పవార్‌కు షాక్‌.. ఎన్సీపీలో చీలిక!

NCP May Split By Ajit Pawar - Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మలువు తిరిగింది. ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతుతో సీఎం పీఠం ఎక్కాలన్న శివసేన ఆశలకు బీజేపీ గండికొట్టింది. తెరవెనక రాజకీయాలు చేసి ఎన్సీపీని తన వైపుకు తిప్పుకుంది. కూటమి ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేనే ఉంటారని శుక్రవారం రాత్రే శరద్‌ పవార్‌ ప్రకటించారు. ఈలోపే దేవేంద్ర ఫడ్నవిస్‌ కేంద్ర పెద్దల సూచనలతో ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌తో రహస్య మంతనాలు చేశారు. తమకు మద్దతు ఇస్తే డిప్యూటీ సీఎంతో పాటు ఉన్నత పదవులను ఇస్తామని ఆఫర్‌ చేశారు. అయితే తొలి నుంచి ఉద్ధవ్‌ ఠాక్రేకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న అజిత్‌ పవార్‌ బీజేపీ నేతల చేతులు కలిపినట్లు తెలుస్తోంది. అజిత్‌  చర్యతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతలు షాక్‌కి గురయ్యారు.

అయితే ఈ వ్యవహారమంతా శరద్‌ పవార్‌కు తెలియకుండా అజిత్‌ పవార్‌ జాగ్రత్త పడ్డారు. ఈ నేపథ్యంలోనే 22 మంది ఎమ్మెల్యేలతో బీజేపీకి మద్దతు ప్రకటించి, ఎన్సీపీలో చీలిక తెచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 145 మంది సభ్యుల మద్దతు అవసరం. ఎన్సీపీలో అజిత్‌ వెంట ఉన్న 22 మంది ఎమ్మెల్యేలతో పాటు స్వంతంత్ర సభ్యుల మద్దతులో బలనిరూపణ చేస్తారని తెలుస్తోంది.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top