పౌరుడు విజిలెస్తే...! 

The 'Sea-Whistle' Mobile App Launched By The Central Election Commission Is a Good Solution For Many Issues - Sakshi

సాక్షి, అమరావతి : ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై సాధారణ పౌరుల నిఘాను ప్రోత్సహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన ‘సీ–విజిల్‌’ మొబైల్‌ యాప్‌ పలు సమస్యలకు చక్కటి పరిష్కారం చూపిస్తోంది. సత్వర ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి ఓ వేదికగా మారింది. 

విజిలెంట్‌ సిటిజన్‌ 
సీ–విజిల్‌ అంటే విజిలెంట్‌ సిటిజన్‌ (అప్రమత్తత గల పౌరుడు) అని అర్థం. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి డబ్బు, మద్యం, ఇతర కానుకల పంపిణీ వంటి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలు చోటుచేసుకున్నప్పుడు ఘటనా స్థలం నుంచి లొకేషన్‌తో సహా ఫొటోలు, వీడియోలను ప్రత్యక్ష ప్రసార విధానంలో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించి ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్‌ పౌరులకు ఉపయోగపడుతోంది.

ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేయకుండా క్షణాల్లో ఫిర్యాదు చేయడానికి అవకాశం కలుగుతోంది. పౌరుల నుంచి వచ్చే ఫిర్యాదులు స్థానిక నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి నేతృత్వంలోని జిల్లా కంట్రోల్‌ రూమ్‌కు చేరతాయి. అక్కడి నుంచి క్షేత్ర స్థాయిలో పనిచేసే ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌/స్టాటిక్‌ బృందాలు నిర్దేశించిన సమయంలోగా ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు ప్రారంభిస్తారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు 
ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు.  

ఆండ్రాయిడ్‌ ఫోన్లలో.. 
కెమెరా, ఇంటర్నెట్, జీపీఎస్‌ సదుపాయం గల ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని వాడవచ్చు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన జరుగుతుంటే ఫోన్‌ ద్వారా ఫొటోలు తీయడం లేదా 2 నిమిషాల నిడివి గల వీడియోలు రికార్డు చేసి.. ఘటన గురించి క్లుప్తంగా రాసి ఫిర్యాదును పంపించాల్సి ఉంటుంది.

ఫోన్‌కు ఉండే జీపీఎస్‌ సదుపాయం ద్వారా ఆటోమేటిక్‌గా ఘటన జరిగిన ప్రాంతాన్ని (లొకేషన్‌) యాప్‌ సేకరించి ఫిర్యాదుతోపాటు జిల్లా స్థాయి కంట్రోల్‌ రూమ్‌కు పంపుతుంది. లొకేషన్‌ ఆధారంగా తనిఖీ బృందాలు నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకోవడానికి వీలు కలగనుంది. సీ–విజిల్‌ యాప్‌ను సులభంగా ఈ కింది మూడు స్టెప్పుల్లో వాడవచ్చు.

స్టెప్‌–1 
సీ–విజిల్‌ యాప్‌ ద్వారా పంపిన ఫిర్యాదుకు సంబంధించిన విశిష్ట గుర్తింపు సంఖ్య ఫిర్యాదుదారుల ఫోన్‌కు చేరుతుంది. ఫిర్యాదు స్థితిగతులను తెలుసుకోవడానికి ఈ గుర్తింపు సంఖ్య దోహదపడనుంది. పౌరులు ఎన్ని ఫిర్యాదులైనా చేయవచ్చు. ప్రతి ఫిర్యాదుకు ఒక విశిష్ట గర్తింపు సంఖ్య లభిస్తుంది. తమ గుర్తింపును ఫిర్యాదుదారుడు వెల్లడించడానికి ఇష్టపడనప్పుడు అజ్ఞాత వ్యక్తిగా సైతం ఫిర్యాదు చేయడానికి ఈ యాప్‌ ఉపయోగపడుతుంది.

ఇందుకు అజ్ఞాత యూజర్‌గా రిజిస్ట్రర్‌ చేసుకుని ఫిర్యాదును పంపాలి. ఇలాంటి ఫిర్యాదు చేసినప్పుడు ఫిర్యాదుదారుల మొబైల్‌ నంబర్, ఇతర వ్యక్తిగత వివరాలను యాప్‌ కంట్రోల్‌ రూమ్‌కు పంపదు. ఇలాంటి అజ్ఞాత ఫిర్యాదులు చేస్తే ఫిర్యాదు పురోగతిని తెలుసుకోవడానికి అవకాశం ఉండదు.   అయితే, సంబంధిత రిటర్నింగ్‌ అధికారిని సంప్రదించి ఫిర్యాదు పురోగతిని తెలుసుకోవచ్చు.  

స్టెప్‌–2 
పౌరులు ఫిర్యాదు అప్‌లోడ్‌ చేయగానే డిస్ట్రిక్ట్‌ కంట్రోల్‌ రూంలో బీప్‌ శబ్దం వచ్చి తెరపై ప్రత్యక్షం అవుతుంది. కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఫిర్యాదును క్షేత్రస్థాయి బృందానికి పంపుతారు. ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్, స్టాటిక్, ఇతర బృందాలు ఇందులో ఉంటాయి. ప్రతి క్షేత్రస్థాయి బృందం వద్ద జీఐఎస్‌తో పనిచేసే మొబైల్‌ ఫోన్, అందులో ‘సీ–విజిల్‌ ఇన్వెస్టిగేటర్‌’యాప్‌ ఉంటుంది. జీఐఎస్‌ నేవిగేషన్‌ టెక్నాలజీ ఆధారంగా క్షేత్రస్థాయి బృందాలు నేరుగా ఘటనా స్థలానికి వెళ్లి చర్యలు తీసుకోవడానికి ఈ యాప్‌ సహకరిస్తుంది. 
 

స్టెప్‌–3 
క్షేత్రస్థాయి బృందం ఫిర్యాదుపై విచారణ జరిపి ఆన్‌లైన్‌ ద్వారా ఫీల్డ్‌ రిపోర్ట్‌ను సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి నేరుగా పంపి, ఫిర్యాదును పరిష్కరించడానికి  ‘సీ–విజిల్‌ ఇన్వెస్టిగేటర్‌’ యాప్‌ ఉపయోగపడుతుంది. ఒకవేళ ఉల్లంఘన జరగడం నిజమేనని నిర్ధారిస్తే, తదుపరి చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన గ్రీవెన్స్‌ పోర్టల్‌కు సమాచారం వెళ్తుంది. ఫిర్యాదుదారుడికి 100 నిమిషాల్లోపు తీసుకున్న చర్యల సమాచారం అందనుంది.  

యాప్‌ను దుర్వినియోగం చేయలేరు 
సీ–విజిల్‌ యాప్‌ను దుర్వినియోగం చేయడానికి వీలు లేదు. ముందే రికార్డు చేసిన/పాత ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్‌ చేయడానికి ఈ యాప్‌ సహకరించదు. వినియోగదారుల ఫోన్‌ గ్యాలరీలో ఫిర్యాదుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను నిక్షిప్తం చేయడానికి సైతం అనుమతించదు.  ఒక యూజర్‌ ఒక ఫిర్యాదు పంపిన తర్వాత మరో ఫిర్యాదు చేసేందుకు 5 నిమిషాలు ఆగాల్సిందే.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top