ఏపీలో బద్ధశత్రువులు కలిశారు.. తెలంగాణలో వద్దా?: రేవంత్‌ | Sakshi
Sakshi News home page

ఏపీలో బద్ధశత్రువులు కలిశారు.. తెలంగాణలో వద్దా?: రేవంత్‌

Published Mon, Oct 30 2017 3:51 PM

Revanth reddy official announcement of joining congress

సాక్షి, హైదరాబాద్‌ : తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నట్లు రేవంత్‌రెడ్డి అధికారికంగా ప్రకటించారు. కేసీఆర్‌ కుటుంబం సాగిస్తోన్న దోపిడీకి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతుందనుకున్నవేళ.. అక్కడి రాజకీయ బద్ధశత్రువులు కలిసిపోయారని, అదే మాదిరిగా తెలంగాణలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరగాలని అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఆత్మీయులతో మాట-ముచ్చట’ సభలో ఆయన మాట్లాడారు.

‘‘రాష్ట్ర విభజనకు ముందు ఏపీలో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 48 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీకి కేవలం 18 శాతం మాత్రమే పడ్డాయి. అయితే విభజన సమయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్న భావన అందరిలో కలిగింది. నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని చాలా మంది నేతలు తెలుగుదేశంలో చేరి ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. టీజీ వెంకటేశ్‌, గంటా శ్రీనివాసరావులు, జేసీ దివాకర్‌రెడ్డి లాంటివాళ్లు అలా వచ్చినవారే. టీడీపీకి వారు శత్రువులే అయినా, అందరితో మాట్లాడి చంద్రబాబు ఒప్పించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనూ అలాంటి పునరేకీకరణ జరగాలి. కేసీఆర్‌ కుటుంబం సాగిస్తోన్న దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాల్సింది. అందుకే కాంగ్రెస్‌-టీడీపీ కలిసి పనిచేయాలని నేను కోరాను’’ అని రేవంత్‌ చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్‌ జిందాబాద్‌ : రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించిన రేవంత్‌రెడ్డి.. టీడీపీ కార్యకర్తలంతా తనకు మద్దతుగా నిలవాలని కోరారు. రాష్ట్రంలో ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, జాతీయ స్థాయిలో రాహుల్‌, సోనియా గాంధీల నాయకత్వంలో పనిచేద్దామని అభిమానులకు పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజం.. కేసీఆర్‌ కాళ్ల కింద పడి ఉండటంకాదు.. నిటారుగా నిలబడిందని వ్యాఖ్యానించారు.

వైఎస్సార్‌కు ఆత్మీయుడిని : కాంగ్రెస్‌ పార్టీ నాయకులు జైపాల్‌ రెడ్డి, జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు తనకు బంధువులేనని, మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ఆయన కుటుంబం ఎంతో ఆత్మీయంగా ఉండేదని రేవంత్‌ గుర్తుచేసుకున్నారు. 2006 నాటికి ఎంత అనుబంధం ఉన్నప్పటికీ అప్పట్లో తాను కాంగ్రెస్‌లోకి చేరలేదని, ప్రతిపక్ష టీడీపీలో చేరి ప్రజల కోసం పనిచేశానన్నారు. ఇప్పటి సందర్భంలో గురువులాంటి చంద్రబాబును వదిలిపెట్టి, తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌లోనే చేరుతున్నానన్నారు.

14 ఏళ్లుగా ఏం చెప్పావ్‌?.. 40 నెలలుగా ఏం చేస్తున్నావ్‌? : ఆత్మీయ ముచ్చటలో రేవంత్‌ రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్రవిమర్శలు చేశారు. వేల మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని, హామీలు నమ్మి జనం టీఆర్‌ఎస్‌కు అధికారం కట్టబెట్టారని గుర్తుచేశారు. అయితే ఇచ్చిన ఒక్క హామీని కూడా కేసీఆర్‌ నెరవేర్చడం లేదని, కేవలం కుటుంబ ప్రయోజనాల కోసమే తాపత్రయపడుతున్నారని ఆరోపించారు. ‘‘ఏదైనా అడిగితే, మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చేస్తున్నాం’ అని టీఆర్‌ఎస్‌ నాయకులు అంటారు.. నేను అగిడేది అదే.. 14 ఏళ్ల ఉద్యమకాలంలో ఏమేం చెప్పారు.. అధికారంలోకి వచ్చిన 40 నెలల్లో ఏమేం చేశారు? అని! సామాజిక తెలంగాణ జాడ లేకుండా పోయింది. ప్రతిపక్షాల గొంతునొక్కడం కేసీఆర్‌కు అలవాటైంది. ఇకపై ఆయన ఆటలు సాగనివ్వబోము’’ అని రేవంత్‌ వ్యాఖ్యానించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement