కర్నూలు అసెంబ్లీ టికెట్‌ నా కుమారుడికే : టీజీ

TDP MP TG venkatesh Comments About Kurnool Assembly Ticket - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో టీడీపీలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కర్నూలు సీటును కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఆశించినట్లు వార్తలు రాగా.. తాజాగా ఆ స్థానాన్ని తన కుమారుడికి కేటాయించాలని టీడీపీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్‌ కోరుతున్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడు భరత్‌ కర్నూలులో కచ్చితంగా గెలుస్తాడని, అతనికే అధిష్టానం టికెట్‌ కేటాయిస్తుందని చెప్పుకొచ్చారు. టీడీపీ గెలిచే వారికే సీట్లు ఇస్తుందని, గెలవడు అనుకుంటే తన కొడుకుకి సైతం టికెట్‌ ఇవ్వదని టీజీ వెంకటేష్‌ అన్నారు.

‘కేఈ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని కలిశారని, వారు కూడా కర్నూలు సీటును ఆశిస్తున్నట్లు వార్తల్లో చదివాను. కర్నూలు నుంచి గెలిచే అవకాశాలు భరత్‌కే ఎక్కువగా ఉన్నాయి. అతనికే సీటు వస్తుందని అనుకుంటున్నాను. మిగిలిన వారు ఎవరూ తమకు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పలేదు. అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకే నడచుకుంటా’  అని టీజీ అన్నారు. కేఈ కృష్ణమూర్తి, కోట్ల కుటుంబాల మధ్య కొన్ని తరాలగా అంతర్గత విభేదాలు ఉన్నాయని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. (ఎస్వీకి ఝలక్‌.. కోట్లకు టికెట్‌ ?)

ఏమీచ్చారో చెప్పి రాష్ట్రానికి రండి
ఆనాటి పరిస్థితుల దృష్ట్యా తొలుత బీజేపీతో చంద్రబాబు నాయుడు జత కట్టారని, కానీ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే విడిపోయారని టీజీ పేర్కొన్నారు. కేంద్రంతో ఎప్పుడు పోరాడాలో చంద్రబాబుకు తెలుసన్నారు. వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వకుండా వేరే రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నారని టీజీ వెంకటేష్‌ మండిపడ్డారు. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్రం చెప్పింది కానీ కొన్ని రాష్ట్రాలకు హోదాను అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రధానమంత్రి ఏపీకి వస్తానని అంటున్నారని... వచ్చే ముందు రాష్ట్రానికి ఎం ఇచ్చారో చెప్పి రావాలని ఆయన డిమండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top