సినిమా చూపించిన చంద్రబాబు | TDP MPs Will Not Resign Says Chandrababu Naidu At Delhi | Sakshi
Sakshi News home page

సినిమా చూపించిన చంద్రబాబు

Apr 4 2018 6:11 PM | Updated on Mar 23 2019 9:10 PM

TDP MPs Will Not Resign Says Chandrababu Naidu At Delhi - Sakshi

ఢిల్లీ ప్రెస్‌మీట్‌లో పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇస్తోన్న చంద్రబాబు నాయుడు

ప్రశ్న: ‘పార్లమెంట్‌ సమావేశాల తర్వాత టీడీపీ ఏం చెయ్యబోతున్నది? హోదా పోరాటంలో మీ భవిష్యత్‌ ప్రణాలిక ఏంటి? ఎంపీల రాజీనామాలు, ఆమరణదీక్ష అని వైఎస్సార్‌సీపీ ప్రకటించింది కదా, మీరు కూడా రాజీనామాలుచేసి కేంద్రంపై ఒత్తిడి తెస్తారా?
సమాధానం: ‘‘వాట్‌ ఐయామ్‌ సేయింగ్‌.. మేము ఇక్కడే ఉండి పోరాడాలి. నేను ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిని కాను. కనీసం టీడీపీ అధ్యక్షుడిగానూ చెప్పడంలేదు. నాకు మీ అందరి సపోర్ట్‌ కావాలి. మేము మాత్రం రాజీనామాలు చేసి ఇంటికి పోతే కుదరదు. అది రాష్ట్రానికి మంచిది కాదు. ఒక్కొక్కరు ఒక్కోలా పోరాడుతారు. కొన్ని పార్టీలు గేమ్స్‌ ఆడుతుంటాయి. నేను మాత్రం కేంద్రంతో పోరాడటానికే ఢిల్లీ వచ్చాను. ఒక మాట చెబితే దానికి క్రెడిబులిటీ ఉండాలి’’

సాక్షి, న్యూఢిల్లీ: విలేకరులు అడిగిన వాటిల్లో కనీసం ఒక్కటంటే ఒక్క ప్రశ్నకు కూడా తిన్నగా సమాధానం చెప్పకుండా, తన పంథా ఏమిటో వెల్లడించకుండా, సీరియస్‌గా సాగుతోన్న హోదా పోరాటాన్ని పలుచన చేసే ప్రయత్నం చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఢిల్లీ పర్యటన రెండో రోజైన బుధవారం ఆయన జాతీయ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. కాన్‌స్టిట్యూషనల్‌ క్లబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు వెంట ఫిరాయింపు ఎంపీలు కూడా ఉన్నారు.

ముందు సినిమా: ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ప్రారంభంలో.. ఏపీకి జరిగిన అన్యాయాలను వివరిస్తూ చంద్రబాబు నాయుడు కొన్ని వీడియోలను ప్రదర్శించారు. 2014 ఎన్నికల ప్రచారంలో, అమరావతి శంకుస్థాపన సమయంలో నరేంద్ర మోదీ మాటలు, వాటికి వెంకయ్య నాయుడి అనువాదం వీడియోలను చూపించారు. అటుపై తాను ఎన్డీఏ నుంచి బయటికి రావడానికి గల కారణాలను ఏకరువు పెట్టారు. ఈ క్రమంలో ప్రధాని మోదీపైనా, బీజేపీపైనా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చివరి అంకంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

చంద్రబాబు చెప్పిన మకతిక సమాధానాల్లో కొన్ని..
అవిశ్వాసాన్ని అడ్డుకుంటున్న అన్నాడీఎంకే ఎంపీలతో మాట్లాడతారా?
నేనేమంటానంటే.. తమిళనాడుతో మాకు మంచి సంబంధాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడకముందు తెలుగువారం మద్రాస్ స్టేట్‌లో ఉండేవాళ్లం. తెలుగు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తమిళులపై మాకున్న ప్రత్యేక ప్రేమను చాటుకున్నాం. తెలుగు గంగ ద్వారా నీళ్లు అందిస్తున్నాం. ఆ రాష్ట్రంతో ఇంకా మెరుగైన సంబంధాలను కొనసాగిస్తాం.

వైఎస్సార్‌సీపీ ఆమరణదీక్ష ప్రకటించింది, టీడీపీ తర్వాతి స్టెప్‌ ఏంటి?
సీ.. మేం ఇక్కడే ఉండి పోరాడాలి. రాజీనామాలు చేసి పోతే కుదరదు. నాకు మీ అందరి సపోర్ట్‌ కావాలి. కొందరు వేరేలా చేస్తారు. అది రాష్ట్రానికి మంచిదికాదు.

అంటే వేరే పార్టీలు చేస్తోన్న పోరాటంతో ప్రయోజనం లేదంటారా?
నేనేమంటానంటే.. పోరాటాలు ఎవరైనా చెయ్యొచ్చు. వాళ్లవాళ్ల పద్ధతుల్లో చేస్తున్నారు. ఉదాహరణకు బీజేపీకి ఏపీలో ఓట్లు లేవూ, సీట్లూ లేవు. ఏదో ఒక పార్టీ అండగా నిలబడితే తప్ప వాళ్లకు మనుగడలేదు. ఈ విషయం అందరికీ తెలుసు. ఏది చేసినా క్రెడిబులిటీ ఉండాలి. ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.

కావేరీ వివాదంపై సుప్రీం తీర్పును కూడా కేంద్రం లెక్కచేయట్లేదు. మీరేమంటారు?
నేను మళ్లీ అదే  చెబుతున్నా.. కావేరి వివాదమే కావచ్చు, మరొకటి కావచ్చు.. నదుల అనుసంధానం చేపడితే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఏపీలో మేము గోదావరి-కృష్ణలను అనుసంధానం చేశాం. గోదావరి నుంచి నీళ్లు సముద్రంలోకి పోకుండా ఆపగలుగుతున్నాం. అవసరమైతే ఏపీ నుంచి తమిళనాడుకు ఎక్కువ నీళ్లు ఇస్తాం. అయితే ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. అన్ని ఆప్షన్లు తీసుకున్న తర్వాతే వాళ్లు నిర్ణయాలు తీసుకోవాలి.

రాజకీయ దురుద్దేశంతోనే ఎన్డీఏ నుంచి బయటికొచ్చారని బీజేపీ అంటోందికదా?
బీజేపీ అలా అంటోందంటే 2014లో వాళ్లు తప్పుచేశామని ఒప్పుకుంటున్నట్లేనా? ఇది కరెక్ట్‌ అప్రోచ్‌ కాదు. నాలుగేళ్లు మాతో కలిసుండి, ఇప్పుడు సడన్‌గా ఏపీ ప్రభుత్వం అవినీతిమయం అయిపోయిందని బురద చల్లడం కరెక్ట్‌ కాదు.

మీరు, వైఎస్‌ జగన్‌ ఒకే కారణంతో పోరాడుతున్నారుకదా?
ఏపీలో వైఎస్సార్‌సీపీ, టీడీపీల మధ్య యుద్ధం జరుగుతున్నది. నేను కేంద్రానికి వ్యతిరేకంగా పిలుపునిచ్చాను. రాష్ట్రపెద్దగా రమ్మని పిలిస్తే వైఎస్సార్సీపీ వాళ్లు రాలేదు. నేను పిలిస్తే రాలేదంటే వాళ్లు నా పనిని నిర్వీర్యం చేస్తున్నట్టేలెక్క.

కేంద్రం ఏపీ కంటే తెలంగాణతోనే కాస్త పాజిటివ్‌గా ఉంటున్నట్లుంది?
మీరొక విషయం గుర్తుంచుకోవాలి. విభజన సమయంలో ఇరు రాష్ట్రాలు బాగుండాలని నేను దీక్ష చేశాను. అందుకే ఏపీలో అధికారంలోకి వచ్చాం. హైదరాబాద్‌ను కట్టింది నేనే. ఇప్పుడు అక్కడ ప్రజలు హాయిగా ఉంటున్నారు. చాలా మంది నన్ను అడుగుతారు.. ‘బాబుగారూ, మీరు హైదరాబాద్‌ను కట్టారు, ఇప్పుడు వేరే నగరాన్ని కడుతున్నారు ఎలా ఫీలవుతున్నారు?’ అని! నేనంటాను.. అమరావతే కాదు అవసరమైతే ఇకొక నగరాన్ని కూడా కట్టితీరతాను. ఆ శక్తి నాకుంది.

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆలోచనల నడుమ జయలలిత, కరుణానిధి లాంటి సీనియర్లను మిస్‌ అవుతున్నారా?
నేనేమంటానంటే.. నాయకత్వం అనేది కాల క్రమంలో ఎదుగుతుంది. ఇవాళ నేనున్నాను.. 40 ఏళ్ల రాజకీయ జీవితం నాది. దేశానికి నాలాంటి నాయకుల అవసరం ఉంది. జయలలిత, కరుణానిధిలు కూడా గొప్ప నాయకులే.

ఈశాన్య రాష్ట్రాలకు హోదాపై..
ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక పరిస్థితులున్నాయి. వాళ్లకు హోదా ఇవ్వాల్సిందే. వారితోపాటే ఏపీకి కూడా హోదా అడుగుతున్నాం. హోదా ఇవ్వలేదని ఊరుకోలేదు. నా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ 10.5శాతం వృద్ధిరేటుతో దూసుకుపోతున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement