ఇక యుద్ధం.. ఆన్‌లైన్‌!

Rahul Gandhi beat Narendra Modi in the social media battle - Sakshi

ఢీ అంటే ఢీ అంటున్న మోదీ, రాహుల్‌

సోషల్‌ మీడియా, వార్‌ రూమ్‌ వ్యూహాల్లో పోటీ  

ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం దగ్గర్నుంచి, ప్రత్యర్థులను ఎండగట్టే వరకు రాజకీయాల్లో ఇప్పుడు అందరిదీ ఒకే దారి. అదే సోషల్‌ మీడియా దారి. సామాజిక మాధ్యమాలు లేకుండా రాజకీయాల్లో అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి. ఇక, వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో సోషల్‌ మీడియా పాత్ర అత్యంత కీలకంగా మారనుంది. గత ఐదేళ్లలో ఎన్నికల్లో పార్టీల జయాపజయాలను ప్రభావితం చేసేంతటి శక్తిమంతమైన సాధనంగా మారింది.

2014 లోక్‌సభ ఎన్నికలప్పటికి సోషల్‌ మీడియా అంతగా ప్రాచుర్యంలో లేదు. అయితే, నరేంద్ర మోదీని ప్రధాని పీఠానికి చేరువ చేయడంలో సోషల్‌ మీడియానే కీలకమన్న అభిప్రాయమైతే బలంగా ఉంది. ముఖ్యంగా సోషల్‌ మీడియా ప్రచారం ద్వారా యువ ఓటర్లను ఆకర్షించడంలో మోదీ సక్సెస్‌ అయ్యారు. ఇది గ్రహించిన రాహుల్‌గాంధీ 2015లో ట్విట్టర్‌ ఖాతా ఓపెన్‌ చేశారు. అప్పటి నుంచి ఆన్‌లైన్‌ ప్రచారంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.

2014 ఎన్నికలనాటికి 15.5 కోట్ల మంది స్మార్ట్‌ ఫోన్లను వినియోగిస్తూ ఉంటే, ఇప్పుడు వారి సంఖ్య ఏకంగా 45 కోట్లకు చేరుకుంది. ఈసారి ఎన్నికల్లో దాదాపుగా 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అంటే ఓటర్లలో సగం మంది స్మార్ట్‌ ఫోన్లు వాడుతున్నారన్న మాట. గత ఎన్నికల సమయానికి ఫేస్‌బుక్, ట్విట్టర్‌ మాత్రమే ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. ఇప్పుడు వాట్సాప్‌ కూడా వచ్చింది. ఈ మూడు మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయడానికి బీజేపీ, కాంగ్రెస్‌లు సన్నద్ధమవుతున్నాయి.  

మోదీతో పోటీ అంత తేలిక కాదు
మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం వెనుక సోషల్‌ మీడియా పాత్ర చాలా ఉంది. రైతు, నిరుద్యోగ సమస్యల వంటి వాటిని బాగా ప్రస్తావించడానికి ట్విట్టర్‌ను వేదికగా చేసుకున్న రాహుల్‌ టెక్కీ మ్యాన్‌గా మారారు. కానీ, సోషల్‌ వార్‌లో మోదీతో పోటీ అంత సులువేం కాదు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఫాలోయింగ్‌ కలిగిన నేతల్లో ఒకరైన మోదీని ఫేస్‌బుక్‌లో 4.3 కోట్ల మంది, ట్విట్టర్‌లో 4.5 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. రాహుల్‌ను ట్విట్టర్‌లో 81 లక్షల మంది, ఫేస్‌బుక్‌లో 22 లక్షల మంది మాత్రమే ఫాలో అవుతున్నారు. అయితే ట్వీట్లు, రీట్వీట్లు, ట్వీట్లకి ఇచ్చే రిప్లయ్‌ల విషయంలో మోదీతో రాహుల్‌ పోటీపడుతున్నారు.

బీజేపీ ఇప్పటికే జిల్లా, మండల స్థాయిలో అన్ని రాష్ట్రాల్లోనూ సోషల్‌ మీడియా వార్‌ రూమ్‌లను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌కు రాష్ట్రస్థాయిలో మాత్రమే సైబర్‌ సైన్యం ఉంది. వాట్సాప్‌ వినియోగం ఎక్కువయ్యాక ఎక్కువగా వ్యాప్తి అవుతున్న తప్పుడు వార్తలను ఎదుర్కోవడమే పార్టీలకు అతి పెద్ద సవాల్‌. ఉన్నవీలేనివీ కల్పించి పోస్టులు షేర్‌ చేయడం, ప్రసంగాలను తమకు నచ్చిన విధంగా ఎడిట్‌ చేసి ప్రచారం చేయడం వంటివి ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉంటూ కౌంటర్‌ ఇవ్వగలగాలి. ఈ విషయంలో కాంగ్రెస్‌కంటే బీజేపీ ముందుంది. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో కాంగ్రెస్‌ కూడా సోషల్‌ మీడియాపై పట్టు సాధించడానికి సమాయత్తమవుతోంది.  

మొత్తం ఓటర్లు అంచనా   : 90,00,00,000
స్మార్ట్‌ఫోన్‌ వాడేవారు      : 45,00,00,000
ఫేస్‌బుక్‌ యూజర్స్‌        :30,00,00,000
వాట్సాప్‌ యూజర్స్‌       : 20,00,00,000
ట్విట్టర్‌ యూజర్స్‌          : 3,04,00,000

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top