
సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లకు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వారిలో ఇంకా మార్పు రాలేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. దుష్ట ఆలోచనలతోనే ఛీప్ మార్షల్, మార్షల్స్ పై దాడికి దిగి నోటికొచ్చినట్లుగా మాట్లాడారని మండిపడ్డారు. ఉద్యోగులపై దాడులకు దిగడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు, లోకేష్‌లు వ్యవహరించారని దుయ్యబట్టారు. వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో గందరగోళం సృష్టించి.. ప్రజల్లో సానుభూతి పొందాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు చూస్తున్నారన్నారు. అసూయ, ద్వేషం, అహంకారంతో రగిలిపోతున్న చంద్రబాబును ప్రజలు అరకొర మెజార్టీతో ప్రతిపక్షంలో కుర్చోపెట్టారన్నారు.
యుద్ధ ప్రాతిపదికన సంక్షేమ పథకాలు..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బడుగు, బలహీన వర్గాల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయడం ద్వారా ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నామని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ..కాలం వెళ్లదీస్తున్న చంద్రబాబుకు వచ్చే స్థానిక ఎన్నికల్లో మరోసారి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని గోపాల్ రెడ్డి పేర్కొన్నారు.