ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ బొమ్మా బొరుసే

NRC NPR Like Heads And Tails Of A Coin Says Asaduddin Owaisi - Sakshi

నిజామాబాద్‌  సభలో అసదుద్దీన్‌

ఎన్‌పీఆర్‌ను నిలిపి వేయాలని సీఎం కేసీఆర్‌ను కోరాం

ఎంఐఎం మద్దతు ఎప్పటికీ కేసీఆర్‌కే ఉంటుంది..

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ), జాతీయ జనాభా రిజి స్టర్‌ (ఎన్‌పీఆర్‌)లు నాణానికి బొమ్మా బొరుసులాంటివేనని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యానించారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏ వల్ల ముస్లింలతోపాటు రానున్న రోజుల్లో క్రైస్తవులు, దళితులకు కూడా ఇబ్బందులు తప్పవని ఆయన ఆందో ళన వ్యక్తం చేశారు. ఎన్నార్సీ, సీఏఏకు వ్యతి రేకంగా ముస్లిం ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నిజామాబాద్‌ నగరంలోని ఈద్గా మైదానంలో జరిగిన బహిరంగ సభలో అసదుద్దీన్‌ ప్రసంగించారు. 

ఎన్‌పీఆర్‌ను ఆపాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేయగా త్వరలో అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని అసదుద్దీన్‌ పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందికరమైన చట్టాలను వ్యతిరేకిస్తామని కేసీఆర్‌ చెప్పారన్నారు. ఆయనకు ముస్లిం సమాజం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై అసద్‌ ప్రసంశల జల్లు కురిపించారు. కేసీఆర్‌ బతికున్నంత కాలం ఎంఐఎం ఆయనకు మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు. సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోదీకి ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉందని.. ఇద్దరూ హిందువులే అయినప్పటికీ కేసీఆర్‌ లౌకిక భావాలున్న నాయకుడని కొనియాడారు. నిజామాబాద్‌ సభకు మద్దతివ్వాలని కాంగ్రెస్‌ను రెండుసార్లు ఆహ్వానించినా ఆ పార్టీ స్పందించలేదని విమర్శించారు.

ఆ రెండు ఎన్‌పీఆర్‌లకు ఎంతో తేడా..
యూపీఏ హయాంలో 2010లో జరిగిన ఎన్‌పీఆర్‌కు, మోదీ ప్రభుత్వం 2020లో నిర్వహించనున్న ఎన్‌పీఆర్‌కు చాలా తేడా ఉందని అసదుద్దీన్‌ తెలిపారు. తాజా ఎన్‌పీఆర్‌లో కొత్తగా తల్లిదండ్రుల పేర్లు, వారు పుట్టిన ప్రాంతం, ఫోన్‌ నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ అధికారులకు సందేహం వస్తే అలాంటి వారి పేర్లను పక్కనబెట్టి వారికి నోటీసులు జారీ చేస్తారని, మూడు నెలల్లో ఆధారాలు చూపకపోతే పౌరసత్వం నిరాకరించే అవకాశాలున్నాయని అసద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో 29 శాతం మంది మాత్రమే జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటున్నారని, మిగతా వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. జనన ధ్రువీకరణ పత్రాన్ని అడిగితే సామాన్యుల ఆత్మగౌరవం దెబ్బతింటుందన్నారు. తామంతా ఇక్కడే పుట్టామని, ఇక్కడే మరణిస్తామని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో చర్చ సందర్భంగా పౌరసత్వ సవరణ బిల్లు (పార్లమెంటు ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం– సీఏఏ) ప్రతులను తాను చింపేయడాన్ని కొందరు ప్రశ్నించారన్న అసద్‌... మతప్రాతిపదికన తెచ్చే బిల్లులను తాను చింపేస్తానని స్పష్టం చేశారు.

మోదీ, అమిత్‌ షావి అబద్ధపు మాటలు..
ఎన్నార్సీ, సీఏఏల విషయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షావి అబద్ధపు మాటలని అసదుద్దీన్‌ విమర్శించారు. ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాన్ని చూసి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు కంటి మీద కునుకు కరువైందన్నారు. మతం పేరుతో దేశాన్ని విభజించాలని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంబేడ్కర్, గాంధీజీ కలలు కన్న రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ చదివిన ఎంటైర్‌ పొలిటికల్‌ సైన్స్‌ అనే డిగ్రీ ప్రపంచంలో ఎక్కడా లేదని ఎద్దేవా చేశారు.

ఆర్‌ఎస్‌ఎస్‌పైనా ఘాటు వ్యాఖ్యలు..
దేశ రాజ్యాంగంలో తలదూర్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని అసదుద్దీన్‌ మండిపడ్డారు. 90 ఏళ్లపాటు చెడ్డీ వేసుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌... ఇప్పుడు ప్యాంటు ధరిస్తోందని ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని రక్షించేందుకు ఇలాంటి సభలను నిర్వహిస్తున్నామన్న ఎంఐఎం అధినేత... రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 ప్రకారం దేశంలో అన్ని మతాలకు సమాన హక్కుందని గుర్తుచేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఎందరో ముస్లిం వీరులు త్యాగాలు చేశారన్నారు. అస్సాం పునరావాస కేంద్రాల్లో 19 లక్షల మంది ఉన్నారని, వారిలో 5.40 లక్షల మంది ముస్లింలని పేర్కొన్నారు. 

‘మిగతా వారికి పౌరసత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి 5.40 లక్షల మంది ముస్లింలు తమ పౌరసత్వం కోసం ఎవరిని ఆశ్రయించాలి?’అని అసద్‌ ప్రశ్నించారు. తొమ్మిదేళ్ల నుంచి ఉన్న వారిలో 28 మంది మరణించారని, మిగిలిన వారు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి వస్తోందన్నారు. రాజ్యాంగంలోని ముందుమాటను సభకు హాజరైన వారితో అసదుద్దీన్‌ చదివించారు. ఈ సభలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు షకీల్‌ అమేర్‌ (బోధన్‌), నల్లమడుగు సురేందర్‌ (ఎల్లారెడ్డి), జెడ్పీ చైర్‌పర్సన్‌ దాదన్నగారి విఠల్‌రావు, న్యూడెమోక్రసీ నాయకులు, పలు ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top