కౌలు రైతులకు కూడా రైతు భరోసా : మంత్రి కన్నబాబు

Minister Kurasala Kannababu Says Will Give Subsidy On Corn Ground Nut Seeds - Sakshi

అక్టోబరు నుంచి రైతు భరోసా అమలు

కౌలు రైతులకు కూడా వర్తింపు

విత్తనాలపై 40 శాతం సబ్సిడీ

వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు

సాక్షి, అమరావతి : రైతు, మహిళా సంక్షేమమే తమ ప్రభుత్వం మొదటి ప్రాథమ్యాలు అని వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు పునరుద్ఘాటించారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన ‘రైతు భరోసా’  పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేసేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. తద్వారా రాష్ట్రంలోని దాదాపు 15 లక్షల మంది కౌలు రైతులకు లబ్ది చేకూరనుందని వెల్లడించారు. అక్టోబరు నుంచి అమలుకానున్న ఈ పథకం ద్వారా పెట్టుబడి సాయంగా రూ. 12,500 అందించనున్నట్లు పేర్కొన్నారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతు సంక్షేమం గురించి ఒకరి చేత చెప్పించుకోవాల్సిన స్థితిలో తమ ప్రభుత్వం లేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చురకలంటించారు. చంద్రబాబు హయాంలో రైతులు అన్ని రకాలుగా దెబ్బతిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు జరుపకుండా ఇబ్బందులకు గురిచేశారన్నారు.

ఓట్ల కోసం నిధులు మళ్లించారు..
‘అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో గత ఎన్నికల్లో రుణమాఫీ చేస్తానని చంద్రబాబు మాట ఇచ్చారు. కానీ ఐదేళ్లలో ఆ హామీ గురించి ఏనాడు చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. రుణమాఫీ వ్యయాన్ని 24 వేల కోట్ల రూపాయలుగా చూపారు. బాండ్లు ఇచ్చి రైతులను మభ్యపెట్టారు. ఈ ఏడాది ఎన్నికల సమయంలో మళ్లీ హడావిడిగా అన్నదాత సుఖీభవ పథకం తీసుకువచ్చారు. రుణమాఫీ చేయకుండా కొత్త పథకం ఎందుకు తీసుకువచ్చారు? పౌర సరఫరాల శాఖ నుంచి నిధులు మళ్లించి వీటి కోసం ఉపయోగించుకోవాలని చూశారు. అదే విధంగా పసుపు కుంకుమ పథకానికి చివరలో నిధులు కేటాయించారు? ఇవన్నీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే చేసినట్లు కన్పిస్తోంది. రైతులు, మహిళలను మభ్యపెట్టి గెలవాలని చూశారు. కానీ ఇప్పుడు రైతుల గురించి నూతన ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ విమర్శలు చేస్తున్నారు. అసలు రైతు సంక్షేమం అంటేనే వైఎస్సార్‌ గుర్తుకువస్తారు. సీఎం వైఎస్‌ జగన్‌ కూడా రైతులకు ఇచ్చిన ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. మీతో చెప్పించుకోవాల్సిన స్థితిలో మేము లేము’ అంటూ మంత్రి కురసాల కన్నబాబు చంద్రబాబు పాలనా తీరును ఎండగట్టారు.

విత్తనాలపై 40 శాతం సబ్సిడీ
గత ప్రభుత్వం నిర్వాకం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వివిధ పథకాల నిధులు ఆగిపోయామని మంత్రి కన్నబాబు తెలిపారు. యూసీలు ఇవ్వకపోవడం వల్లే నిధులు విడుదల కాలేదని సమీక్షా సమావేశంలో తేలిందన్నారు. సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో త్వరలోనే విత్తన పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు. రాయలసీమలో వేరు శెనగ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మొక్కజొన్న విత్తనాలు పంపిణీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేశామన్నారు. ఈ రెండు విత్తనాలపై 40 శాతం సబ్సిడీ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top