికి వారు అనుచరుల వద్ద చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు.

సాక్షి, చిత్తూరు ,తిరుపతి: శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ టికెట్‌ తన కుటుంబానికి ఇస్తానని అధినేత హామీ ఇచ్చారని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చెబుతున్నారు. చినబాబు లోకేష్‌ తనకు హామీ ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ధీమాగా ఉన్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. జిల్లాలో రెండు, మూడు అసెంబ్లీ స్థానాలు మినహా మిగిలిన నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారు కాలేదు. ఇందులో సిటింగ్‌ ఎమ్మెల్యేలకే టీడీపీ అధినేత టికెట్లు ఖరారు చేయలేదు. అందులో శ్రీకాళహస్తి ఒకటి. ఇక్కడ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఈసారి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే శ్రీకాళహస్తి నుంచి భార్య బృందమ్మ లేదా కుమారుడు సుధీర్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వమని అధినేత దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ మేరకు బొజ్జల కుటుంబంలో ఒకరికి టికెట్‌ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే గోపాలకృష్ణారెడ్డి తన అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారు. తన కుటుంబంలోని వారికి తప్ప మరెవరికీ ఇవ్వరని ఆయన తన అనుచరుల వద్ద గట్టిగాచెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా బొజ్జల కుమారుడు సుధీర్‌కి టికెట్‌ ఇప్పిస్తానని మాటిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

శ్రీకాళహస్తి టికెట్‌ నాదే
మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తున్నానని చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. తనకు మంత్రి లోకేష్‌ హామీ ఇచ్చారని చెబుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల తంగేడుపాళెంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో స్వయంగా ఎస్సీవీ నాయుడు తనకే టికెట్‌ వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఆ మేరకు సీఎం చంద్రబాబు కూడా హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. అదేవిధంగా మంత్రి నారా లోకేష్‌ కూడా గట్టిగా చెప్పినట్లు ఎస్సీవీ నాయుడు తన అనుచరుల వద్ద వెల్లడించినట్లు తెలిసింది. ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రచారం కూడా చేసుకోమని సూచించినట్లు సమాచారం. ఎన్నికల్లో ఖర్చుకు అవసరమైన నిధుల కోసం ఏకంగా తన ఎస్సీవీ కేబుల్‌ని విక్రయించిన ట్లు ప్రచారం సాగుతోంది. లోకేష్‌ బాబు మాట ఇవ్వడం, ఆ నమ్మకంతోనే కేబుల్‌ నెట్‌వర్క్‌ని విక్రయించినట్లు తెలుస్తోంది. ఎస్సీవీ నాయుడు తన అనుచరుల వద్ద చెబుతున్న సమాచారం మేరకు అసెంబ్లీ టికెట్‌ ఖరారు అయ్యిందనే ప్రచారం సాగుతోంది. దీంతో శ్రీకాళహస్తి టీడీపీ శ్రేణులు ఎవరివైపు వెళ్లాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top