లక్షల  కోట్లలో పచ్చనేతల అవినీతి

TDP Government Has Corruption Of  Lakhs OF Crores In Five Years - Sakshi

సాక్షి, అమరావతి : ఎవరైనా అసాధారణంగా ప్రవర్తిస్తుంటే ‘వీడు మామూలోడు కాదు’ అని అంటుంటాం. దీనిని కొంచెం అటుఇటు మార్చి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, టీడీపీ నేతలకు వర్తింపజేస్తే వీరు అచ్చంగా ‘మామూళోల్లే’ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. గత ఐదేళ్లుగా సీఎం చంద్రబాబు ఆయన బృందం ఆ స్థాయిలో కమీషన్లు (మామూళ్లు) మింగేసింది మరి. ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ పచ్చ దండు రాష్ట్రంలో అవినీతి సునామీ సృష్టించింది. రూ.6 లక్షల కోట్లు కొల్లగొట్టి కొత్త ‘చరిత్ర’ లిఖించింది.

నవ్యాంధ్రను అభివృద్ధి బాటలో నడుపుతానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అవినీతిలో నంబరవన్‌ స్థానంలో నిలిపారు. పేరొందిన వ్యక్తులు, ఎన్నో సంస్థలు దీనిని ప్రస్తావించాయి. బాబు బృందం చలవతో ఐదేళ్లలో అవినీతి ఆక్టోపస్‌లా రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను ఆక్రమించింది. ముడుపులివ్వనిదే ఏ పనీ జరగని పరిస్థితి కల్పించారు. గాలి తప్ప అన్ని సహజ వనరులనూ దోచుకున్నారు.

ఇసుక నుంచి ఇరిగేషన్‌ వరకు, బొగ్గు కొనుగోళ్ల నుంచి సోలార్‌ టెండర్ల వరకు, రాజధాని భూముల నుంచి గుడి భూముల వరకు అన్నింటా ముడుపులు, లంచాలు, ఆమ్యామ్యాలు, వాటాలే. దొడ్డి దోవలో మంత్రి పీఠమెక్కిన ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేశ్‌ స్వయంగా వీటిని పర్యవేక్షిస్తూ వచ్చారు. ఏపీకి ‘సన్‌ రైజ్‌’ రాష్ట్రమని పేరుపెట్టిన చంద్రబాబు దానిని చివరకు ‘సన్‌’ షైన్‌ రాష్ట్రంగా మార్చేశారు. 

రాజధాని పేరుతో రూ.1.66 లక్షల కోట్లు

ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామంటూ అమరావతి పేరుతో అంతర్జాతీయ స్థాయి రియల్‌ ఎస్టేట్‌ కుంభకోణానికి తెరతీశారు. రాజధాని నిర్ణయంతోనే రూ.లక్ష కోట్లు లాగేసిన చంద్రబాబు బృందం... స్విస్‌ చాలెంజ్‌ పేరుతో మరో రూ.66 వేల కోట్లు హాంఫట్‌ చేసింది. అధికార రహస్యాలను కాపాడతాననే ప్రమాణాన్ని తుంగలో తొక్కి రాజధాని భూముల్లో చంద్రబాబు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేశారు. ముఖ్య అనుచరులకు ముందుగానే రాజధాని ప్రాంతాన్ని తెలియజేశారు.

ఇదే అదనుగా అమరావతి ప్రాంతంలో చంద్రబాబు బినామీలు, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు రైతులను మోసం చేసి తక్కువ ధరకే భూములు కొన్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత 2014 డిసెంబర్‌ 28న రాజధానిని ప్రకటించారు.  రైతులంతా నష్టపోగా చంద్రబాబు కుమారుడు లోకేశ్, ఎంపీలు సుజనా చౌదరి, మురళీమోహన్, మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి, ఎమ్మెల్యే కొమ్మాలపాటి, పయ్యావుల తదితర బడా బాబుల బ్యాచ్‌ వేల కోట్లు లాభ పడింది.

అనంతరం స్విస్‌ చాలెంజ్‌ను తెరపైకి తెచ్చి తనకు నచ్చిన సింగపూర్‌ సంస్థలకు చంద్రబాబు వేల ఎకరాలు కేటాయించారు. పూలింగ్‌ పేరుతో రైతుల దగ్గర బలవంతంగా లాక్కున్న భూములను నచ్చిన సంస్థలకు ఇష్టం వచ్చిన రేట్లకు కమీషన్లు తీసుకుని కేటాయించారు. 

కాజేసిన భూముల విలువ రూ.1.75 లక్షల కోట్లు

రాజధానిలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా దొరికిన చోటల్లా టీడీపీ నేతలు భూములు కాజేశారు. వాటి విలువ రూ.1.75 లక్షల కోట్లకు పై మాటే. విశాఖ జిల్లాలోనే రూ.లక్ష కోట్ల విలువైన లక్ష ఎకరాల భూములను మింగేశారు. ఈ అన్యాయాన్ని అడ్డుకుని ఆదుకోవాల్సిన అధికారులు టీడీపీ నేతలతో చేతులు కలిపారు. ఇందుకోసం సీఎం, అధికారులు, పోలీసులు, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలంతా మాఫియాలా మారారు.

అవకాశం ఉన్నచోట రికార్డుల తారుమారు, సాధ్యం కాకపోతే కబ్జా, అదీ లేదంటే ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో భయపెట్టి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 62,736 ఎకరాలను పచ్చ నేతలు కాజేశారు. వీటి విలువ రూ.58,933 కోట్లపైనే. జిల్లాల్లోని శ్మశాన స్థలాలు, చివరకు దేవుడి భూములనూ చెరబట్టారు. చెరువులను సైతం మింగేసి, దళితుల అసైన్డ్‌ భూములపై పడ్డారు.

ఇవికాక రూ.978 కోట్ల సదావర్తి సత్రం, అయినవారికి అప్పనంగా అప్పగించిన, బినామీలు, గీతం వంటి బంధువులకు దోచిపెట్టిన రూ.వందల కోట్ల భూముల విలువ కలిపితే రూ.17 వేల కోట్లు దాటుతుంది. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం లంకకు అతి సమీపంలో కృష్ణా నది మధ్య సుమారు 150 ఎకరాలు ఆక్రమణకు గురైంది. తాళ్లాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, తుమ్మల పాలెం, గుంటుపల్లి మధ్య కృష్ణానదిలో కిలోమీటరు మేర కంచె ఏర్పాటు చేశారు. 

సాగు నీటిలో రూ.1.01 లక్షల కోట్లు

రాష్ట్రాన్ని సుభిక్షం చేయాల్సిన సాగునీటి ప్రాజెక్టులను చంద్రబాబు కమీషన్ల కోసం అక్షయ పాత్రలుగా మార్చుకున్నారు. పనులు చేయకుండానే కాంట్రాక్టర్లకు దోచిపెట్టేలా ప్రత్యేక జీవోలు తెచ్చారు. ఈపీసీ నిబంధనలను తుంగలో తొక్కి, కాంట్రాక్టర్లకు అదనంగా ఇవ్వాల్సిన పని లేకపోయినా కమీషన్లు మాట్లాడుకుని నచ్చినవాళ్లకు రేట్లు పెంచేసి డబ్బులిచ్చారు.

నాలుగున్నరేళ్లలో కమీషన్ల కోసం చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల మినహా మిగతా సాగునీటి ప్రాజెక్టుల పనులన్నీ గతంలోనే ప్రారంభమయ్యాయి. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా మిగిలిన ప్రాజెక్టుల పనులు రూ.17,368 కోట్లు ఖర్చు చేస్తే పూర్తవుతాయని చంద్రబాబు శ్వేతపత్రంలో చెప్పారు. నాలుగున్నరేళ్లలో రూ.62,132 కోట్లు ఖర్చు చేసినా ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాకపోవడం గమనార్హం.

కమీషన్ల కోసం పోలవరం నిర్మాణ బాధ్యత తీసుకుని అంచనా వ్యయం రూ.16 వేల కోట్ల నుంచి రూ.58 వేల కోట్లకు పెంచేశారు. ఐదేళ్లలో 25 ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని రూ.39,935.34 కోట్ల నుంచి రూ.96,785.72కోట్లకు పెంచారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.65,345.45 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో నీరు– చెట్టు కింద రూ.11,797.15 కోట్లు, అటవీ శాఖ ద్వారా ఖర్చు చేసిన రూ.185.07 కోట్లు పోగా, మిగతా రూ.53,453.23 కోట్లను ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు బిల్లులుగా చెల్లించారు.

జీవో 22, జీవో 63ల ప్రభావం వల్ల చెల్లించిన బిల్లులే రూ.40 వేల కోట్ల పైగా ఉంటాయని అంచనా. ఇందులో రూ.25 వేల కోట్లను మామూళ్ల రూపంలో చంద్రబాబు వసూలు చేశారని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును కాగ్‌ తూర్పారబట్టింది.

ఇసుక నుంచి రూ.12,500 కోట్లు పిండేశారు

రాష్ట్రంలోని 459 అధికారిక, అనధికారిక ఇసుక రేవులను టీడీపీ నాయకులు దోపిడీ కేంద్రాలుగా  మార్చుకున్నారు. ఇసుక ఉచితం పేరుతో రూ.12,500 కోట్లను టీడీపీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కాజేశారు. ఇందులో సింహభాగం వాటాను మామూళ్ల రూపంలో సీఎం చంద్రబాబుకు ముట్టజెప్పారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని తాము జారీ చేసిన మార్గదర్శకాలను తుంగలో తొక్కడంతో జాతీయ హరిత న్యాయస్థానం (ఎన్‌జీటీ) రూ.వంద కోట్ల జరిమానా విధించింది.

2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి రెండేళ్లపాటు ఎడాపెడా ఇసుక వ్యాపారం సాగించడం ద్వారా రూ.2,480 కోట్లు దోచుకున్న అధికార టీడీపీ నాయకులు మలి రెండేళ్లలో ఉచిత ఇసుక విధానంతో పూర్తిగా రేవులను సొంత జాగీర్లుగా  మార్చుకున్నారు. నచ్చిన రేటుకు అమ్ముకోవడం ద్వారా ఏకంగా రూ.5,470 కోట్లు కొట్టేశారు.  చంద్రబాబు ఆధ్వర్యంలో చినబాబు లోకేశ్‌ కనుసన్నల్లో తమ్ముళ్లు సాగిస్తున్న ఇసుక దోపిడీ  ఓ మాఫియాలా సాగింది. 

రూ.35 వేల కోట్లఅగ్రిగోల్డ్‌ కుంభకోణం
ఖాతాదారుల కష్టార్జితాన్ని స్వాహా చేసిన అగ్రిగోల్డ్‌ కుంభకోణం విలువ రూ.35 వేల కోట్లు. ఇంత పెద్ద కుంభకోణం జరిగినా కోర్టులు జోక్యం చేసుకునే వరకు చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి అరెస్టులూ చేయలేదు. హైకోర్టు మందలించడంతో గత్యంతరం లేక  2016 ఫిబ్రవరిలో కంపెనీ చైర్మన్, ఎండీలను అరెస్టు చేసింది. ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణతోనే, అగ్రిగోల్డ్‌ యాజమాన్యం తన ముఖ్యమైన ఆస్తులను విక్రయించగలిగింది. లక్షలాది డిపాజిటర్లను, ఏజెంట్లను నట్టేట ముంచింది.  చిన్నచిన్న నేరాలకే అరెస్టులు చేస్తున్న ప్రభుత్వం ఇంత పెద్ద కుంభకోణంలో అగ్రిగోల్డ్‌ యాజమాన్యాన్ని రక్షించే యత్నం చేస్తోంది. 

నీరు–చెట్టులో రూ.62,246 కోట్లు
చిన్న నీటివనరుల పరిరక్షణ, భూగర్భ జలాల సంరక్షణ పేరుతో 2015–16లో ప్రభుత్వం నీరు–చెట్టు పథకాన్ని ప్రారంభించింది. 2015–16 నుంచి రూ.16,291.35 కోట్లను దీనికింద ఖర్చు చేశారు. ఈ పనులన్నీ టీడీపీ నేతలకే ఇచ్చారు. వారు మాత్రం పైసా పనిచేయకుండా 2015–16కు ముందు చేసిన పనులనే తాజాగా చూపి బిల్లులు చేసుకున్నారు.

చెరువుల్లో పూడిక తీయగా వచ్చిన 91.91 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టిని క్యూబిక్‌ మీటర్‌ సగటున రూ.500 చొప్పున విక్రయించి రూ.45,955 కోట్లు దోచుకున్నారు. నీరు–చెట్టు కింద రూ.16,291.35 కోట్లు ఖర్చు చేసినా, ఆయకట్టు 12.36 లక్షల ఎకరాలు తగ్గడం గమనార్హం.  2014 మార్చి నాటికి రాష్ట్రంలో భూగర్భ జలమట్టం సగటున 9.21 మీటర్లు ఉండగా ఇప్పుడు 12.19 మీటర్లకు పడిపోవడం గమనార్హం.

నామినేషన్‌పై రూ.12 వేల కోట్లు  ధారపోత
ప్రకృతి వైపరీత్యాల సమయంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన పనులను మాత్రమే నామినేషన్‌పై కాంట్రాక్టర్లకు అప్పగించాలి. ఇదీ రూ.లక్షలోపువి అయితే ఈఈ, రూ.5 లక్షల్లోపువి అయితే ఎస్‌ఈ స్థాయి అధికారి ఇవ్వాలి. ఈ నిబంధనను ప్రభుత్వం తుంగలో తొక్కింది. కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు పనులను నామినేషన్‌పై కట్టబెట్టారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో పోలవరం నుంచి నీరు–ప్రగతి వరకు నామినేషన్‌దే డామినేషన్‌.

పరిపాలన అనుమతి లేకుండానే రూ.వేలాది కోట్ల పనులకు బిల్లులు చెల్లించేందుకు ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తే కేబినెట్‌ తీర్మానంతో ఆమోదించుకున్నారు. ఒక్క ఇరిగేషన్‌ విభాగంలోనే మూడేళ్లలో రూ.9,125 కోట్ల విలువైన పనులను నామినేషన్‌పై కట్టబెట్టి రూ.వెయ్యి కోట్లపైగా కొట్టేశారు. మిగిలిన విభాగాల్లోనూ ఇదే తరహాలో రూ.3 వేల కోట్ల మేర పనులు కట్టబెట్టి కమీషన్లు మింగేశారు.

రూ. 8,300 కోట్ల మేర మద్యం కిక్కు
మద్యాన్ని గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువకు అమ్ముకునేందుకు, బెల్టు షాపులు నిర్వహించుకునేలా సిండికేట్లు ప్రతి నెల 13 జిల్లాల నుంచి రూ.కోట్లు ముడుపులు అందిస్తున్నారు. నాలుగున్నరేళ్లలో ఈ ముడుపుల మొత్తం రూ.8,391.6 కోట్లుగా తేలింది. ఒక్కో మద్యం షాపు నుంచి ఎమ్మార్పీ ఉల్లంఘనలకు రూ.లక్షన్నర, బెల్టు షాపులకు రూ.లక్షన్నర వంతున (అంటే ఒక్కో షాపునకు రూ.3 లక్షలు) వసూలు చేసి ప్రభుత్వ పెద్దలకు నెలనెలా దోచి పెడుతున్నారు.

రాష్ట్రంలోని మొత్తం 4,380 షాపులకు నెలకు రూ.131.40 కోట్లు  ముడుపులు అందుతున్నాయి. ఇలా రూ.7,095.6 కోట్ల మేర దండుకున్నారు. 800 బార్లలో విడి విక్రయాలు, బ్రాండ్‌ మిక్సింగ్‌ తదితరాలకు నెలకు రూ.3 లక్షల వంతున రూ.24 కోట్లు అందుతున్నాయి. నాలుగున్నరేళ్లలో రూ.1,296 కోట్లను సర్కారు పెద్దలు దిగమింగారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top