కన్నీరు పెట్టుకున్న పుష్పశ్రీవాణి

MLA Pushpa Srivani Gets Emotional And Alleges Ex Minister Planned Her Murder - Sakshi

సాక్షి, విజయనగరం : పోలింగ్‌ సందర్భంగా ఈనెల 11న జియ్యమ్మవలస మండలం చినకుదమ గ్రామంలో తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కురుపాం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పుష్పశ్రీవాణి డీఐజీ పాలరాజు, ఎస్పీ దామోదర్‌లకు వినతిపత్రం సమర్పించారు. తనపై దాడికి పాల్పడిన డొంకాడ రామకృష్ణ, ఇతర టీడీపీ నేతలపై ఆమె ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని కన్నీటి పర్యంతమయ్యారు. తనని హత్య చేసేందుకు మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కుట్ర పన్నారని ఆరోపించారు.  ఒక మహిళా ఎమ్మెల్యేపై దాడి జరిగినా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. తనకి న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని.. అయితే న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్లే ధైర్యం ఉందని పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు.

కాగా డొంకాడ రామకృష్ణపై ఫిర్యాదు చేసే క్రమంలో ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణితో పాటు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, బడుకొండ అప్పలనాయుడు, పెన్మత్స సాంబశివరాజు, పార్వతీపురం అభ్యర్థి అలజంగి జోగారావు., జిల్లా ఎస్సీ సెల్ ఇంచార్జ్‌ పి. జైహింద్ కుమార్ కూడా డీఐజీ పాలరాజును కలిశారు. ఇక టీడీపీ నేతలు పుష్పశ్రీవాణి, ఆమె భర్త పరీక్షిత్‌ రాజుపై హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు వెళ్లిన మహిళా ఎమ్మెల్యేపైనే ఏకంగా దాడికి తెగబడ్డారు. ఆమె భర్తపైనా దాడికి పాల్పడి వారి అనుచరులతో సహా ఓ గదిలో నిర్బంధించారు. దీంతో  ఎమ్మెల్యే దంపతులు మూడు గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చీకటి గదిలో గడిపారు. గాలి, వెలుతురు లేని ఆ గదిలో  పుష్పశ్రీవాణి స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు కూడా ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు అవకాశం ఏర్పడలేదు. చాలా సమయం తరువాత ఏఎస్పీ రాకతో స్థానిక మీడియా, వైద్యులు చేరుకున్నారు. ఎమ్మెల్యేకు ప్రాధమిక చికిత్స అందించిన అనంతరం పోలీసు బలగాల భద్రత నడుమ వారిని, వారితో ఉన్న అనుచరులను రక్షించి క్షేమంగా ఇంటికి తరలించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top