హోం మంత్రి కటారియాకు ఈసారి కష్టాలే!

Rajasthan elections, No Cakewalk for Kataria - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని ప్రతిష్టాకరమైన ఉధంపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు విజయం సాధించిన హోం మంత్రి, సీనియర్‌ బీజేపీ నాయకుడు గులాబ్‌ చంద్‌ కటారియాకి మొదటి సారి ఓటమి భయం పట్టుకుంది. అదీ సొంత పార్టీ నాయకుడే కాకుండా ఇంతకాలం తన సహచరుడిగా ఉన్న దల్పత్‌ సురాణా నుంచే. పైగా ఆయన కూడా కటారియాలాగా జైనుడే కావడం గమనార్హం. 74 ఏళ్లు వచ్చినప్పటికీ యువతరానికి అవకాశం ఇవ్వకుండా ఆరోసారి కూడా కటారియా రంగంలోకి దిగడంతో, తాను తిరుగుబాటు అభ్యర్థిగా జనతాసేన టిక్కెట్‌పై నామినేషన్‌ దాఖలు చేయాల్సి వచ్చిందని సురాణా తెలిపారు. మొదటినుంచి ఆరెస్సెస్‌ అండ కలిగిన కటారియాకు బీజేపీ అధిష్టానం టిక్కెట్‌ ఇవ్వాల్సి వచ్చింది.

‘నా లక్ష్యం ఒక్కటే కటారియాను ఓడించడం. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గెలిచినా ఫర్వాలేదు’ అని సురాణా వ్యాఖ్యానించారు. కటారియా తన తల బిరుసుతనంతో పార్టీలో ఎవరినీ ఎదగకుండా చేశారని ఆయన విమర్శించారు. తాను బరిలోకి దిగకపోతే కటారియాకు ప్రత్యర్థిగా నిలబడే దమ్ము ఎవరికీ లేదని, అందుకనే మొన్నటివరకు ఆయన అనుచరిడిగా కొనసాగిన తాను రంగంలోకి దిగాల్సి వచ్చిందని చెప్పారు. నియోజకవర్గంలో దాదాపు 44 వేల మంది జైన ఓటర్లు ఉన్నారని, వారంతా ఇదివరకు కటారియాకే మద్దతిచ్చారని, ఇప్పుడు సురాణాకు ఇస్తున్నారని, ఆయనకు మద్దతిస్తున్న బ్రాహ్మణ నాయకుడు మంగేలాల్‌ జోషి తెలిపారు. ఆరెస్సెస్‌లోని యువత కూడా సురాణాకే మద్దతిస్తోంది. సురాణా ఎన్నికల్లో విజయం సాధించాక తిరిగి బీజేపీ పార్టీలోకి వస్తారని ఆ యువత భావిస్తోంది.

కటారియాపై తిరుగుబాటు అభ్యర్థి సురాణా ఒక్కరే కాదు.. ప్రధాని నరేంద్ర మోదీ వీరాభిమాని, నమో విచార్‌ మంచ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌ రటాలియా కూడా పోటీ చేస్తున్నారు. కటారియాను రాజ్‌పుత్‌లు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘కటారియాను ఓడించే సత్తా ఎవరికి ఉంటే వారికే మేము ఓటు వేస్తాం’ అని ‘మేవర్‌ క్షత్రియా మహాసభ సంస్థాన్‌’ అధ్యక్షుడు తన్వీర్‌ సింగ్‌ కష్ణావత్‌ తెలిపారు. ఇదివరకు తామంతా బీజేపీకే మద్దతు ఇస్తూ వచ్చామని, మేవర్‌లో 28 సీట్లుంటే బీజేపీ ఇద్దరు రాజ్‌పుత్‌లకు మాత్రమే సీట్లు ఇచ్చిందని, ఈ కారణంగా ఈ సారి తాము బీజేపీని ఓడించేందుకే కంకణం కట్టుకున్నామని ఆయన తెలిపారు. కటారియా మాత్రం అంతిమంగా విజయం తనదేనని చెబుతున్నారు. ఫలితాలు వెలువడ్డాక మాట్లాడండి అని మీడియాతో వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీలపై ప్రజలు కోపంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించగా, ఆ అంశాలను ప్రజలు ఇప్పుడు మరచిపోయరని అన్నారు. మరి ఉద్యోగాల హామీ గురించి ప్రస్తావించగా, పకోడీల లాంటి థియరీ నాకోటి ఉందని, దాంతోని యువతను ఆకట్టుకున్నానని ఆయన చెప్పారు. కానీ ఆయన మొహంలో అంతకుముందున్న ధీమా కనిపించడం లేదు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top