ఇంటి గోడపై వైఎస్సార్‌ కుటుంబం స్టిక్కర్‌, చింతమనేని చిందులు

MLA Chintamaneni Prabhakar fired on former surpunch wife - Sakshi

రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని ఎమ్మెల్యేని కోరిన మాజీ సర్పంచ్‌ భార్య

ఆగ్రహంతో ఊగిపోయి వారి బడ్డీకొట్టును తీయించిన వైనం

లింగారావుగూడెం (ఏలూరు రూరల్‌) : దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మరోసారి చిందులు తొక్కారు. కాలనీలో డ్రెయినేజీ, రోడ్డు లేక అవస్థలు పడుతున్నామని అడిగిన పాపానికి వారికి చెందిన బడ్డీకొట్టును వెంటనే పంచాయతీకి తరలించాలని అధికారులను ఆదేశించారు. తననే ప్రశ్నిస్తారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు మండలం మాదేపల్లి శివారు గ్రామమైన లింగారావుగూడెంలో చింతమనేని ప్రభాకర్‌ మంగళవారం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కాలనీలో పర్యటించారు. గూడెంలోని టీడీపీ మాజీ నాయకుడు, మాజీ సర్పంచ్‌ కొరపాటి తిరుపతిస్వామి ఇంటి వరకూ చేరుకున్నారు. ఆ సమయంలో తిరుపతిస్వామి భార్య మారతమ్మ, ఆమె కుమారుడు కాలనీలో డ్రైయినేజీ వ్యవస్థ సరిగా లేదని, రోడ్డు నిర్మించాలని ఎమ్మెల్యేను కోరారు.

ఎంతో కాలంగా వేడుకుంటున్నా పట్టించుకోలేదన్నారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో వారి ఇంటి గోడపై వైఎస్సార్‌ కుటుంబం స్టిక్కర్‌ అంటించి ఉండడంతో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వచ్చి మీ కాలనీ అభివృద్ధి చేస్తారంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. అదే అక్కసుతో తిరుపతిస్వామి ఇంటి ముందు ఉన్న బడ్డీకొట్టును చూశారు. రోడ్డు, డ్రెయినేజీకి అడ్డుగా ఉందంటూ వెంటనే బడ్డీకొట్టును తొలగించాలని అధికారులను ఆదేశిం చారు. దీంతో గ్రామకార్యదర్శి అనిల్‌తో పాటు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రాధాకృష్ణ తమ సిబ్బందితో బడ్డికొట్టును గునపాలతో పెకలించి ఆఘమేఘాల మీద తొలిగించారు. ట్రాక్టర్‌పై ఎక్కించి హుటాహుటిన పంచాయతీ కార్యాలయానికి తరలించారు.

30 ఏళ్లుగా టీడీపీకి సేవలు
మాజీ సర్పంచ్‌ తిరుపతిస్వామి ముప్పై ఏళ్లుగా టీడీపీలో ఉన్నారు. టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ కమిటీ సభ్యుడుగా కూడా సేవలందించారు. 2001 నుంచి 2006 వరకూ సర్పంచ్‌గా పనిచేసి టీడీపీ బలోపేతానికి కృషి చేశారు. చింతమనేని వ్యవహారశైలి నచ్చక కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల వైఎస్సార్‌ కుటుంబం కార్యక్రమంలో పాల్గొని పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చింతమనేని ఆయనపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని స్థానిక నాయకులు తెలిపారు. టీడీపీకి ఎంతో సేవ చేశారని స్థానిక నేతలు చెప్పినప్పటికీ పట్టించుకోకుండా ఆయనకు చెందిన బడ్డీకొట్టును తీయించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top