ప్రజల తరఫున కొట్లాడేవాడే నాయకుడు

Revanth Reddy Road Show in Balamrai Cantonment - Sakshi

కంటోన్మెంట్‌ ప్రచారంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి

కంటోన్మెంట్‌లో రోడ్ల మూసివేత కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఎన్నోసమస్యలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌ ఆ మాటవిస్మరించాడు. అదే దత్తతను కేటీఆర్‌ మరోసారి ఈ ఎన్నికల సందర్భంగా వల్లెవేస్తున్నాడు.    – బాలంరాయి రోడ్‌షోలో రేవంత్‌రెడ్డి  

రసూల్‌పురా: మల్కాజిగిరి లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎ.రేవంత్‌రెడ్డి బుధవారం రాత్రి కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేశారు. ప్రధానంగా రిసాలబజార్, బొల్లారం, తిరుమలగిరి, కార్ఖానా, మడ్‌ఫోర్ట్, బాలంరాయి, రసూల్‌పురా, తాడ్‌బంద్, బోయిన్‌పల్లి వరకు ఆయన రోడ్‌షో నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులతో కలసి చేపట్టిన రేవంత్‌ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రోడ్‌షోలో భాగంగా ఆయన వివిధ ప్రాంతాల్లో ప్రసంగించారు. కంటోన్మెంట్‌లో రోడ్ల మూసివేత కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, రిజిస్ట్రేషన్‌ చార్జీలు అధికంగా ఉన్నాయని, నీటి సమస్య అధికంగా ఉందని, చాలా స్థలాలకు పట్టాలు లేవన్నారు.

ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌ ఆ మాటను విస్మరించాడని విమర్శించారు. అదే దత్తతను మరోసారి కేటీఆర్‌ ఈ ఎన్నికల సందర్భంగా వల్లెవేస్తున్నాడని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి తనను గెలిపిస్తే కంటోన్మెంట్‌లోని సమస్యలను పరిష్కరిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజల తరఫున కొట్లాడే తనకు ఓటు వేయాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. తాను స్థానికుడినని, కంటోన్మెంట్‌ సమస్యలపై అవగాహన ఉందని చెప్పుకుంటున్న మర్రి రాజశేఖర్‌రెడ్డిని ఎప్పుడైనా చూశారా.. ఆయన ఏనాడైనా ప్రజల మధ్య ఉన్నాడా.. ఎమైనా సమస్యలు పరిష్కరించాడా అని ప్రజలను ప్రశ్నించారు. అలాంటి వ్యక్తికి ఓటు వేసి గెలిపిస్తారా అని రేవంత్‌ అడిగారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్‌ నాయకులు రోహిణ్‌రెడ్డి, డి.బి. దేవేందర్, అయూబ్‌ఖాన్, సంజీవరెడ్డి, బాల్‌రాజ్‌ ఇతర నాయకులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top