కరోనా మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం ఇవ్వాలి

Rs 10 Lakh Compensation Should Be Given To Families Of Corona Victims Says Uttam Kumar - Sakshi

ఈ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాల్సిందే

ఈ విషయంలో సీఎంది అనాలోచితవైఖరి: ‘స్పీకప్‌ తెలంగాణ’లో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ మొదటి నుంచి అనాలోచితంగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శిం చారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ‘స్పీకప్‌ తెలంగాణ’కార్యక్రమంలో భాగంగా ఆయన ‘ఫేస్‌బుక్‌’ద్వారా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవడంలో శాస్త్రీయత పాటించడం లేదని, ఐసీఎంఆర్‌ నిబంధనలూ అనుసరించడం లేదని ఆరోపించారు. తక్కువ టెస్టులు చేసి, రాష్ట్రంలో తక్కువ కేసులున్నాయని చెప్పుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదన్నారు.

గత నాలుగు నెలలుగా ఈ మహమ్మారి పట్టి పీడిస్తున్నా రాష్ట్రంలో ఇప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించలేదని మండిపడ్డారు. ఈ వ్యాధి సోకిన వారికి చికిత్స చేసేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించలేకపోయారని, చికిత్స పేరిట దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేటు ఆసుపత్రులను నియంత్రించలేక పోయారని ఎద్దేవా చేశారు. కరోనా సోకిన వారికి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఈ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చడం ద్వారా పేదలకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని కోరారు. వైరస్‌ సోకి చనిపోయిన పేద కుటుంబాలను ఆదుకునేందుకు రూ.10 లక్షల పరిహారం అందించాలని, ఈ వైరస్‌పై ముందుండి పోరాడుతున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఆశ వర్కర్లు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, జర్నలిస్టులకు ప్రాణహాని జరిగితే రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

‘స్పీకప్‌’తెలంగాణ విజయవంతం
కాగా, ఏఐసీసీ పిలుపుమేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ‘స్పీకప్‌ తెలంగాణ’ కార్యక్రమం విజయవంతం అయిందని, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తలు ఆన్‌లైన్‌ ద్వారా కరోనా వైరస్‌ విషయంపై సామాజిక మాధ్యమాల్లో గళమెత్తారని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి. ఆన్‌లైన్‌ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్‌ శ్రేణులు పాల్గొన్నాయని తెలిపాయి. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, మండల నేతలు, పార్టీ అధికార ప్రతినిధులు, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులు, పార్టీ కోర్‌ కమిటీ సభ్యులు, గ్రామస్థాయి నేతలు, ప్రజాప్రతినిధులు పాలుపంచుకున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top