ఎవరితోనూ విభేదాలు లేవు

No Conflicts In Party Leaders Said By Gadwal MLA - Sakshi

సాక్షి, గద్వాల: పార్టీలో కానీ, మా మధ్య ఎలాంటి విబేధాలు లేవని ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహాం అన్నారు. గత రెండు రోజులుగా పత్రికల్లో వస్తున్న విషయాలను ఎమ్మెల్యేలు ఇరువురూ ఖండించారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ, మంత్రి, మా మధ్య కానీ బేధాభిప్రాయాలు లేవన్నారు. వ్యక్తిగత కారణాలతోనే గన్‌మెన్లను సరెండర్‌ చేశానని తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో భద్రత అవసరం లేదని భావించినట్లు పేర్కొన్నారు.

ఈ విషయంలో పార్టీకి, మంత్రులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పార్టీని, సీఎం కేసీఆర్, పార్టీ అధ్యక్షులు కేటీఆర్‌ను గౌరవిస్తామని, వారి ఆదేశానుసారం నడిగడ్డ అభివృద్ధికి పని చేస్తామన్నారు. నడిగడ్డపై అభిమానంతో సీఎం కేసీఆర్‌ అడిగిన వెంటనే తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల పథకాలు, సుమారు కోట్లాది నిధులు ఇచ్చారని తెలిపారు. సాంకేతిక కారణాలు, పరిపాలన పరమైన కారణాలతోనే సీఈఓ మార్పు జరిగిందని స్పష్టం చేశారు. 

అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి
అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్‌లు మాపై గురుత్వర బాధ్యతలు పెట్టారని అన్నారు.  పార్టీ భీ–ఫామ్‌లు ఇచ్చిన కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న గద్వాల, అలంపూర్‌ ప్రాంతాల్లో గులాబీ జెండా ఎగురవేసేలా చేశారన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. నడిగడ్డకు ఇద్దరు ఎమ్మెల్యేలు రెండు కళ్లలాగా ఉండి పని చేస్తామని చెప్పారు. మాలో గ్రూపులు లేవు, తగాదాలు అసలే లేవన్నారు.

మమ్మల్ని నమ్మి నడిగడ్డ ప్రజలు అవకాశం కల్పించారని, వారి నమ్మకాన్ని నిలబెడుతూ సీఎం కేసీఆర్‌ కలలు గంటున్న బంగారు తెలంగాణ దిశగా పని చేస్తామన్నారు.  సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్‌ బండారి భాస్కర్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు బీఎస్‌.కేశవ్, ఎంపీపీలు తిరుమల్‌రెడ్డి, విజయ్, జెడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సుభాన్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top