చంద్రబాబు దీక్ష : ప్రభుత్వ ఖర్చు 20 కోట్లు

AP Government To Spend 20 Crores For One Day Deeksha - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఒక్క రోజు దీక్షకు ప్రభుత్వ ఖజానా నుంచి రూ. 4 కోట్లు చేయనున్నారు. శుక్రవారం విజయవాడ మున్సిపల్‌ స్టేడియంలో చంద్రబాబు దీక్షకు దిగనున్నారు. ఇందుకోసం స్టేడియంలో ఏసీలు, సౌండ్‌ సిస్టమ్స్‌, టెంట్లతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్‌, పలువురు పోలీసు అధికారులు ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు.

విజయవాడలో ఒక్క రోజు దీక్షకు నాలుగు కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీక్ష జరుగుతున్నంత సేపు భోజనాలు, మజ్జిగ, మంచినీళ్లు, కూల్‌డ్రింక్స్‌ పంపిణీ చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అంతేకాకుండా దీక్షకు బలవంతంగా విద్యార్థులను రప్పించేలా ఇప్పటికే కళాశాలలకూ ఆదేశాలు జారీ అయ్యాయి.

ప్రైవేటు కళాశాలల నుంచి విద్యార్థులను దీక్షాస్థలికి తరలించేందుకు 200 ఆర్టీసీ బస్సులు, 100 ప్రైవేటు బస్సులను ప్రభుత్వం సిద్ధం చేసింది. అన్ని జిల్లాల కేంద్రాల్లో ప్రభుత్వ నిధులతోనే ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు దీక్షలు సాగిస్తున్నారు. వీటితో పాటు మీడియాలో ప్రకటనలు, పబ్లిసిటీ కోసం చేసే మొత్తం ఖర్చులు కలిపి ఖజానా నుంచి ప్రభుత్వ దీక్షల కోసం 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది.

ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షాల చేపట్టిన బంద్‌ వల్ల ఆర్టీసీకి 12 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని వ్యాఖ్యానించిన చంద్రబాబు, తన దీక్షకు మాత్రం 20 కోట్ల రూపాయలు ఖర్చు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా డిమాండ్‌తోపాటు రాష్ట్ర విభజన బిల్లులోని హామీలని నెరవేర్చాల్సిందిగా కోరుతూ కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top