
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు చెప్పేదొకటి చేసేదొకటి అని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారం కోసం ఎన్ని అడ్డదారులైన తొక్కుతారని అన్నారు. గత ఎన్నికల్లో అధికార పీఠం దక్కించుకోవాలనే ఉద్దేశంతో అలివిగాని హామీలు ఇచ్చారన్నారు. ఏ ఒక్క హామీని అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను నిలువునా మోసగించారని మండిపడ్డారు.
శింగనమల నియోజకవర్గమంతా కూడా లేని సింగపూర్‌కు రైతులను తీసుకెళ్లారని దానివల్ల ఏమి ప్రయోజమన్నారు. ఇప్పటికైనా అపద్ధాలు చెప్పడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు వైఎస్‌ఆర్‌సీపీ వైపు చూస్తున్నారని అన్నారు. అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిత్యం ప్రజా ఉద్యమాలు చేపడుతున్నారని ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి అన్నారు.
దేశంలో ఏపార్టీకి లేనంత యువత మద్దతు తమ పార్టీకి ఉందన్నారు. వైఎస్ జగన్ చేపట్టబోయే పాదయాత్రకు సంఘీభావంగా పార్టీ నాయకుడు వైవీ శివారెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 3న పూజలు, అన్నదానం, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరపురం నియోజవర్గ సమన్వయ కర్త నదీం అహమ్మద్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయాల్లో మార్పు తెస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టిన మూడున్నరేళ్లో ఏమి చేశారు, ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను వంచించారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీ ఏపీ ప్రజలను మసిపూసి మారెడుకాయ చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం ప్రపంచ దేశాలు తిరగడం వల్ల లాభం లేదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తే ఆయా దేశాలు వెతుక్కుంటూ వస్తాయన్నారు. చంద్రబాబు పాలనపై విసిగిపోయిన ప్రజలు కసిగా ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చతంగా జిల్లా మొత్తం వైఎస్‌ఆర్‌సీపీ జెండా ఎగురవేస్తామన్నారు.
నాయకుడు వైవీ శివారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉంటారన్నారు. ఆయన చేపట్టే పాదయాత్ర విజయవంత కావాలని ఆకాంక్షిస్తూ ఈ నెల 3న తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.