‘రాఫెల్‌’ అవినీతిపై మోదీ బదులేది?

Rafael deal is biggest corruption case of NDA govt - Sakshi

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ

సాక్షి, బళ్లారి: రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ప్రధాని మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ విమర్శలను తీవ్రం చేశారు. ఇది దేశంలోనే అతిపెద్ద అవినీతి కుంభకోణమనీ, ఎంతో అనుభవమున్న ప్రభుత్వ రంగ హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)ను రాఫెల్‌ కాంట్రాక్టు నుంచి తప్పించి తన సన్నిహితుడికి ఎందుకు అప్పగించారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కర్ణాటకలోని బళ్లారి జిల్లా హొసపేటలో జరిగిన ఎన్నికల ‘జనాశీర్వాద్‌ యాత్ర’లో రాహుల్‌ మాట్లాడారు. ‘రాఫెల్‌’ వ్యవహారంపై తాను సంధించిన 3 ప్రశ్నలకు మోదీ జవాబివ్వలేకపోయారన్నారు. వెనుక నుంచి వచ్చే వాహనాలను అద్దంలో గమనిస్తూ నడిపే వాహనదారు మాదిరిగా.. ప్రధాని మోదీ గత కాంగ్రెస్‌ ప్రభుత్వాల విధానాలను విమర్శిస్తూ నోట్ల రద్దు, జీఎస్టీ వంటి తప్పిదాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వెనుక వాటిని చూస్తూ వాహనాన్ని ముందుకు నడిపితే ప్రమాదాలు తప్పవని వ్యాఖ్యానించారు.

ముందు చూపుతో ప్రభుత్వాన్ని నడుపుతున్న కర్ణాటక సీఎం సిద్దరామయ్యను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. మోదీ ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలతో నిరుద్యోగ యువతను మోసం చేసిందన్నారు. కాగా, బళ్లారి, కొప్పాల్, రాయిచూర్, కలబురిగి, బీదర్‌ జిల్లాల్లో నాలుగు రోజుల ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ బస్సులో ప్రయాణిస్తూ సభలు, ర్యాలీల ద్వారా ప్రజలను కలుసుకుంటున్నారు. కాగా, యూపీఏ హయాంలో 126 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందమే కుదరలేదని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు చెప్పాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top