
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని పోలీసు స్టేషన్లు తెలుగుదేశం పార్టీ సొంత ఆఫీసుల్లా మారిపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. అన్యాయానికి గురవుతున్న ప్రజలు పోలీసు స్టేషన్లను ఆశ్రయించలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అధికార తెలుగుదేశం పార్టీ పోలీసులను ప్రయోగించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిపై దాడులు చేయిస్తోందని విమర్శించారు. తిరుపతిలో తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై, అనంతపురంలో తనపై, సోమువీర్రాజు ఇంటిపై జరిగిన దాడులే అందుకు నిదర్శనమన్నారు.
అంతటితో ఆగకుండా తిరిగి తమపైనే అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. తన ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కేంద్ర హోంమంత్రిని సోమవారం కలసి ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన తెలిపారు. శనివారం ఢిల్లీ వచ్చిన కన్నా.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌ను కలసి కడపలో, తిరుపతిలో కోల్డ్‌చైన్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని మర్యాదపూర్వకంగా కలసినట్లు ఆయన వెల్లడించారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీస్తుందని ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని అమిత్ షా తమకు స్పష్టం చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుక్కను నక్కలా, నక్కను కుక్కలా చూపించే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రంపై నెట్టేందుకు కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.