చుట్టుముట్టు గట్టి పోటీ

Nalgonda Constituency Review in Lok Sabha Election - Sakshi

నల్లగొండ లోక్‌సభలో హోరాహోరీ

టీపీసీసీ చీఫ్‌పై పోటీకి టీఆర్‌ఎస్‌ ‘కొత్త ముఖం’

క్షేత్రస్థాయిలో ‘కారు’కే రూటు క్లియర్‌

ఉత్తమ్‌ వర్సెస్‌ కేసీఆర్‌గా ప్రచార హోరు

నల్లగొండ లోక్‌సభ స్థానంలో నెలకొన్న పోటీ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ కలిగిస్తోంది. ఇక్కడి నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పోటీకి దిగగా, టీఆర్‌ఎస్‌ నుంచి కొత్త అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి బరిలో ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు కూడా అయిన ఉత్తమ్‌ ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన నేత. ఆయనపై అధికార టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఈ ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని బరిలోకి దింపి ప్రయోగం చేస్తోంది. మరోవైపు సీపీఎం మహిళా అభ్యర్థిగా ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి పోటీలో ఉన్న గార్లపాటి జితేంద్రకుమార్‌ కూడా రాజకీయాలకు కొత్తే. మొత్తంగా నాలుగు ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నా రసవత్తర పోరు మాత్రం అధికార టీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ మధ్యే ఉండనుంది. హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా ఉంటూ ఎంపీగా ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పోటీ చేస్తుండటంతో ఆయనకు ఈ పోటీ ప్రతిష్టాత్మకం కానుంది.-గ్రౌండ్‌ రిపోర్టు-  బొల్లోజు రవి

కాంగ్రెస్‌ కోటకు బీటలు
ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కానీ నల్లగొండలో అత్యధిక సార్లు గెలిచిన రికార్డు కాంగ్రెస్‌దే. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ నల్లగొండ స్థానం నుంచి ఏకంగా 1.93 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ సూర్యాపేట మినహా మిగిలిన ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ అభ్యర్థులే గెలుపొందారు. గత పార్లమెంట్‌ ఎన్నికల చరిత్ర చూసినా కాంగ్రెస్‌.. లేదంటే కమ్యూనిస్టులే ఈ స్థానాన్ని నిలుపుకుంటూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన తొలి ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్‌ మూడో స్థానానికి పరిమితమైంది. కానీ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్‌సభ పరిధిలోని శాసనసభ స్థానాల్లో లెక్కలు మారిపోయాయి. కాంగ్రెస్‌ అడ్రస్‌ గల్లంతైంది. ఇక్కడి ఏడు నియోజకవర్గాల్లో ఆరుచోట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలిచారు. çహుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాత్రమే గెలవగా.. నల్లగొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేటలో టీఆర్‌ఎస్‌ జెండా ఎగరేసింది. ఈ పరిస్థితి మొత్తం రాజకీయ వాతావరణాన్నే మార్చేసింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని చూసి ఓటు వేసే పరిస్థితి లేదన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది. పైగా ఆరు నియోజకవర్గాల్లో గెలిచిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రస్తుత నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి.. వీరంతా ఏకమై కొత్త అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డిని గెలిపించేందుకు కార్యోన్ముఖులయ్యారు. కానీ కాంగ్రెస్‌ తరపున ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి నియోజకవర్గం మినహా మిగిలినచోట్ల పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే వారే  కరువయ్యారు.

‘కారు’ దూకుడు.. కాంగ్రెస్‌లో గడబిడ
ఈ ఎన్నికలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించినవన్న భావన కూడా ప్రజల్లో ఇంకా నాటుకోలేదు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ మధ్య అన్న అభిప్రాయమే సాధారణ ప్రజానీకంలో వ్యక్తమవుతోంది. పోనీ కేంద్రంలో తామే అధికారంలోకి వస్తామని, రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని, గెలిస్తే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర మంత్రి అవుతారన్న ప్రచారాన్ని సాగించడంలో కాంగ్రెస్‌ విఫలమైందని ప్రజలు అంటున్నారు. పైగా టీఆర్‌ఎస్‌ మాత్రం కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా సంపూర్ణ మెజార్టీతో రారని, సంకీర్ణ రాజకీయాలు ఉంటాయని, కాబట్టి చక్రం తిప్పాలంటే 16 ఎంపీ సీట్లు గెలవాలంటూ ఆ పార్టీ చేస్తున్న ప్రచారం ప్రజల్లో బాగానే నాటుకుంటోంది. ఇక్కడ అభ్యర్థి కంటే కూడా కేసీఆర్‌ విధానాలు, ఆరుగురు ఎమ్మెల్యేల ప్రభావమే ఎక్కువ పనిచేస్తోంది. ఒకవేళ కేంద్రంలో తామే అధికారంలోకి వస్తామని, అప్పుడు కాంగ్రెస్‌ తరపున తనను గెలిపిస్తే రాష్ట్రానికి సేవ చేయడానికి వీలుంటుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భరోసా కలిగించగలిగితే హోరాహోరీ పోరు జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్‌ ఎన్నికల పరిస్థితి వేర్వేరుగా ఉంటుందని, దేశ రాజకీయాలు, ప్రధాని ఎవరు కావాలనే అంశాన్ని బట్టే ఓటింగ్‌ ఉంటుందని కాంగ్రెస్‌ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఆ పార్టీ నేతల్లో నల్లగొండ ఎంపీ స్థానంలో గెలుస్తామన్న ధీమా వ్యక్తమవుతోంది. మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో మంత్రులుగా, ఇతరత్రా హోదాల్లో  కీలకంగా పనిచేసిన జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఈ లోక్‌సభ పరిధిలో ఉండటంతో కాంగ్రెస్‌లో ఆశలు రేపుతోంది. అయితే వీరి మధ్య సఖ్యత లేకపోవడం లోపంగా మారుతోంది.

ఏడింటా ఆరు సీట్లు ‘కారు’వే..
నల్లగొండ: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గ ప్రజలు టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచారు. పట్టణంతోపాటు నాలుగు మండలాల పోలింగ్‌ సరళిలో ఇదే తేటతెల్లమైంది. నియోజకవర్గంలో 2,16,807 ఓట్లు ఉండగా, 1,82,388 పోలయ్యాయి. అందులో నల్లగొండ కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 75,094 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి 98,792 ఓట్లు పొంది.. 23,698 మెజారిటీతో గెలిచారు.

మిర్యాలగూడ :మిర్యాలగూడ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావుకు ఆధిక్యం లభించింది. సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి ఆర్‌.కృష్ణయ్యపై నల్లమోతు భాస్కర్‌రావు భారీ మెజారిటీతో గెలిచారు. నియోజకవర్గంలో 1,79,037 ఓట్లు పోల్‌ కాగా, భాస్కర్‌రావుకు 83,931 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆర్‌.కృష్ణయ్యకు 53,279 ఓట్లే వచ్చాయి.

దేవరకొండ: ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లో టీఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీ కట్టబెట్టారు. ప్రతీ మండలంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రవీంద్రకుమార్‌ ఆధిక్యం ప్రదర్శించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 96,188 ఓట్లు, ప్రజాకూటమి అభ్యర్థి బాలూనాయక్‌కు 57,301 ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రవీంద్రకుమార్‌కు 38,887 మెజారిటీ లభించింది.

నాగార్జునసాగర్‌: రెండు దశాబ్దాల అనంతరం నాగార్జునసాగర్‌ ఓటర్లు మార్పు కోరుకున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డిని కాదనుకొని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్యను ఆదరించారు. రెండు పార్టీల అభ్యర్థులకు పోటాపోటీగా ఓట్లు పోలైనా గుర్రంపోడు, తిరుమలగిరి, అనుముల ఓటర్లు మాత్రం టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపడంతో తొలిసారి ఇక్కడ ‘గులాబీ’ గుబాళించింది.

సూర్యాపేట: అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి.. కాంగ్రెస్‌ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి గట్టి పోటీనే ఇచ్చారు. దీంతో సూర్యాపేట పట్టణంతోపాటు అన్ని మండలాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి వెయ్యి, రెండు వేల ఓట్ల మెజారిటీతోనే గట్టెక్కారు.

హుజూర్‌నగర్‌: ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వరుసగా మూడోసారి గెలుపొందారు. ఆయన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై 7,466 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నువ్వానేనా అన్నట్టు సాగిన హోరాహోరీ పోరులో ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీ విజేతగా నిలిచింది.

కోదాడ: ఇక్కడ కాంగ్రెస్‌ (పద్మావతి ఉత్తమ్‌)– టీఆర్‌ఎస్‌ (బొల్లం మల్లయ్య యాదవ్‌) మధ్య హోరాహోరీ పోరు నడిచింది. చివరకు కోదాడ ఓటర్లు టీఆర్‌ఎస్‌కే ఓటేశారు. నడిగూడెం, మోతె, మునగాల మండలాల్లో టీఆర్‌ఎస్‌కు ఆధిక్యం లభించింది.

నాపై పోటీయా?  – ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి
భూ కబ్జాకోరుకు ఎంపీ సీటు ఇవ్వటం టీఆర్‌ఎస్‌కే చెల్లింది. ఎంపీటీసీగా కూడా గెలవలేని వ్యక్తిని ఎంపీ స్థానానికి నిలబెట్టడం టీఆర్‌ఎస్‌ దివాలాకోరుతనానికి నిదర్శనం. నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా నల్లగొండ జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశాను. కష్ట కాలంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే నల్లగొండ స్థానంలో ఎంపీగా పోటీకి నిలబడ్డాను. ప్రజలు నన్ను ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తే జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతాను. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నల్లగొండ లోక్‌సభ పరిధిలో ఒక్క సాగు నీటి ప్రాజెక్టును కూడా తీసుకురాలేదు. మిషన్‌ భగీరథ పేరుతో వందల కోట్లు దండుకున్నారు. వృత్తిరీత్యా పైలట్‌నే అయినా రాజకీయాల్లో దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్నాను. పిల్లలు లేకుండా నేను, నా భార్య ప్రజా సేవ చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలే మాకు పిల్లలు.

కేసీఆర్‌ను చూసే ఓట్లేస్తారు– వేమిరెడ్డి నర్సింహారెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు కావచ్చు. నేనూ రాజకీయాలకు కొత్త కాదు. 1987లో ఎంపీపీగా పోటీ చేశాను. అప్పటి నుంచి రాజకీయాల్లో ఉంటూనే ఉన్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు ఓట్లేస్తారు. పైగా నల్లగొండ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరింటిని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. కాబట్టి నా గెలుపు నల్లేరు మీద నడకే.

నా కంటే ఎక్కువ మెజారిటీ ఖాయం– గుత్తా సుఖేందర్‌రెడ్డి, ప్రస్తుత ఎంపీ
నాకు 2014లో నల్లగొండ ఎంపీ స్థానంలో 1.93 లక్షల మెజారిటీ వచ్చింది. ఈసారి వేమిరెడ్డి నర్సింహారెడ్డికి అంతకంటే ఎక్కువ వస్తుంది. కోదాడ, హుజూర్‌నగర్‌లో కూడా మాకే ఆధిక్యం లభిస్తుంది. ఈసారి అభ్యర్థిని బట్టి కాక కేసీఆర్‌ విధానాలను చూసి ప్రజలు ఓటేస్తారు. ప్రభుత్వం చేసిన పనులే గెలిపిస్తాయి. కేంద్రంలో వచ్చే ప్రభుత్వం ఈసారి ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి టీఆర్‌ఎస్‌కు 16 సీట్లు వస్తే కీలకంగా మారతాం.

ఎమ్మెల్యే పదవికిరాజీనామా చెయ్‌– జగదీశ్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి
నల్లగొండ లోక్‌సభ స్థానంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పోటీ చేస్తున్నారంటే ముందు ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలి. అలా చేయడం లేదంటే ఆయన ఓటమిని అంగీకరించినట్టే. అసలు ఆయన హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోనే బొటాబొటీ మెజారిటీతో గెలిచారు. ఇక ఈ లోక్‌సభ స్థానంలో ఏడు నియోజకవర్గాల్లో ఆరింటిని టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. కాబట్టి ఆయనకు ఓటమి తప్పదు. దేశంలో ఏ పార్టీ పూర్తి మెజారిటీతో గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి టీఆర్‌ఎస్‌ 16 ఎంపీ సీట్లు గెలిస్తే కేంద్రంలో కీలకమవుతుంది.

అలా చేస్తే పేదలకు మేలయితది!– సీహెచ్‌.సైదులు, దాసారం, ఆత్మకూర్‌ (ఎస్‌)
నాకు మూడెకరాల భూమి ఉంది. పట్టా ఇస్తామన్నారు కానీ ఇప్పటికీ ఇవ్వలేదు. ఉచితంగా పట్టా చేస్తామన్నారు కానీ చేయలేదు. అధికారులే అడ్డం పడుతున్నరు. దీంతో నాకు రైతుబంధు డబ్బులు కూడా రాలేదు. ఇటువంటివి సరిదిద్దితే పేదలకు మేలు జరుగుతది. 

మంచిగ చేస్తున్రు..– పి.కృప, పాస్టర్,శెట్టిగూడెం, ఆత్మకూర్‌ (ఎస్‌)
రోడ్లు వేశారు. వారం పది రోజుల్లో మిషన్‌ భగీరథ కింద మంచినీరు రానున్నాయి. నల్లాలు కూడా వేశారు. ప్రజలకు ఏమేం కావాలో అన్నీ టీఆర్‌ఎస్‌ సర్కారు సమకూరుస్తోంది. సీఎం కేసీఆర్‌ అనేక మంచి పనులు చేస్తున్నారు.

గెలిచి చేసేదేముంది?– ప్రేమ్‌కుమార్, పెట్రోల్‌ బంకు, హుజూర్‌నగర్‌
వాతావరణం మొత్తం టీఆర్‌ఎస్‌కు అనుకూలంగానే ఉంది. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉత్తమ్‌కుమార్‌ గెలిచినా, ఇప్పుడు పరిస్థితి మారింది. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే మెజారిటీ ఓట్లు పడతాయి. కాంగ్రెస్‌ గెలిచి చేసేదేముంది?

నోటాకే ఓటు– రవికుమార్, వ్యాపారి, సూర్యాపేట
ఏ పార్టీ విధానాలు కూడా సరిగా లేవు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీకి వెళ్లిపోతున్నారు. ఈ పద్ధతి ఏమీ బాగాలేదు. కాబట్టి నోటాకే ఓటు వేయాలనుకుంటున్నా.

ఆయన చలవతోనే..– నర్సింహ, శెట్టిగూడెం, ఆత్మకూరు (ఎస్‌)
నాకు పింఛన్‌ వస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చలవతోనే నాకు రోజు గడుస్తోంది. మున్ముందు ఇంకా పెంచుతామన్నారు. కాబట్టి నేను ఆ పార్టీకే ఓటేయాలని నిర్ణయించుకున్నా.

ఆయన మంచోడు!– కె.గోవర్ధన్, సోడా బండి, కోదాడ
మాకు మొదటి నుంచీ ఉత్తమ్‌ తెలుసు. హుజూర్‌నగర్‌ను అభివృద్ధి చేశాడు. వ్యక్తిగతంగా మంచోడు. నాకు అర ఎకరం భూమి ఉంది. అయినా రైతుబంధు సొమ్ము రాలేదు.

రాజకీయాలు మారాలి– పొదిల సతీష్, వ్యాపారి, సూర్యాపేట
రాజకీయాల తీరుతెన్నులు బాగాలేవు. ప్రజల కోసం పనిచేసే వారికే ఓటు వేయాలి. ఆ ప్రకారమే ఆలోచించి ఓటు వేస్తా. ఎవరూ నచ్చకపోతే నోటాకు ఓటేస్తా.

సారూ..పుణ్యం కట్టుకో!– కోడి రాములు,రామపాడు, మోతె మండలం
పేదోళ్లకు అనేక మందికి గొర్రెలు ఇచ్చారు. కానీ నాకు మాత్రం ఇవ్వలేదు. కొడుకు, కూతురుతో బతుకుతున్నా.అధికారులు ఏవేవో చెబుతున్రు. కేసీఆర్‌ సారు కాస్త పుణ్యం కట్టుకుని నా జీవికకు గొర్లు ఇస్తే మంచిగుంటది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top