మీడియా స్వేచ్ఛ ముసుగులో.. ప్రభుత్వంపై కుట్ర | Ministers and government advisers comments with media | Sakshi
Sakshi News home page

మీడియా స్వేచ్ఛ ముసుగులో.. ప్రభుత్వంపై కుట్ర

Nov 2 2019 3:56 AM | Updated on Nov 2 2019 4:34 AM

Ministers and government advisers comments with media - Sakshi

సాక్షి, అమరావతి/హైదరాబాద్‌ : పత్రికా స్వేచ్ఛపై రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ గౌరవం ఉందని పలువురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీచేసిన జీఓ 2430 పత్రికా స్వేచ్ఛకు ఏ విధంగానూ భంగకరం కాదన్నారు. కానీ, అవాస్తవాలు, అభూత కల్పనలతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయాలన్న కుట్రతోనే టీడీపీ అనుకూల మీడియా ఈ జీఓపై అనవసర రాద్ధాంతం చేస్తోందని దుయ్యబట్టారు. కలాలకు సంకెళ్లు అంటూ దుష్ప్రచారంతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పన్నాగం పన్నిందని వారు విమర్శించారు. రాష్ట్ర మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, ప్రభుత్వ సలహాదారు కె. రామచంద్రమూర్తి సచివాలయంలోనూ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలోనూ, ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ హైదరాబాద్‌లో శుక్రవారం వేర్వేరుగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ అంశంపై మాట్లాడారు. 

రాజకీయ దురుద్దేశ్యంతోనే దు్రష్పచారం : పేర్ని  
నిజాయితి, విలువలతో కూడిన జర్నలిజాన్ని రాష్ట్ర ప్రభుత్వం సదా గౌరవిస్తుందని రాష్ట్ర సమాచార, రవాణా శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టంచేశారు. అభూత కల్పనలు, నిరాధార వార్తలు రాసి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేసే మీడియా యాజమాన్యాలు మాత్రమే దురుద్దేశంతో ‘కలాలకు సంకెళ్లు’ అంటూ తప్పుడు కథనాలు రాస్తున్నాయని మండిపడ్డారు. వ్యక్తిత్వాలను కించపరుస్తూ తప్పుడు వార్తలు రాసే పత్రికలు, టీవీ చానళ్లను ఏమీ అనకూడదని వాదించడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సాక్షి పత్రిక ఎడిటర్, పబ్లిషర్ల పేరు మీద జీఓలు జారీచేసి మరీ కేసులు పెట్టినప్పుడు ఎవరూ ఎందుకు ప్రశ్నించలేదన్నారు.   

తప్పుడు వార్తలు రాసే కలాలకే..: కొడాలి నాని  
ప్రభుత్వం జారీచేసిన జీఓతో కలాలకు సంకెళ్లు పడలేదని మరో మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) స్పష్టంచేశారు. తనకు భజన చేస్తూ డబ్బా కొట్టే కొన్ని కులాలకు సంకెళ్లు పడ్డాయన్నారు. ఈ రాష్ట్రాన్ని ఎప్పటికీ చంద్రబాబే పాలించాలి.. మేం ఏది చెబితే అది జరగాలి.. భూములు, కమీషన్లు దండుకోవాలనుకునే మీడియా అధిపతులే ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిచ్చి రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. కోర్టు హాజరు నుంచి మినహాయింపు కోరుతూ సీఎం వైఎస్‌ జగన్‌ వేసిన పిటిషన్‌ మీద సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. చంద్రబాబు కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారని విరుచుకుపడ్డారు. సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. 

రాజ్యాంగబద్ధంగానే జీఓ : కె. రామచంద్రమూర్తి 
అవాస్తవాలు రాసి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే మీడియా సంస్థలపై న్యాయస్థానంలో దావా వేసేందుకు శాఖాధిపతులకు అనుమతిస్తూ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే జీఓ జారీచేసిందని ప్రభుత్వ సలహాదారు (పబ్లిక్‌ పాలసీలు) కె. రామచంద్రమూర్తి స్పష్టంచేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగకరంగా వార్తలు రాస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సమాచార శాఖ కమిషనర్‌కు అధికారం ఉండేదన్నారు. వికేంద్రీకరణలో భాగంగా ప్రస్తుత సర్కారు ఆ అధికారాన్ని అన్ని శాఖల అధిపతులకు  కల్పించిందన్నారు. దురుద్దేశంతో అవాస్తవాలు రాసే మీడియా సంస్థలే కేసులకు భయపడతాయన్నారు.  

వర్గ ప్రయోజనాల కోసమే అసత్యాలు : అంబటి 
రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థలు స్వప్రయోజనాలు, వర్గ ప్రయోజనాల కోసమే అవాస్తవాలు రాస్తున్నాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛకు ఎంతటి ప్రాధాన్యముందో వ్యక్తుల స్వేచ్ఛకూ అంతే ప్రాధాన్యముందన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించే దురుద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు.  

నిజాలు రాసే వారు భయపడక్కర్లేదు : అమర్‌  
కాగా, ఏపీ సర్కారు తీసుకువచ్చిన జీఓతో సత్యాలు రాసే పాత్రికేయులు, దానిని ప్రచురించే పత్రికా యాజ మాన్యాలు భయపడాల్సిన అవసరంలేదని ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ అన్నారు. అసత్యాలు, అభూత కల్పనలు రాస్తున్న మీడియా సంస్థలకే ఇది ఇబ్బందికరమన్నారు. పత్రికా స్వేచ్ఛపై ఏపీ ప్రభుత్వానికి సంపూర్ణమైన గౌరవం ఉందని ఆయన స్పష్టంచేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement