‘దేశం’ ఖల్లాస్‌!

TDP Big Loss in Telangana Elections - Sakshi

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకంటే దారుణ ఫలితం

టీడీపీ అధినేత చంద్రబాబుకు భంగపాటు

అసెంబ్లీ ఎన్నికల్లో తిరస్కరించిన ‘గ్రేటర్‌’ ప్రజలు  

బలం సంగతి అటుంచి ఉనికికే ప్రమాదం

సాక్షి, సిటీబ్యూరో: ఏ వేదిక ఎక్కినా రాజకీయల్లో తానే సీనియర్‌ అంటాడు. మైక్‌ దొరికితే చాలు హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టానని.. సైబరాబాద్‌ను తానే నిర్మించానని గొప్పలకు చెప్పుకుంటాడు.. అలాంటి గొప్ప నాయకుడిని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌ ప్రజలు తిరస్కరించారు. హైదరాబాద్‌ అభివృద్ధి అంతా తన హయాంలోనే జరిగిందని ఎంతగా ప్రచారం చేసుకున్నా టీడీపీ అధినేతను చంద్రబాబునాయుడును తరిమి కొట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2016 ఫిబ్రవరిలో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని 94 డివిజన్లలో టీడీపీ పోటీచేసింది. అప్పుడు ఒక్క కార్పొరేర్‌ను మాత్రం గెలిపించుకుంది. 51 డివిజన్లలో రెండో స్థానంలోను, 24 డివిజన్లలో మూడో స్థానంలో, 14 డివిజన్లలో నాలుగోస్థానంలో నిలిచి నగరంలో గణనీయమైన ఓట్లతో ఉనికిని చాటుకుంది. అంతేకాదు 150 డివిజన్లలో పోలైన 33,49,379 ఓట్లలో 94 డివిజన్ల నుంచే టీడీపీ 13 శాతం ఓట్లు పొందగలిగింది. ఆ ధీమాతోనే చంద్రబాబు ఈసారి ఉప్పల్, కూకట్‌పల్లి, సనత్‌నగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మలక్‌పేట నియోజకవర్గాలతో పాటు శివార్లలోని ఇబ్రహీంపట్నంలోనూ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపారు. అయితే, ప్రజలు మాత్రం తిరస్కరించారు. ఆ పార్టీ రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నంలో రెండో స్థానం కూడా సాధించలేకపోయింది. 

కొత్త రాష్ట్రమైనా అప్పుడే నయం..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌ పరిధిలోని 9 నియోజకవర్గాల్లో విజయఢంకా సాధించిన టీడీపీ.. నాయకులు పార్టీ మారినా కార్యకర్తలు బలంగా ఉన్నారని, తిరిగి అదే పంథా కొనసాగిస్తామని డబ్బా కొట్టుకున్నప్పటికీ గెలవలేకపోయారు. 2014లో టీడీపీ అభ్యర్థులుగా జూబ్లీహిల్స్‌ నుంచి మాగంటి గోపీనాథ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌(సనత్‌నగర్‌), జి.సాయన్న (కంటోన్మెంట్‌), అరెకపూడి గాంధీ (శేరిలింగంపల్లి), కేపీ వివేకానంద్‌ (కుత్బుల్లాపూర్‌), ప్రకాశ్‌గౌడ్‌ (రాజేంద్రనగర్‌), తీగల కృష్ణారెడ్డి (మహేశ్వరం), ఆర్‌.కృష్ణయ్య(ఎల్‌బీనగర్‌)తో పాటు ఇబ్రహీంపట్నం నుంచి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గెలిచారు. వీరిలో ఆర్‌. కృష్ణయ్య టీడీపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. మిగతా వారంతా టీఆర్‌ఎస్‌లో చేరి, ప్రస్తుతం అవే నియోజకవర్గాల నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా పోటీచేశారు. వీరిలో, మహేశ్వరం నుంచి తీగల కృష్ణారెడ్డి తప్ప మిగతా వారంతా విజయం సాధించారు. హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని సనత్‌నగర్‌ నుంచి పోటీచేసిన టీడీపీ అభ్యర్థులు కూన వెంకటేశ్‌గౌడ్, మలక్‌పేట నుంచి రంగంలో దిగిన ముజఫర్‌ అలీలు ఓటమి పాలయ్యారు. 

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ గ్రాఫ్‌ ఇదీ..
పోటీ చేసిన స్థానాలు: 94 ఠీ గెలిచిన సీట్లు : 1(కేపీహెచ్‌బీకాలనీ) ఠీ పోలైన మొత్తం ఓట్లు: 33,49,379
టీడీపీ సాధించినవి: 4,39,047
పోలైన ఓట్ల శాతం: 13.11  

పాపం సుహాసిని..  
ఎన్నికల తరుణంలో హటాత్తుగా స్వర్గీయ నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినీని ఎన్నికల గోదాలో దింపి వర్గం, ప్రాంతం వారీగా గంపగుత్తగా ఓట్లు కొట్టేయవచ్చుననుకున్న చంద్రబాబు పాచిక పారలేదు. రాజకీయాల గురించి తెలియని సుహాసిని.. చంద్రబాబు క్రీడలో ఓటమి పాలయ్యారు. ఆమె సోదరులైన కళ్యాణ్‌రామ్, జూనియర్‌ ఎన్టీఆర్‌ కనీసం ప్రచారం కూడా చేయలేదు. బావాబామ్మర్దులు, వియ్యంకులు కూడా అయిన చంద్రబాబు, బాలకృష్ణలు రోడ్‌షోలు చేసినా ప్రజలు వినోదంగా భావించారే తప్ప.. రాజకీయంగా చూడలేదు. ఫలితంగా పోలింగ్‌పై వారి ప్రభావం పనిచేయలేదు. ఏపీ నుంచి పెద్దపెద్ద లీడర్లను రప్పించినా, విచ్చలవిడిగా డబ్బులు కుమ్మరించినా అవేవీ సుహాసినీని గట్టెక్కిచలేకపోయాయి. హైదరాబాద్‌లో తన బలం చూపాలనుకున్న చంద్రబాబు పార్టీకి ప్రస్తుతం నగరంలో ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. 

బెడిసికొట్టిన ‘కూటమి’
మహాకూటమి పేరిట పొత్తు పాచిక వేసినా ప్రజలు తిరస్కరించారు. కష్టకాలంలోను పార్టీని వీడకుండా ఉండి, నమ్ముకున్నవారికి కనీసం టికెట్లు కూడా ఇప్పించుకోలేకపోయారన్న అపప్రద మూటగట్టుకున్నారు. ఎల్‌బీనగర్‌ నుంచి టికెట్‌ ఆశించి ఎంతోకాలంగా అక్కడ ప్రచారం చేసుకున్న సామ రంగారెడ్డికి ఇవ్వకుండా ఆయన్ను ఇబ్రహీంపట్నం పంపించి ఎల్‌బీనగర్‌ను కాంగ్రెస్‌కు కేటాయించారు. పార్టీ జిల్లా శాఖ కార్యాలయం కూడా ఉన్న ముషీరాబాద్‌ నియోజకవర్గ  టికెట్‌ను పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెన్‌ శ్రీనివాస్‌కు కేటాయిస్తారనుకున్నప్పటికీ దాన్నీ కాంగ్రెస్‌కు ఇచ్చారు. కూటమిలో భాగంగా అంబర్‌పేటను టీజేఎస్‌కు అప్పగించారు. టికెట్లు ఇచ్చిన చోట కూటమిలోని ఇతర పక్షాలు సహకరించకపోవడం, మరికొన్ని సంస్థాగత కారణాలతో ఏ ఒక్కచోటా కూడా టీడీపీ తన ఉనికిని చాటలేకపోయింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top