మోసగాళ్లకు మారుపేరు చంద్రబాబు  | Sakshi
Sakshi News home page

మోసగాళ్లకు మారుపేరు చంద్రబాబు 

Published Wed, Mar 20 2019 1:16 AM

Motkupalli Narasimhulu Comments On Chandrababu Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు, అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు ఒకప్పుడు అన్నదమ్ముల్లా ఉండేవారు. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు అందరి మధ్య చిచ్చు పెట్టిండు. ఐక్యంగా ఉన్న సమాజాన్ని తన స్వార్థపూరిత రాజకీయాల కోసం నిట్టనిలువునా చీల్చివేశాడు. అలాంటి మోసగాడు.. దగాకోరు చంద్రబాబును ఏపీ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ధ్వజమెత్తారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల వ్యతిరేకి చంద్రబాబును సార్వత్రిక ఎన్నికల్లో ఓడించి.. వైఎస్‌ జగన్‌కు పట్టంకట్టాలని ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్‌ గెలవొద్దని చంద్రబాబు కుట్ర పన్ని వైఎస్సార్‌ సీపీ ఓట్లు తీసివేశారని చెప్పారు. మోసగాళ్లకు మారుపేరు చంద్రబాబు అన్న విషయం ఏపీ ఓటర్లు మరువకూడదని సూచించారు. చంద్రబాబు ముఖంలో ఓటమి ఛాయలు కనిపిస్తున్నాయని.. ఆ భయంతోనే జగన్‌ కుటుంబంపై అవాకులు చెవాకులు పేల్చుతున్నాడని విమర్శించారు.  

బాబు ఓటమి ఖాయం... 
ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని.. అదే సందర్భంలో జగన్‌ సీఎం కావడం తథ్యం అని మోత్కుపల్లి జోస్యం చెప్పారు. చంద్రబాబుతో పొత్తు వల్లే ఓడిపోయామని టీకాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలు తరిమితే ఆంధ్రాలో పడ్డారని... 11న జరిగే ఎన్నికల్లో ఏపీ ప్రజలు తరిమికొడితే ఎక్కడ పడతారోనన్నారు. హరికృష్ణ మృతదేహం ముందు కేటీఆర్‌తో పొత్తుల గురించి చంద్రబాబు ఎందుకు చర్చించినట్లు అని ప్రశ్నించారు. తాను ఏది చేసినా రైటని.. ఇతరులు ఏది చేసినా తప్పన్నది చంద్రబాబు తీరని చెప్పారు. కేసీఆర్‌ తెలివి గలవాడు కాబట్టి ‘ఓటుకు కోట్లు’దొంగలను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారని తెలిపారు. కేసీఆర్‌ దెబ్బకు పదేళ్ల ఉమ్మడి రాజధాని వదిలి చంద్రబాబు అమరావతి పారిపోయాడన్నారు. టీడీపీ.. బీసీల పార్టీ అంటాడు తప్ప ఆ వర్గాల వారికి ఎలాంటి అవకాశాలు ఇవ్వరని మండిపడ్డారు. 

సొంత మామకే వెన్నుపోటు..
సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీ జెండాను దొంగిలించాడన్నారు. వైఎస్‌ జగన్‌ సొంత జెండా పెట్టుకొని పార్టీని నిలుపుకొని అవిశ్రాంత పోరాటం చేస్తున్నాడని, 40 ఇయర్స్‌ ఇండస్ట్రీకి నిద్ర లేకుండా చేస్తున్నాడని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చేస్తానని 20 ఏళ్లుగా మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకున్నారన్నారు. మాదిగలను తన స్వార్థం కోసం వాడుకొన్నారని, కాపులను సైతం వంచిస్తున్నారని పేర్కొన్నారు. బలహీన వర్గాల వారిని జడ్జీలుగా హైకోర్టు రికమండ్‌ చేస్తే వారికి ఇవ్వకూడదని కేంద్రానికి లేఖ రాశాడన్నారు. నాలుగేళ్లపాటు ప్రధాని మోదీతో కలసి సహజీవనం చేసిన చంద్రబాబు కాపు రిజర్వేషన్లు ఎందుకు సాధించలేక పోయారని నిలదీశారు. వైఎస్సార్‌ కుటుంబం ఎప్పుడు ప్రజాసేవలో ఉండే కుటుంబం అని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూ వైఎస్సార్‌ ప్రాణాలు వదిలారన్నారు. మాట తప్పనిదిగా వైఎస్సార్‌ కుటుంబం ప్రజల్లో ముద్ర వేసుకుంటే... ప్రజలను వంచించే కుటుంబంగా నారా వారి కుటుంబం ముద్ర వేసుకొందని చెప్పారు. ఎన్నికల్లో గెలిచేందుకు బాబు ఎంతటి మోసానికైనా పాల్పడతాడని ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలని... వైఎస్‌ జగన్‌ని గెలిపించాలని దళిత నేతగా ఏపీ ఓటర్లకు పిలుపునిస్తున్నానని మోత్కుపల్లి వివరించారు.  

Advertisement
Advertisement